అప్ప‌ట్లో `శివ‌` ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎంత‌ ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిందో .. ఇప్పుడు `గూఢ‌చారి` అంద‌రికీ అంతే ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తుంది – కింగ్ నాగార్జున‌

0
105

క్ష‌ణంతో సూప‌ర్‌హిట్ అయిన అడివిశేష్ హీరోగా.. శోభితా ధూళిపాళ హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢ‌చారి`. ఆగ‌స్ట్ 3న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా జ‌రిగిన స‌క్సెస్ మీట్‌కి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “ఈ సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినిమా ఫ్యూచ‌ర్‌. అంద‌రూ చాలా గొప్ప‌గా వ‌ర్క్ చేశారు. మీతో పాటు ట్రావెల్‌ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంతసేపు ఎలా చేశారో చూస్తుండిపోయాను. సినిమా బడ్జెట్‌ గురించి తెలుసుకుని.. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా ఎలా సాధ్యమైందని ఆలోచించాను. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలను చూసి మేం అంత సోంబేరులా, బద్దకస్తులమా, సినిమా తీయడం మాకు తెలియదా? అని మాకు అనిపించింది. టెక్నీషియన్స్ గురించి చెప్పాల్సి వ‌స్తే.. సినిమాటోగ్రాఫర్‌గా శనీల్ డియో గురించి చెప్పాలి. 17 రోజులు అన్నపూర్ణలో వీళ్లు షూటింగ్‌ చేశారు. అసలు నాకు తెలియని లొకేషన్స్‌ అన్నపూర్ణలో ఉన్నాయా? అనిపించింది. అంత గొప్ప‌గా తీశారు.. ఇది ఎలా సాధ్యమైంద‌ని నాకు సిగ్గేసింది. నాన్నగారు ఉండుంటే వీళ్ల‌ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. వీళ్లు వాడినట్లు అన్నపూర్ణ స్టూడియోను ఎవరు వాడలేద‌నుకుంటాను. డైరెక్టర్‌ శశి, అడివిశేష్‌, అబ్బూరి రవి కలిసి సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు అన్ని హీరోయిక్‌గా ఉన్నాయి. మేము పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి సీక్వెన్స్‌లు చేస్తే వీళ్లు మాత్రం ఇంటెలిజెన్స్‌తో సింపుల్‌గా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశారు. నాతో ఎవరైనా ఇలాంటి సినిమా చేస్తారా? అని ఎదురుచూశాను. కానీ ఎవరూ ఎదురుకాలేదు. నేను జెలస్‌గా, ఎగ్జయిటెడ్‌గా, హ్యాఫీగా ఫీలవుతున్నాను. ఈ సంవత్సరం తిప్పి తిప్పి మూడు సినిమాలు మాత్రమే ఆడాయి. రంగస్థలం, మహానటి తర్వాత గూఢచారి మాత్రమే ఆడింది. డబ్బులు చేసుకున్న మూడు సినిమాలు కూడా ఇవే. అలాగని ఇతర సినిమాలను నేను తక్కువ చేయడం లేదు. మీకున్న బడ్జెట్‌లో.. లిమిటేషన్స్‌లో.. వాటన్నింటినీ ఓవర్‌షాడో చేశారు. నిర్మాతలు సినిమాను ముందుగానే ఇంతగా నమ్మారా? అనిపిస్తుంది. ఓ స్పై మూవీ తెలుగులో ఎలా ఆడుతుంది? వీళ్లు ఏమీ తీస్తారు? మణిరత్నం బాంబే సినిమా కంటే ఏం చేస్తారు? అనిపించింది. నేటి ట్రెండ్‌కు తగినట్లు కమర్షియల్‌ వేల్యూస్‌, సెన్సిబిలిటీస్‌ మిక్స్‌ చేసి సినిమాను అద్భుతంగా చేశారు. శ్రీచరణ్‌ చిన్న బీప్‌తో స్టార్ట్‌ అయిన మ్యూజిక్‌ సినిమా అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ట్యూన్‌ నన్ను హాంట్‌ చేస్తుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా కొత్తగా ఉంది. అబ్బూరి రవి నాకు కూడా చాలా సినిమాలకు డైలాగ్స్‌ రాశారు. సినిమాలో చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి. శోభిత చాలా హాట్‌గా కనపడింది. చాలా ఎట్రాక్టివ్‌గా అనిపించింది. తను క్యారెక్టర్‌ను ఎంత చక్కగా దాచి..వేరే యాంగిల్స్‌లో చూపించారు. సెకండాఫ్‌లో ట్విస్ట్‌ నాకు బిగ్గెస్ట్‌ షాక్‌. నేను ఇన్‌వాల్వ్ అయిపోయాను. సినిమా చూసేట‌ప్పుడు నవ్వాను.. ఏడ్చాను. సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను చాలా చక్కగా నటించింది. తను రా ఆఫీసర్‌ రోల్‌కి చక్కగా సూట్‌ అయింది. మధుశాలిని.. తన పాత్రకు యాప్ట్‌ అయింది. ఫెంటాస్టిక్‌గా నటించింది. అడవిశేష్‌కి కంగ్రాట్స్‌. మిమ్మల్ని చూసి తెలుగు ఇండస్ట్రీ గర్వపడుతుంది. కలెక్షన్స్‌ గురించి నేను మాట్లాడటం లేదు. కొత్త దారిని చూపించిన చిత్రమిది. ఇండ్రస్టీకి 1989లో శివ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్‌స్పిరేషన్‌ వచ్చిందో.. గూఢచారి కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. యంగర్‌ జనరేషన్‌ ఇలాంటి సినిమాలనే కోరుకుంటుంది. ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ కావాలి. `గూఢచారి 2`కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

హీరో అడివిశేష్‌ మాట్లాడుతూ – ”నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం నా నిర్మాతలు అభిషేక్ నామ‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌గారే. త‌ర్వాత మా కలను.. మా సినిమాను ప్రపంచానికి చూపించిన ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనీల్‌గారికి థాంక్స్‌. హీరోయిన్‌ శోభిత నటించిన తొలి తెలుగు సినిమానే అయినా చ‌క్క‌గా నటించింది. అలాగే మధుశాలిని పాత్ర‌లో మంచి పెర్ఫామెన్స్‌ చేసింది. వెన్నెలకిశోర్‌.. ప్రకాశ్‌ రాజ్‌, సుప్రియ, రాకేశ్‌, భరద్వాజ్‌గారికి థాంక్స్‌. శనీల్‌ సినిమా చేయకుంటే.. ఇంత త‌క్కువ బ‌డ్జెట్‌లో రిచ్‌గా వచ్చుండేది కాదు. ఎడిటర్‌ గ్యారీ.. సీజీ వర్క్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియో సి.వి.రావుగారు.. అందరికీ థాంక్స్‌. డైరెక్టర్‌ శశికి థాంక్స్‌. నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ చేసి పెట్టాడు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ”ఈ సినిమాకు శేష్‌ మాత్రమే బలం. తనకే ఈ క్రెడిట్‌ అంతా దక్కుతుంది” అన్నారు.

అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ – ”సినిమా సక్సెస్‌ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది” అన్నారు.

వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ – ”సినిమా సక్సెస్‌పై హ్యాపీగా ఉన్నాం. మా నమ్మకాన్ని నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ శనీల్‌ డియో మాట్లాడుతూ – ”ఒక్కరి సక్సెస్‌ కాదు.. టీం అంతా కలిసి కష్టపడ్డాం. అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ సహా అందరి విజన్‌ ఈ సినిమాకు ఉపయోగపడింది” అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ – ”ఇది గ్రేట్‌ టీమ్‌ ఎఫర్ట్‌. బ్రిలియంట్‌ టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. అడివిశేష్‌కి కంగ్రాట్స్‌” అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”సక్సెస్‌ నా ముఖంలోనే కనపడుతుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here