‘జెర్సీ’ సమీక్ష

0
514

రివ్యూ: జెర్సీ

బ్యానర్  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

తారాగణం: నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, సంపత్‌రాజ్‌, ప్రవీణ్‌, సంజయ్‌ స్వరూప్‌, బ్రహ్మాజీ తదితరులు

సినిమాటోగ్రఫీ: షాను జాన్‌ వర్గీస్‌

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి

విడుదల తేదీ: 19.04.2019

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తన ప్రతి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్న తపన ఉన్న హీరో నాని. తాజాగా క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌తో ‘జెర్సీ’ చిత్రాన్ని చేశారు నాని. ‘మళ్ళీరావా’ వంటి విజయవంతమైన సినిమాని రూపొందించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వాటికి లభించిన ఆదరణ కూడా అంతంత మాత్రమే. అయితే ఈ కథలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌గా ఉన్నప్పటికీ హ్యూమన్‌ ఎమోషన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ క్రికెట్‌ని డామినేట్‌ చేశాయని చెప్పొచ్చు. ఈ కథలో ఉన్న నావెల్టీ ఏమిటి? ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏం ఉన్నాయి? స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘జెర్సీ’ ఆడియన్స్‌ని ఏమేర ఆకట్టుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

ఇది 1986లో మొదలైన కథ. అతని పేరు అర్జున్‌(నాని). ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆ సమయంలోనే సారా(శ్రద్ధా శ్రీనాథ్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. స్పోర్ట్స్‌ కోటాలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్‌ తెచ్చుకుంటాడు అర్జున్‌. తన 26 సంవత్సరాల వయసులో క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేస్తాడు. అదే సమయంలో కొన్ని కారణాల వల్ల సస్పెండ్‌ అయి జాబ్‌ లేకుండా ఖాళీగా ఉంటూ ఉంటాడు. కుటుంబ పోషణ భారం సారా మీద పడుతుంది. తాజ్‌ బంజారా హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. అర్జున్‌ మాత్రం ఇంటిని, ఇంటి పనుల్ని ఏమాత్రం పట్టించుకోడు. అయితే కొడుకు నానితో మాత్రం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్‌ అయి ఉంటాడు. నాని పుట్టినరోజుకు ఒక జెర్సీ కొనివ్వాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ పని చేయలేకపోతాడు. ఇలా అతని జీవితం సాగుతుండగా ఓరోజు అసిస్టెంట్‌ కోచ్‌ మూర్తి(సత్యరాజ్‌) సలహాతో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో ఆడతాడు. అప్పటివరకు అర్జున్‌ క్రికెట్‌ ఆడడం చూడని నాని అతని బ్యాటింగ్‌ స్టైల్‌కి ఫ్యాన్‌ అయిపోతాడు. ‘నువ్వు క్రికెట్‌ ఆడితే బాగుంటుంది నాన్నా. నాకు హీరోలా కనిపిస్తావు’ అని కొడుకు అన్న మాటలకు ముగ్ధుడైన అర్జున్‌… నాని కోసం ఎంత రిస్కయినా తీసుకొని 36 ఏళ్ళ వయసులో మళ్ళీ క్రికెట్‌ ఆడాలనుకుంటాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో అవమానాల తర్వాత రంజీ టీమ్‌లో స్థానం దక్కించుకుంటాడు. రంజీ మ్యాచ్‌లో అర్జున్‌ ఎలాంటి అద్భుతాలు చేశాడు? క్రికెట్‌ అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న అర్జున్‌ సడన్‌గా క్రికెట్‌కి గుడ్‌బై చెప్పడానికి రీజన్‌ ఏమిటి? వివిధ దశల్లో అర్జున్‌ జీవితం ఎలా కొనసాగింది? జీవితంలోని ఒడిదుడుకులను ఎలా తట్టుకొని విజయం సాధించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

క్రికెట్‌లో అద్భుతాలు చేయాలని కలలు కని, ఏమీ సాధించలేకపోయిన అర్జున్‌ పాత్రలో నాని పెర్‌ఫార్మెన్స్‌ సూపర్బ్‌గా ఉందని చెప్పాలి. భార్య సూటి పోటి మాటల వల్ల బాధపడే భర్తగా, కొడుకు కోరిన చిన్న చిన్న కోరికలు తీర్చలేని అసహాయ స్థితిలో ఉన్న తండ్రిగా నాని నటన ఎంతో సహజంగా ఉంది. అలాగే ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా కనిపించడం కోసం నాని చేసిన కృషి స్క్రీన్‌పై కనిపిస్తుంది. సెకండాఫ్‌లో నాని క్రికెట్‌ ఆడిన తీరు చూస్తే నిజంగానే ఒక మ్యాచ్‌ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అర్జున్‌ భార్య సారాగా శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కెరీర్‌ ప్రారంభంలోనే గ్లామర్‌గా కనిపించడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక బిడ్డకు తల్లిగా నటించి మెప్పించడం నటన పట్ల ఆమె డెడికేషన్‌ను తెలియజేస్తుంది. అర్జున్‌ శ్రేయోభిలాషిగా సినిమా మొదటి నుంచి చివరి వరకు కనిపించిన సత్యరాజ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ పాత్రలో సత్యరాజ్‌ మరోసారి ఆకట్టుకున్నారు. అర్జున్‌ కొడుకు నానిగా నటించిన రోనిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను చేసిన ప్రతి సీన్‌లోనూ చక్కని నటన ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించుకున్నారు.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే షాను జాన్‌ వర్గీస్‌ ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. ప్రతి సీన్‌ ఎంతో నేచురల్‌గా కనిపించడానికి అతను చేసిన కృషి స్క్రీన్‌పై కనిపిస్తుంది. డే లైట్‌లో, నైట్‌ ఎఫెక్ట్‌లో ఎక్కడా సహజత్వం మిస్‌ అవకుండా బ్యాలెన్స్‌డ్‌ లైటింగ్‌తో అందంగా కనిపించేలా చేశాడు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ని కాస్త తగ్గించి ఉంటే సినిమా స్పీడ్‌ పెరిగేది. ఉదాహరణకు కొడుక్కి జెర్సీ కొనివ్వడానికి అర్జున్‌ పడే పాట్లు వంటివి. అనిరుధ్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే డైరెక్టర్ థాట్ ని, సినిమా మూడ్ ని మెయిన్ టైన్ చెయ్యడం లో మంచి ఎఫర్ట్ పెట్టారు. నిర్మాత  గురించి చెప్పాలంటే సూర్యదేవర నాగవంశీ మేకింగ్‌ బాగుంది. కథకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడంలో ఎక్కడా వెనుకాడలేదు. ఇక డైరెక్టర్‌ గౌతమ్‌ విషయానికి వస్తే తను రాసుకున్న కథలో అర్జున్‌ పాత్రకు నానిని ఎంపిక చేసుకోవడంలోనే సగం సక్సెస్‌ అయ్యాడనిపిస్తుంది. సినిమాటిక్‌గా కాకుండా సినిమాలోని సీన్స్‌ అన్నీ ఎంతో నేచురల్‌గా కనిపించేందుకు అతను ఎంతో జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే సీన్స్‌, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎటాచ్‌మెంట్‌ను ఎంతో సహజంగా చూపించాడు. అలాగే తండ్రి, కొడుకు మధ్య సెంటిమెంట్‌, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషనల్‌ మూమెంట్స్‌ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. అర్జున్‌ జీవితాన్ని ఒక సినిమాలా కాకుండా నేచురల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో గౌతమ్‌ మంచి కృషి చేశాడు. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి క్రికెటర్‌ కావాలనుకున్న ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎమోషనల్‌ జర్నీని అందంగా తెరకెక్కించడంలో గౌతమ్‌ సక్సెస్‌ అయ్యాడు. గౌతమ్‌ అనుకున్న ఔట్‌పుట్‌ని నాని సహా మిగతా నటీనటులు ఇవ్వడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు.

బాటమ్ లైన్: ఎమోషనల్ ‘జెర్సీ’

రేటింగ్: 3.5 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here