గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు

0
8

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు

• గజరాజుల సంరక్షణపై ఆరా

• కుంకీ ఏనుగులకు ఆహారం అందించిన శ్రీ నాగబాబు గారు

• ఖాళీ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచన

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ నాగబాబు గారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. పర్యటనలో భాగంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రావి, వేప మొక్కలను నాటారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రతీ ప్రదేశంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుతోపాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించారు. అడవి ఏనుగుల సంచారాన్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని ఏనుగుల ట్రాకర్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

వన్యప్రాణులు–మానవుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అటవీ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలను పార్వతీపురం డీఎఫ్‌ఓ శ్రీ ఎస్.వెంకటేష్, ఎఫ్‌ఆర్‌ఓ తదితర అధికారులు మ్యాప్ సహాయంతో శ్రీ నాగబాబు గారికి వివరించారు. ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతాల్లో నెలకొన్న కఠినమైన భౌగోళిక పరిస్థితులు, వాటి కదలికలను పర్యవేక్షించడంలో ఎదురవుతున్న ఇబ్బందులును, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలియజేశారు. ఏనుగుల సంరక్షణతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న క్షేత్రస్థాయి కృషిని శ్రీ నాగబాబు గారు అభినందించారు.

కుంకీ ఏనుగులకు చెరకు, బెల్లం తినిపించిన శ్రీ నాగబాబు గారు

అనంతరం గుచ్చిమి సంరక్షణ కేంద్రంలోని జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగుల మావటిలతోపాటు పశు వైద్యుడిని శ్రీ నాగబాబు గారు కలిశారు. ఏనుగుల ఆరోగ్యం, వాటి సంరక్షణ, ఆహారపు విధానం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుంకీ ఏనుగులకు రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం వంటి ఆహారాన్ని తినిపించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సలహాదారుడు శ్రీ పి. మల్లికార్జున రావు, ఏపీసీసీఎఫ్ శ్రీ రాహుల్ పాండే, సీసీఎఫ్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, విశాఖపట్నం సర్కిల్ సీసీఎఫ్ శ్రీ ఐ.కె.వి. రాజు, పార్వతీపురం మన్యం డిఎఫ్‌ఓ శ్రీ ఎస్. వెంకటేష్, విజయనగరం డిఎఫ్‌ఓ శ్రీ సోమసుందరంతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here