సబ్‌మెరైన్ సినిమా చేస్తున్నా అని చెబితే కొందరు నన్ను పిచ్చోణ్ణి చూసినట్టే చూశారని వ్యాఖ్యానించారు దగ్గుబాటి రానా. `బాహుబలి` భళ్లాలదేవగా మెప్పించిన రానా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ ప్రధాన పాత్రల్లో సంకల్ప్ దర్శకుడిగా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న `ఘాజీ` తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయ సమావేశంలో రానా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
హీరో రానా మరిన్ని సంగతులు చెబుతూ -“32 ఏళ్ల నాకు 20 ఏళ్లుగా వైజాగ్ ఆర్.కె.బీచ్‌తో పరిచయం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను.. కానీ ఘాజీ కథ తెలియనే తెలియదు. వైజాగ్‌లో కూడా ఇంత గొప్ప కథ జరిగిందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ కథతో సెట్స్‌కెళ్లాం. ఘాజీ సబ్‌మెరైన్ బ్యాక్‌డ్రాప్‌లోని సినిమా. అరుదైన జోనర్ మూవీ ఇది. ప్రథమార్థం సీజీతో, ద్వితీయార్థం సైలెన్స్‌తో ఆద్యంతం రక్తికట్టించే సినిమా ఇది. కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ టీజర్ చూసి వాయిస్ అందించడానికి ముందుకొచ్చారు. టీజర్‌కి నిమిషాల్లోనే కోట్లలో క్లిక్స్ పడ్డాయి. ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని సినిమాలు తెలుగులో రావాలి“ అని తెలిపారు. సబ్‌మెరైన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నా అనగానే కొందరు నన్ను పిచ్చోణ్ణి చూసినట్టు చూశారని రానా వ్యాఖ్యానించడం విశేషం.


