ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ గారి అర్ధాంగి మరియు మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సాధించిన శ్రీమతి విజయ నిర్మల గారు ఈ రోజు (జూన్ 27) వేకువ ఝామున హఠాన్మరణం చెందారు. 1950లో తొలిసారి ‘మచ్చ రేకై’ అనే చిత్రం ద్వారా ఏడేళ్ల వయసులో విజయ నిర్మల గారు చిత్ర రంగ ప్రవేశం చేయడం జరిగింది. అనంతరం ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన పాండురంగమహత్యం చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రతో రంగప్రవేశం చేసిన విజయ నిర్మల గారు, తొలిసారి హీరోయిన్ గా రంగులరాట్నం చిత్రంలో నటించారు. ఇక హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం తోనే ఆమె రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గెలుచుకున్నారు. నటనతోపాటు దర్శకత్వంపై మంచి మక్కువ గల ఆమె, తొలిసారి మీనా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల గారు ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సాధించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారిని వివాహమాడిన ఆమె, దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో ఆయనతో కలిసి హీరోయిన్ గా నటించారు.
కృష్ణ గారితో కలిసి అత్యథిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ కూడా ఆమే. 2009లో కృష్ణ గారితో కలసి ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం నేరము – శిక్ష. గత కొన్నేళ్లుగా కృష్ణ గారితో కలిసి ఆమె హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని తమ స్వగృహంలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, నిన్న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో విశేష సేవలందించిన శ్రీమతి విజయనిర్మల గారి మృతి, చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నారు….!!


