‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

0
1
‘Aadarsha Kutumbam – House No. 47’ Post Release Press Meet
‘Aadarsha Kutumbam – House No. 47’ Post Release Press Meet

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ చిత్రానికి ఇంతటి అద్భుతమైన స్పందన ఇస్తున్న ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు : విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులంతా ‘ఆదర్శ కుటుంబం’ కోసం ఎంతగానో ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం(అక్టోబర్‌ 30) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ‘ఆదర్శ కుటుంబం’కి వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకులను గొప్ప అనుభూతిని అందించాలని నిజాయితీతో కొత్త జానర్ లో సినిమా చేశాము. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి ఇంతటి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఉదయం నుంచి చాలా మంది ఫోన్ చేసి సినిమా బాగుందని ప్రశంసించారు. మంచి సినిమాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. కుటుంబ ప్రేక్షకులకు ఎప్పుడూ మంచి సినిమా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను. వారికి సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది.” అన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మొదటి షో నుంచే మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇది ప్రేక్షకులు మాట్లాడాల్సిన సమయం. ప్రేక్షకులు మాట్లాడాలి.. మేం వినాలి. మీ స్పందనకు, మీ ప్రేమకు ధన్యవాదాలు. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ ఆనందం మరింత కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ తప్ప ఏం చెప్పగలను మీ అందరికీ. ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఉదయం చాలా మంది ఫోన్లు చేసి అభినందించారు. ప్రత్యేకంగా ఇంటర్వెల్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతుంటే చాలా ఆనందమేసింది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా నా కృతఙ్ఞతలు.” అన్నారు.

కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు టీంతో కలిసి హైదరాబాద్ లో సినిమా చూశాను. ప్రేక్షకుల స్పందన చూసి ఎంతో ఆనందించాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ ను మ్యాచ్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కి, తమన్ సంగీతానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ గారు, చినబాబు గారు, నాగవంశీ గారు నాకు కుటుంబ సభ్యులు లాంటివారు. వారెప్పుడూ సక్సెస్ లో ఉండాలని కోరుకుంటాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న సమయంలోనే ఈ సినిమా గొప్పతనం అర్థమైంది. కొన్ని సినిమాలకు పాటలు విలువ, కొన్ని సినిమాలకు మాటలు విలువ. ఇది మాటలకు విలువ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ అద్భుతంగా రాశారు. త్రివిక్రమ్ గారి ప్రతి సినిమా రిలీజ్ అనేది ఒక బుక్ రిలీజ్ లాంటిదే. ఆయన మాటలు వినాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు, ఆయన స్క్రీన్ ప్లే గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ గారితో ఈ జర్నీ మరిచిపోలేను. చినబాబు గారు మాకెంతో మద్దతుగా నిలిచారు. త్రివిక్రమ్ గారు ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ లు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. “ఖలేజా నుంచి త్రివిక్రమ్ గారి సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమా మరింత ప్రత్యేకం. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. నా పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన డైలాగ్ లు రాశాను. ముఖ్యంగా ‘నేను ప్రింట్ అవ్వని ఒక గొప్ప పుస్తకం’ అనే డైలాగ్ ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి, నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.

నటుడు సత్య మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంత మంచి పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మేము ఊహించినట్టుగానే సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఉదయం నుంచి అభినందనలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి.” అన్నారు.

నటి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల మధ్యలో కూర్చొని థియేటర్లో సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు ఇంటర్వెల్ బ్లాక్ చాలా నచ్చింది. వెంకటేష్ గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. మొదటి షో నుంచే అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన త్రివిక్రమ్ గారికి, నిర్మాత చినబాబు గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.” అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సినీ పాత్రికేయులు ఆదర్శ కుటుంబం చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు.

నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు.

సాంకేతిక బృందం:

రచన – దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: కెవిన్ కుమార్
పి ఆర్ ఓ: లక్ష్మీ వేణుగోపాల్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
సమర్పణ: శ్రీమతి మమత
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here