ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

0
7
Sistla International Pre School First Anniversary
Sistla International Pre School First Anniversary

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

రాజీవ్ కనకాల, వితికా షేరు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి హాజరు

మణికొండ: సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు మణికొండలో వైభవంగా జరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ప్రీ స్కూల్, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, చక్కని నడవడికను అలవర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, నటి వితికా షేరు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారుల ప్రతిభను ప్రతిబింబించేలా రూపొందించిన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి మాట్లాడుతూ, సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చైర్మన్ లోహిత్ సిస్ట్లాకు విద్యారంగంపై స్పష్టమైన దృక్పథం, ముందుచూపు ఉన్నాయని ప్రశంసించారు. చిన్నారులకు విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణను నేర్పించే విద్యాసంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, సిస్ట్లా స్కూల్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. చిన్నారులకు అందించాల్సిన విద్య, నేర్పించాల్సిన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. అయితే, స్కూల్ ప్రదర్శించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత, తాను చెప్పాలనుకున్న అనేక అంశాలు ఇప్పటికే పాఠ్యప్రణాళికలో భాగంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ రాబోయే 25 సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించి, ఎంతోమంది చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఆకాంక్షించారు.

నటి వితికా షేరు మాట్లాడుతూ, స్కూల్‌లో చిన్నారులను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల విద్య ఎంతో కీలకమని పేర్కొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లి అందించిన ప్రోత్సాహం, చిన్నప్పటి నుంచి తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యపాత్ర పోషించాయని తెలిపారు. చిన్నారుల ఎదుగుదలలో ప్రీ స్కూల్ విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతూ, సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా మాట్లాడుతూ, తన చిన్ననాటి అనుభవాలే ఈ స్కూల్ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో తనకు నచ్చిన విధానంలో విద్యను అభ్యసించే అవకాశం ఉంటే బాగుండేదని భావించేవాడినని చెప్పారు. చిన్నారులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, వారి ఆసక్తులు, అభిరుచులకు తగిన విధంగా ప్రీ స్కూల్ స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు వివరించారు. ఇతర వ్యాపారాలతో పాటు ఈ విద్యాసంస్థ తనకు ఎంతో భావోద్వేగ అనుబంధాన్ని కలిగించిందని, తొలి వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మోఘోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాఖ్యాత నిహారిక కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. కూచిపూడి నృత్య నిర్వాహకురాలు శోభ గోపు ఆధ్వర్యంలో కౌస్తుభ కూచిపూడి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల ఉత్సాహం, సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథుల సందేశాలతో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here