‘ సువర్ణ ‘ సినిమా రివ్యూ

0
91

‘ సువర్ణ ‘ సినిమా రివ్యూ

చిత్రం: సువర్ణ
విడుదల తేదీ: 03 ఏప్రిల్ 2026
సెన్సార్ రేటింగ్: UA
నిడివి: 1గం 42 నిలు
నటీనటులు: షకలక శంకర్, పల్లవి, వర్ణిక, పవన్
సంగీతం: గౌతం రవిరామ్
సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ కాకర్ల
ఎడిటర్: గౌస్ బాబా
నిర్మాత, రచయిత, దర్శకుడు: అశోక్ రొయ్య

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ఒక వ్యసనంగా మారుతున్న తరుణంలో, దాని దుష్ప్రభావాలను ఒక హారర్ కామెడీ నేపథ్యంలో చర్చించిన చిత్రం ‘సువర్ణ’. నేటి యువత మొబైల్ ఫోన్ మాయలో పడి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా యువతకు ఒక బలమైన సందేశాన్ని అందిస్తూ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

కథ విషయానికి వస్తే, ఒక అన్యోన్యమైన భార్యాభర్తలు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక కొత్త ఇంటికి మారుతారు. భర్త నిర్మాణ రంగ పనుల్లో నిమగ్నమై ఉండగా, భార్య మహాలక్ష్మి ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను చూసుకుంటుంది. ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తుంటే తనకి ఒక రహస్యమైన మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఆ ఫోన్ ఆమె చేతిలోకి వచ్చిన క్షణం నుండి ఆమె ప్రవర్తనలో వింత మార్పులు మొదలవుతాయి, దెయ్యం ఆవహిస్తుంది నిరంతరం మొబైల్ రీల్స్ చేస్తూ, లోకమే తెలియని స్థితిలోకి ఆమె వెళ్ళిపోతుంది. అసలు ఆ ఫోన్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అందులో ఏదైనా దుష్టశక్తి ఉందా? తన భార్యను ఆ మాయలో నుండి భర్త ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ చిత్ర మిగిలిన కథ.

నటీనటుల పనితీరు:

ఈ చిత్రంలో షకలక శంకర్ తప్ప అందరు కొత్తవాళ్లే. అందరూ వారి వారి పాత్రలో జీవించారు. ముఖ్యంగా మహాలక్ష్మి పాత్రలో చేసిన పల్లవి అద్భుతంగా నటించింది. తన నటన సినిమాకే హైలైట్. ఒక అమాయకమైన గృహిణిగా, ఆ తర్వాత మొబైల్ ప్రభావంతో వింతగా ప్రవర్తించే ఆవహించిన స్త్రీగా ఆమె అద్భుతమైన వైవిధ్యం చూపించింది. ఆమె హావభావాలు, రీల్స్ చేసేటప్పుడు చూపించిన మ్యానరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. షకలక శంకర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో సినిమాను మరో మెట్టు ఎక్కించారు. సీరియస్ సీన్స్‌లో కూడా ఆయన పంచ్‌లు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ఇక జబర్దస్త్ రాజమౌళి, పవన్ తమ కామెడీతో మంచి వినోదాన్ని పంచారు. ముఖ్యంగా పవన్ చేసిన కామెడీ సన్నివేశాలు సహజంగా ఉండి బాగా పేలాయి. జగదీష్, వర్ణిక, దేవి, శివ, శ్రీహరి వంటి ఇతర నటీనటులు తమ పరిధి మేరకు చక్కని నటనను కనబరిచి చిత్రానికి బలాన్ని చేకూర్చారు. కొత్తవారైనప్పటికీ ప్రతి ఒక్కరూ అనుభవం ఉన్న నటుల్లా జీవించడం విశేషం.

సాంకేతిక నిపుణుల పనితీరు:

సాధారణంగా హారర్ సినిమాలు అంటే పాత బంగళాలు, పగ తీర్చుకునే ఆత్మలు గుర్తొస్తాయి. కానీ ‘సువర్ణ’ చిత్ర దర్శకుడు అశోక్ రొయ్య, హారర్ ఎలిమెంట్‌ను నేటి కాలపు అతిపెద్ద సమస్య అయిన ‘మొబైల్ వ్యసనం’తో ముడిపెట్టడం విశేషం. రీల్స్ పిచ్చితో యువత తమ భవిష్యత్తును ఎలా పాడుచేసుకుంటున్నారో చెప్పడానికి ఒక అతీంద్రియ శక్తిని ఆయుధంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై తక్కువ బడ్జెట్‌లో రూపొందినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు.

సాంకేతిక పరంగా చూస్తే, అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పరిమిత వనరులతోనే నాణ్యమైన అవుట్‌పుట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంటి లోపల తీసిన దృశ్యాలు మరియు అవుట్‌డోర్ లొకేషన్స్ కంటికి ఇంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ సన్నివేశాల్లో భయాన్ని, కామెడీ సీన్లలో ఉత్సాహాన్ని నింపడంలో విజయవంతమైంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, ఎక్కడా ల్యాగ్ అనిపించదు.

ప్లస్ పాయింట్స్:

యూనిక్ కాన్సెప్ట్
కామెడీ సీన్స్
నేటి యువతకి గుణపాఠం
అద్భుతమైన నటన

మైనస్ పాయింట్స్:

సాధారణ కథ
కొన్ని సన్నివేశాలు అన్ని ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవచ్చు

విశ్లేషణ:

సినిమా మొదటి సగం భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు, కొత్త ఇంటికి మారినప్పుడు జరిగే ఆసక్తికర పరిణామాలతో ఆహ్లాదకరంగా సాగుతుంది. కామెడీ సీన్లు కథలో సహజంగా ఇమిడిపోయి, ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. మొబైల్ దొరికిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. విరామం ముందు వచ్చే ట్విస్ట్ రెండవ సగంపై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితీయార్థంలో అసలు కథనం మొదలవుతుంది. రెండవ భాగంలో కథ కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. హారర్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూనే, మొబైల్ ఫోన్ మాయలో పడి మనుషులు తమను తాము ఎలా మర్చిపోతున్నారో దర్శకుడు చాలా ప్రతిభావంతంగా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాలు ఉత్కంఠగా సాగడమే కాకుండా, భావోద్వేగంతో కూడిన ముగింపును ఇస్తాయి.

‘సువర్ణ’ కేవలం ఒక హారర్ కామెడీ చిత్రం మాత్రమే కాదు, ఇది నేటి యువతకు ఒక కనువిప్పు. మొబైల్ ప్రపంచంలో బందీలుగా మారొద్దని, నిజమైన జీవితాన్ని ప్రేమించాలని చెప్పిన తీరు అభినందనీయం. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ ఒక మంచి సందేశాత్మక చిత్రమిది. వినోదం కోరుకునే వారికి, మెసేజ్ ఆశించే వారికి ‘సువర్ణ’ నచ్చుతుంది.

రేటింగ్: 2.5/5

చివరగా: సామాజిక బాధ్యతతో కూడిన వినోదాత్మక సందేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here