ఢిల్లీ చలనచిత్రోత్సవంలో ప్రత్యేకంగా ‘భగవంత్ కేసరి’ ప్రదర్శన

0
43
Bhagavanth Kesari Screening At IFFD 2026
Bhagavanth Kesari Screening At IFFD 2026
ఐఎఫ్‌ఎఫ్‌డి 2026లో తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం.. ఢిల్లీ చలనచిత్రోత్సవంలో ప్రత్యేకంగా ‘భగవంత్ కేసరి’ ప్రదర్శన

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మార్చి 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేసిన ‘భగవంత్ కేసరి’ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా అవార్డుని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో నటసింహం నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. ఈ ప్రదర్శన అనంతరం..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ .. ‘ప్రప్రథమంగా మా అమ్మనాన్నలకు ప్రణామాలు. వారి ఆశీర్వాదం లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. వారి ఆశీర్వాదం వల్లే నేను చిత్ర సీమలో యాభై ఏళ్లుగా రాణిస్తూనే ఉన్నాను. ఇతర ఏ భాషలోనూ, ఏ ఇండస్ట్రీలోనూ ఇలా యాభై ఏళ్ల పాటు హీరోగా రాణిస్తున్న వ్యక్తి లేరని నేను గర్వంగా చెప్పగలను. మహిళల గురించి, మహిళల సాధికారత గురించి మా నాన్న గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. తండ్రి ఆస్తిలో మహిళలకు వాటాని కల్పించే చట్టాన్ని ఆయన మొదటగా తీసుకు వచ్చారు. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటినీ స్థాపించారు. మా నాన్న గారు సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా మహిళా సాధికారత గురించి పాటు పడ్డారు. ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాల్ని మేం కొనసాగిస్తాం. ఆయన ఎప్పుడూ మా గుండెల్లో సజీవంగా ఉంటారు. అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి)లో పాల్గొనడం, పురస్కారాన్ని స్వీకరించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా ‘భగవంత్ కేసరి’ సినిమాని ప్రదర్శించడం గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి)లో పాల్గొనడం ఇదే మొదటి సారి. మా బాలకృష్ణ గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం గర్వంగా ఉంది. మా ‘భగవంత్ కేసరి’ సినిమాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆనందంగా ఉంది. మా మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పిన సందేశం అందరికీ చేరువైంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అందరిలోనూ అవగాహన కల్పించింది. నిజాయితీగా కథని చెప్పాలి అని బాలకృష్ణ గారు నాతో అంటుంటారు. అందుకే మా సినిమాలో కమర్షియల్‌గా పక్క దారికి పోకుండా కథ మీదే వెళ్లాం. ఈ క్రమంలోనే క్లైమాక్స్‌లో శ్రీలీలతో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌ని పెట్టాం. అక్కడ కూడా బాలకృష్ణ గారు మాకు ఎలాంటి మార్పులు సూచించలేదు. ఆయన వల్లే సినిమాని అంత అద్భుతంగా తీయగలిగాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో, మా లయన్ బాలకృష్ణ గారికి థాంక్స్’ అని అన్నారు.

2025లో కళలు, సినిమా రంగానికి బాలకృష్ణ చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. గత యాభై ఏళ్లుగా బాలకృష్ణ తన నటనతో, సేవా కార్యక్రమాలతో, రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేశారు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బాలకృష్ణ ఏర్పరచుకున్నారు. పౌరాణిక ఇతిహాసాల నుండి మాస్ ఎంటర్‌టైనర్‌ల వరకు, ఆయన చేసిన చిత్రాలు వైవిధ్యాన్ని, స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

IFFD 2026లో లభించిన ఈ గుర్తింపు ఆయన అసమానమైన ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన దిగ్గజాలలో ఒకరైన బాలకృష్ణని ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై సత్కరిస్తోంది. ఈ కార్యక్రమం ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణమైన క్షణంగా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here