పత్రికా ప్రకటన
ది. 10.06.2025
ఎన్టీఆర్ కు భారత రత్న రావాలని అందరూ కోరుకుంటున్నారు – టి.డి. జనార్థన్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అండ్ గ్లోబల్ నెట్ వర్క్ మరియు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర ఎన్నారై టిడిపి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, సిబిఎన్ 75వ జన్మదినం ఉమ్మడిగా జరిగాయి. ఈ వేడుకలలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ టి.డి. జనార్థన్, ఎన్టీఆర్ తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, టిడిపీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మేల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నన్నూరి నర్సిరెడ్డి, శ్రీ అట్లూరి అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిడ్నీ తెలుగు సంఘాల ప్రతినిధులు శ్రీ ఎన్.టి. రామారావుని, శ్రీ బాలకృష్ణ చిత్రాల్లోని పాటల అలాపన, డ్యాన్సులు, మిమిక్రీ తదితర సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు.
శ్రీ ఎన్.టి. రామారావు, శ్రీ చంద్రబాబు నాయుడు గార్లపై ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన పుస్తకాలు ఆవిష్కరణ అనంతరం ప్రధాన వక్తల ప్రసంగాలు సాగాయి. శ్రీ టి.డి. జనార్థన్ (చైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ) ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
* సిడ్నీలో ఇంత అద్భుతంగా మరపురాని విధంగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు.
* 2024 ఎన్నికలలో మీరందరూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు గారిని తిరిగి అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో కష్టపడి పనిచేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి గెలుపునకు సహకరించారు. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
* రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పదికాలాల పాటు నిలుపుకోవడానికి ఇంతకు ముందులాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. మీ స్ఫూర్తి, కృషి వెలగట్టలేనివి.
* ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకను నిర్వహిస్తామని మీరు ముందుకు రావడం ఎంతో సంతోషం.
* మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ నట ప్రస్థానం ‘మనదేశం’ అనే సినిమాతో మొదలైంది. సినీ నిర్మాత శ్రీమతి కృష్ణవేణి గారు అన్న ఎన్టీఆర్ కు తొలి పారితోషికం అందించారు.
* ఎన్టీఆర్ తొలి చిత్రంలో నటించి ఇప్పటికి 75 సంవత్సరాలైంది. గోల్డెన్ జూబ్లీ సంవత్సరం పూర్తి కావడం ఓ చారిత్రక సందర్భం కనుక మనం ఓ సారి అద్వితీయమైన అన్నగారి నట ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలి.
* ఈ 75లో ఆయన నట జీవితం 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలలో 302 చిత్రాల్లో నటించారు. అందులో సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం వంటి వైవిధ్య భరితమైన చిత్రాల్లో ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన పాత్రలు రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, బృహన్నల వంటివి పోషించి ప్రపంచంలో ఏ ఇతర భాషల్లో ఏ నటుడు ధరించని, ధరించలేనివి పోషించి చరిత్ర సృష్టించారు. ‘శ్రీమద్విరాటపర్వం’లో 5 విభిన్నపాత్రలు పోషించి తనకు తానే సాటి అని నిరూపించారు.
* సగటున 10 చిత్రాలు ఒక ఏడాది అత్యధికంగా 16 చిత్రాల్లో నటించారు. అందులో మెజార్టీ చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

* ఆయన సినీ జీవితం మహోజ్జ్వలమైనది. నటుడిగానే కాదు, దర్శకత్వం వహించారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు. 250 భాషల్లో 137 సంవత్సరాల ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు మరొకరు కనబడరు.
* సమాజంలోని అన్ని పాత్రల్ని ధరించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
* ప్రజల రుణం తీర్చుకోవడానికి, రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
* తనకు ఎంతో ఆదాయం వస్తున్నప్పటికీ… దానిని కాదనుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు.
* నిజానికి, ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నప్పటుంచే ప్రజల కష్టాలు, కన్నీళ్లును తుడిచే ప్రయత్నం చేశారు.
* రాయలసీమలో భయంకరమైన కరువొచ్చినప్పుడు సినిమా ఆపి తోటి కళాకారుల్ని ప్రోగుచేసి నాటకాలు వేసి, జోలె పట్టి విరాళాలు సేకరించి ప్రజల సంక్షేమానికి అందజేశారు.
* తన నిర్మాత నాగిరెడ్డి గారు, తన వద్ద పర్మిషన్ కోరకుండానే వెళ్లి కార్యక్రమాలు చేయడాన్ని ప్రశ్నించినప్పుడు ఎన్టీఆర్ “ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అంటూ… ఆయన కంపెనీకి గుడ్ బై చెప్పి…” సొంత నిర్మాణ సంస్థ ఎన్ఏటి ఏర్పాటు చేసుకొని సినిమాలు తీశారు.
* రాజకీయాల్లోకి వచ్చాక పేదల సంక్షేమం కోసమే తపించారు.
* కిలో రూ. 2 లకే బియ్యం పథకం ప్రారంభించినప్పుడు చాలామంది ఎన్టీఆర్ కు పరిపాలన చేతకాదన్నారు.
* సబ్సిడీ బియ్యం ఇస్తే ఖజానా దివాలా తీస్తుందన్నారు.
* కానీ ఎన్టీఆర్ వాళ్ల మాటలు పట్టించుకోలేదు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేనప్పుడు ఎందుకు అధికారం అని ప్రశ్నించారు.
* బియ్యం ఇవ్వడంతోనే ఆగిపోలేదు. పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 30 పెన్షన్ పథకం అమలు చేశారు.
* ఇప్పుడు యువత, ప్రపంచం ఆహారభద్రత గురించి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ 42 ఏళ్ల క్రితమే పేదవాడికి ఆహారభద్రత చేకూర్చారు.
* అంతేకాదు… రైతులు, మహిళలు, బీసీ, ఎస్టీ ఎన్టీ మైనార్టీలకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు.
* మహిళలకు ఆస్థిహక్కు కల్పించారు. తన ఆస్తిని తన పిల్లలకు రాసిచ్చినప్పుడు కోడళ్ల పేరున ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించారు.
* నదుల అనుసంధానంతో కృష్ణా, పెన్నా నదులను కలిపి తెలుగుగంగకు అంకురార్పణ చేశారు.
* అన్ని ప్రాంతాలను సమంగా చూసి… వెనుకబడిన ప్రాంతాల నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా విశ్వవిద్యాలయం పెట్టారు.
* ఎన్టీఆర్ రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో ఉద్యమించి రాష్ట్రాలకు అధిక నిధులు పొందేందుకు దోహదం చేశారు.
* పరిపాలనా సంస్కరణలకు ఎన్టీఆర్ ఆద్యులు. మాండలిక వ్యవస్థ ప్రవేశ పెట్టారు.
* బీసీలకు మొట్ట మొదటి సారి రిజర్వేషన్లు కల్పించిన ఘటన ఆయనదే. యువతను ప్రోత్సహించారు. అవినీతిని ఎక్కడా సహించలేదు.
* ఇక భాషకు, కళలకు ఆయనిచ్చిన ప్రాధాన్యం ఎంత చెప్పినా తక్కువే.
* టాంక్ బండ్ మీద ప్రముఖుల విగ్రహాలు స్థాపించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
* ఎన్టీఆర్ పాలన నభూతో నభవిష్యతి.
* ఆయనకు ఇంకా ‘భారతరత్న’ రాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ సారి మన అన్న ఎన్టీఆర్ కు భారతరత్న రావొచ్చునని అనుకుంటున్నాం.
* ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో మాదిరిగా అమరావతిలో కూడా ఎన్టీఆర్ గార్డెన్స్ రాబోతున్నది.
* నేను కూడా నాకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్, ప్రోత్సహిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడిగారి రుణం తీర్చుకోవడానికే వారిద్దరికి సంబంధించిన విజయాలను, చరిత్రను నిక్షిప్తం చేయడానికి, భావితరాలకు అందించడానికి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
* పుస్తకాలను ప్రచురిస్తన్నాం, అన్న ఎన్టిఆర్ యూట్యూబ్ ఛానల్ స్థాపించి ప్రముఖుల అభిప్రాయాలను, అన్నగారితో వారికి గల సానిహిత్యాన్ని వివరించే ఇంట్వ్యూలను ప్రసారం చేస్తున్నాం.
* భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాల్ని మా కమిటీ నిర్వహిస్తుంది.



