పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మొదటి గీతం విడుదల తేదీ ఖరారు

0
38
Power Star Pawan Kalyan - Hari Hara Veera Mallu Part 1 - First Single Out Soon
Power Star Pawan Kalyan - Hari Hara Veera Mallu Part 1 - First Single Out Soon
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మొదటి గీతం విడుదల తేదీ ఖరారు

– త్వరలోనే ‘హరి హర వీర మల్లు పార్ట్-1’ మొదటి గీతం

– పాటను స్వయంగా ఆలపించిన పవన్ కళ్యాణ్

– అక్టోబరు 14 నుంచి కొత్త షెడ్యూల్

– నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి 

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చిత్రీకరణకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇటీవలే తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర బృందం చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశానికి యాక్షన్ దర్శకుడుని ప్రత్యేకంగా నియమించారు. 

ఇప్పుడు, దసరా శుభ సందర్భంగా నిర్మాతలు చాలా ప్రత్యేకమైన వార్తను ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి గీతం విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులు ఆనందపడే మరో విషయం ఏంటంటే తెలుగులో ఈ పాటను స్వయంగా పవన్ పాడారు. ఈ గీతాన్ని ఇతర భాషలలో ఇతర గాయకులు పాడారు.

దసరా సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాతలు విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను గురిపెట్టారు. ఈ పోస్టర్ చూశాక, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో తమ అభిమాన నటుడు ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అక్టోబరు 14 నుంచి మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, నవంబర్ 10 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి అవుతుందని నిర్మాతలు తెలిపారు.  సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా అని నిర్మాతలు వెల్లడించారు.  

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్, నీహార్ కపూర్, సుబ్బరాయ శర్మ,  సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, దలీప్ తాహిల్,  అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన టీజర్ తో పాటు, పవన్ అభిమానులు అనందించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటంలో జ్యోతి కృష్ణ కీలక పాత్ర పోషించారు. 

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు. 

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here