సుహాస్ ‘జనక అయితే గనక’ సినిమా రివ్యూ
మార్కెట్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది సరిగ్గా లేకుంటే సంబంధిత కంపెనీపై కస్టమర్ కేసు వేశాడనే విషయాన్ని వార్తల రూపంలో మనం చదివే ఉంటాం. అయితే కండోమ్‌పై కేసు వేస్తే.. అలాంటి వ్యక్తిని ఏమనాలి? ఇలాంటి ఓ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందిన చిత్రమే ‘జనక అయితే గనక’. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న సుహాస్ కథానాయకుడిగా నటించారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేలా దిల్‌రాజు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేసిన దిల్‌రాజు అండ్ టీమ్.. ఇలాంటి ఓ డిఫరెంట్ పాయింట్‌తో సినిమా చేయాలనుకోవటం ఆలోచించాల్సిన విషయమే. ఇంతకీ ఓ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిన ‘జనక అయితే గనక’ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కించాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళదాం..
కథ:
ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి యువకుడు. పెళ్లై రెండేళ్లు అవుతుంటుంది. పెద్దగా చదువుకోడు. దీంతో సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతన్ని అనుసరించే భార్య (సంగీర్తన), మాటలు పడే తండ్రి (గోపరాజు రమణ), సర్దుకుపోయే తల్లి, పెళ్లైందిగా పిల్లలనెప్పుడు కంటావ్! అని ప్రశ్నించే నాయనమ్మ… ఇదే అతని లోకం. ఇప్పుడు సోసైటీలో ఓ పిల్లాడిని కనటం కంటే చదివించి పెద్ద చేయటం చాలా కష్టమని ప్రసాద్ ఆలోచన. దీంతో పిల్లల్ని కూడా వద్దని అనుకుంటాడు. తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ పిల్లల్ని కనమని చెప్పినా ఒప్పుకోడు.
అయితే ప్రసాద్ సతీమణి నెల తప్పుతుంది. ఇది అందరికీ సంతోషాన్నిచ్చినా.. ప్రసాద్‌కు మాత్రం ఓ సందేహాన్ని తెచ్చి పెడుతుంది. అదేంటంటే తాను కండోమ్ వాడినా తన భార్య ఎలా నెల తప్పిందనేదే. చివరకు తన వాడిన కండోమ్ ప్యాకెట్ కంపెనీపై కేసు వేస్తాడు ప్రసాద్. స్నేహితుడు (వెన్నెల కిషోర్) లాయర్ కావటంతో పెద్దగా ఖర్చు లేకుండానే కన్షుమర్ కోర్టుకి కేసు వెళుతుంది. కండోమ్ కంపెనీ లాయర్ (ప్రభాస్ శ్రీను) వేసే ప్రశ్నలకు లాయర్ సరిగ్గా సమాధానం చెప్పలేక పోవటంతో ప్రసాదే తన కేసుని ఇన్‌డైరెక్ట్‌గా వాదించుకుంటాడు. ప్రత్యర్థి లాయర్‌కి ప్రసాద్ చెప్పే సమాధానాలు, వేసే ప్రశ్నలు విని దిమ్మతిరిగిపోతుంటుంది. దీంతో దేశంలోనే ప్రముఖ లాయర్ (మురళీ శర్మ)ని కండోమ్ కంపెనీ రంగంలోకి దించుతుంది. చివరకు ప్రసాద్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? తను కేసు గెలిచాడా? ఈ కేసు పోరాడే క్రమంలో ప్రసాద్‌కు ఎదురయ్యే సమస్యలు ఏంటి? అసలు ఈ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల ఏం చెప్పాలనుకున్నారు? అనే విషయాలు తెలియాంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సుహాస్, ‘జనక అయితే గనక’ చిత్రంలో మధ్య తరగతి యువకుడిగా ఒదిగిపోయాడు. తండ్రి తన జీవితాన్ని సెటిల్ చేయలేదంటూ ఆయన్ని తిట్టటం.. పెళ్లైంది కదా, పిల్లల్ని కనమని చెబితే వారికి తగ్గ రీతిలో కౌంటర్ ఇవ్వటం వంటి సందర్భాల్లో తన నటన చాలా నేచురల్‌గా ఉంది. ఇక ఓ మధ్య తరగతి తండ్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పిల్లలకు మంచి ఆరోగ్యం, చదువు వంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలంటే ఎంత ఖర్చు పెట్టాలో చెప్పే సీన్‌లోనూ సుహాస్ నటన పీక్స్. కోర్టులో ప్రభాస్ శ్రీను ప్రశ్నలకు కౌంటర్స్ ఇచ్చే యాక్టింగ్.. తను రివర్స్‌లో వేసే ప్రశ్నలు అన్నీ ఆడియెన్స్‌కి నవ్వును తెప్పిస్తూనే ఆలోచింప చేస్తాయి. సుహాస్‌ను మంచి యాక్టర్‌గా మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఇక భర్తను ఫాలో అయ్యే మధ్య తరగతి భార్య పాత్రలో సంగీర్తన ఆకట్టుకుంది. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో తన పాత్రలోని ఎమోషనల్ యాంగిల్‌ను కథానుగుణంగా చక్కగా ఎలివేట్ చేయగా, ఆమె కూడా తన నటనతో మెప్పించింది. గోపరాజు రమణ తండ్రి పాత్రలో తనదైన పంథాలో మెప్పించాడు. మురళీశర్మ, ప్రభాస్ శ్రీను లాయర్ పాత్రల్లో మెప్పిస్తే, వెన్నెల కిషోర్ కేసు వాదించలేని లాయర్ పాత్రలో నవ్వులను పూయించాడు. ఇక జడ్జ్ పాత్రలో రాజేంద్రప్రసాద్ తనదైన బాణీలో యాక్టింగ్‌తో అలరించారు.
సాంకేతిక బృందం
దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల ఓ సీరియస్ ఇష్యూని లైటర్ కామెడీ వేలో చక్కగా తెరకెక్కించారు. అలాగే సినిమాను కేవలం కామెడీగానే చూపించలేదు. కన్షుమర్ కోర్టుకి వెళ్లినప్పుడు కంపెనీ లాయర్స్ కస్టమర్స్‌ను ఇబ్బంది ఎలా ఇబ్బంది పెడతారు.. కస్టమర్స్ ఇలాంటి కేసుల వల్ల ఎలాంటి మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారనే విషయాలను చక్కగా చూపించారు. ఎక్కడా వల్గారిటీకి చోటు లేకుండా, సున్నితమైన విషయాన్ని ప్రశ్నించేలా సినిమాను తెరకెక్కించిన దర్శకుడిని అభినందించాల్సిందే. విజయ్ బుల్గానిన్ సంగీతం బావుంది. నా పెళ్లాం నా ఫేవరేట్ సాంగ్ బావుంది. నేపథ్య సంగీతం బావుంది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. విజువల్‌గా సినిమా ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథను తెరకెక్కించటంలో దర్శకుడిది ఎంత కీలకమైన పాత్రలో నిర్మాతలది అంతకంటే ముఖ్యమైన భూమిక ఉంది. ఎందుకంటే ఇలాంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ కథను నమ్మి సినిమాను నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎఫర్ట్స్‌ను అప్రిషియేట్ చేయాలి. బలగం వంటి ఎమోషనల్ మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బ్యానర్‌కు చిన్న బ్రేక్ వచ్చినా ఇప్పుడు జనక అయితే గనకతో మంచి కిక్ దొరికిందనే చెప్పాలి.
తుది తీర్పు
‘జనక అయితే గనక’.. సమాజాన్ని తెలివిగా ప్రశ్నించిన మధ్యతరగతి తండ్రి కథ
రేటింగ్
3.25/5