సత్యం సుందరం కథ
అమరావతిలో స్కూల్ హెడ్మాస్టర్(జయ ప్రకాష్) దాయాదుల ఆస్తి గొడవల్లో ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతని కుమారుడు సత్యమూర్తి (అరవింద స్వామి) సహా కుటుంబంతో కలిసి విశాఖపట్నం షిఫ్ట్ అవుతాడు. అప్పటినుంచి బంధువులు అంటేనే రాబందులు అనేలా ఫిక్స్ అయిపోయిన సత్యమూర్తి వాళ్లకి చాలా దూరం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే తన సోదరి వివాహం కోసం అదే ప్రాంతానికి చెందిన ఉద్దండరాయునిపాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ వివాహానికి వెళ్ళాక అక్కడ తనను బావ అని సంబోధించే తనకు పేరు తెలియని బావమరిది(కార్తి) ఎదురవుతాడు. ముందు దూరం పెట్టాలి అనుకున్నా సరే ఏమాత్రం వినకుండా అతను జిడ్డులా వెంటపడతాడు. బస్ మిస్ కావడంతో అతని ఇంట్లోనే నైట్ బస చేయాల్సి వస్తుంది.. ఆ సమయంలో తాను ఏమాత్రం ఆలోచన లేకుండా చేసిన ఒక పని తనను బావ అని పిలుస్తున్న సదరు వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిందని తెలుసుకుంటాడు. ఉదయాన్నే లేవగానే తనను, తన భార్యను, పుట్టబోయే బిడ్డను పేరుతో దీవించాలని చెప్పడంతో ఆ పేరే తెలియక గిల్టీగా ఫీల్ అయ్యి ఇంటి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన సత్యం ఆ వ్యక్తి పేరు తెలుసుకున్నాడా? అసలు ఆ వ్యక్తి పేరు ఏంటి? చివరికి బావా బావమరుదులు ఒకరి పేరు ఒకరు తెలుసుకున్నారా లేదా? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా మొత్తాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
కళాకారుల ప్రదర్శన
ఈ సినిమాలో సుందరం అనే పాత్రలో కార్తీ, సత్యం అనే పాత్రలో అరవింద్ స్వామి నటించలేదు అదే జీవించారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా కెమిస్ట్రీ అంతగా పండేది కాదేమో అనిపిస్తుంది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటన కనబరిచే ప్రయత్నం అభినందనీయం.. ఇప్పటికే వారిద్దరూ టాప్ హీరోలుగా తమను ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో నటన విషయంలో మరో మెట్టు ఎక్కేశారు. ఇక రాజ్ కిరణ్, జయ ప్రకాష్ సహా శ్రీదివ్య వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా మొత్తాన్ని కార్తీతో పాటు అరవింద్ స్వామి తమ భుజాల మీద నడిపించారు.
సాంకేతిక అంశాలు
ఈ సినిమా మొత్తాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. ఎక్కడా వల్గారిటీ లేకుండా ఒక క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆద్యంతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో మాత్రం డబ్బింగ్ బాధ్యతలు తీసుకున్న రాకేందు మౌళికి అభినందనలు దక్కాలి. ఇక 96 సినిమాతో మ్యాజిక్ చేసిన గోవింద వసంత మరోసారి అదే స్థాయిలో మ్యూజిక్ అందించే ప్రయత్నం చేశారు. ఇక ఒక నవలను సినిమాగా తెరకెక్కించిన విషయంలో ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే నిడివి విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సూర్య జ్యోతిక నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ
ఒక రకంగా ఇది కథగా చెప్పుకుంటే చాలా చిన్న లైన్. కానీ దాన్ని ఒక నవలగా మార్చుకోవడం దాన్ని ఒక సినిమాగా మలవడం వెనుక ప్రేమ్ కుమార్ టాలెంట్ కనిపిస్తుంది. ఇలాంటి ఒక లైన్ తో కూడా సినిమా చేయవచ్చా? అనిపించే విధంగా ప్రేమ్ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే అబ్బురపరిచేలా ఉంది. ఇక అదే విధంగా డైలాగులు కూడా అద్భుతంగా పేలాయి. ముఖ్యంగా ఒకపక్క నవ్విస్తూ మరొకపక్క ఆలోచింపచేస్తూ బంధాల విలువలను తెలియజేసేలా రాసుకున్న డైలాగులు ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్లు పెట్టిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక పేరు టెసులుకోవడం కోసం అరవింద్ స్వామి పడే తపన, తన పేరు కూడా తెలియకుండా తనతో ఇంత క్లోజ్ గా ఉన్నాడని తెలిసిన తర్వాత కార్తీ కనబరిచే నటన సినిమా మొత్తానికి హైలైట్. అదే సమయంలో చెల్లెలికి కాలి పట్టాలు తొడిగే సమయంలో అలాగే మరికొన్ని సీన్స్ కూడా చాలా న్యాచురల్ గా ఎంతో ఎమోషనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక వారిద్దరి నుంచి ఆ స్థాయిలో నటన రాబట్టుకోవడంలో కూడా డైరెక్టర్ పనితనం కనిపించింది.
తుది తీర్పు
ఏడిపిస్తూ నవ్విస్తూ ఆలోచింపచేస్తు “సత్యం సుందరం”
రేటింగ్
3.5/5