తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధిత సహాయార్థం కోటి రూపాయలు విరాళం ప్రకటించిన చిరంజీవి
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం అందించటానికి హీరో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం పలుసార్లు నిరూపితమైంది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్‌ను స్థాపించి ఇప్పటికే ఎందరికో అండగా నిలిచిన చిరంజీవి.. ప్రజలపై ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడల్లా ఇండస్ట్రీ తరపు నుంచి నేనున్నా అంటూ సాయం చేయటానికి ముందుకు వస్తుంటారు. కరోనా సమయమైనా, హూదూద్ తుపాను సమయంలోనైనా.. ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటే తనవంతు అండదండలను అందించటమే కాకుండా తన అభిమానులను సైతం అండగా నిలవమని చెప్పి స్ఫూర్తినిస్తుంటారు చిరంజీవి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని వారు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన స్పందించి తన గొప్ప మనసుని చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా.. విచారాన్ని వ్యక్తం చేయటమే కాకుండా చిరంజీవి తన కుటుంబం తరపు నుంచి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించటమే కాకుండా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రత్యేకంగా కలిసి చెక్‌ను అందించి వచ్చిన సంగతి తెలిసిందే.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. వీరికి తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలను వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు.
Click Here To Check Megastar Chiranjeevi Tweet >>
‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు చిరంజీవి
