“వీరంజనేయులు విహారయాత్ర” మూవీ రివ్యూ

0
393

 

ఈనాడు సంస్థ నుంచి వచ్చిన ఈటీవీ విన్ యాప్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఓటీటీలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచిన తర్వాత ఈ ఓటీటీలో వచ్చే కంటెంట్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈటీవీ విన్ యాజమాన్యం కూడా సాధారణ కంటెంట్ కాకుండా కాస్త భిన్నమైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వీకే నరేష్ ప్రధాన పాత్రలో రాగమయుర్, ప్రియా వడ్లమాని, శ్రీలక్ష్మి వంటి వారు ఇతర కీలక పాత్రలలో వీరాంజనేయులు విహారయాత్ర అనే ఒక ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమా చేశారు. ఈ సినిమా టీజర్ తోనే ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ మీద ప్రేక్షకులందరిలో అంచనాలు ఏర్పడగా ట్రైలర్ కూడా అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది. అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
వీరాంజనేయులు (బ్రహ్మానందం) రైల్వేలో పని చేస్తూ గోవాలో ఒక ఇల్లు కట్టుకుంటాడు. అయితే అతని మరణంతో అతని కుమారుడు నాగేశ్వరరావు (వికే నరేష్) మీద ఇంటి బాధ్యత పడుతుంది. అతను ఒక స్కూల్లో మాక్స్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. నాగేశ్వరరావు కుమారుడు (రాగ్ మయూర్) గేమింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు. అతని కుమార్తె సరు(ప్రియ వడ్లమాని) తన అన్న ఫ్రెండ్ తోనే ప్రేమలో పడి పెళ్లికి ముందే గర్భం కూడా తెచ్చుకుంటుంది. పెళ్లి చేయక తప్పని పరిస్థితుల్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా పెళ్లి గ్రాండ్గా చేయాలని మగ పెళ్లి వారు కోరుతారు. అప్పటికే ఉద్యోగం పోవడంతో ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో తన తండ్రి గోవాలో కట్టుకున్న ఇల్లు అమితే 60 లక్షలు వస్తాయని ఒక బ్రోకర్ ఫోన్ చేసి చెబుతాడు. అయితే ఇల్లు అందరి పేరు మీద ఉంది కాబట్టి అందరి సంతకాలు కావాలని చెప్పడంతో ఒక అబద్ధం చెప్పి ఇంట్లో ఉన్న వారందరినీ తీసుకుని గోవా బయలుదేరుతాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గోవా సజావుగా చేరుకున్నాడా? మధ్యలో నాగేశ్వరరావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అసలు గోవా వెళ్ళిన పని అయిందా? చివరికి నాగేశ్వరరావు కూతురికి పెళ్లి అయిందా? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే నాగేశ్వరరావు అనే పాత్రలో నరేష్ జీవించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఇలాంటి పాత్రలు నరేష్ కి ఏ మాత్రం కొత్త కాదు కానీ నాగేశ్వరరావు అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడేమో అనేట్టుగా నరేష్ ఆకట్టుకున్నాడు. ఆయన తర్వాత అంతలా నటనకు స్కోప్ ఉన్న పాత్ర రాగ్ మయూర్ కి దక్కింది. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ తరహా పాత్రలు చేస్తూ వచ్చిన ఆయనకు కాస్త ఎమోషనల్ రోల్ పడింది. ప్రియా కూడా ఇప్పటివరకు రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రలే ఎక్కువగా చేస్తూ వచ్చింది కానీ ఇందులో మాత్రం అన్నకు, అన్న స్నేహితుడికి మధ్య నలిగిపోయే ఒక చెల్లి పాత్రలో ఆకట్టుకుంది. శ్రీలక్ష్మి ఎప్పటిలాగే తన అనుభవాన్ని నటనలో చూపెట్టేసింది. ఇక చిన్న పాత్రలలో మెరిసిన రాకేష్ వంటి వాళ్లు కూడా తమ పరిధి మేర నటించారు.

విశ్లేషణ:
వీరాంజనేయులు విహారయాత్ర సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఈజీగా ఒక అంచనాకొచ్చేస్తారు. ఈ సినిమా మొత్తం కామెడీతో నడిపిస్తారు అనే భావిస్తారు. కానీ సినిమా ఓపెనింగ్ ఊహకు తగ్గట్టుగానే ఉంటుంది. అసలు వీరాంజనేయులు ఎవరు? ఎందుకు వీరాంజనేయులు విహారయాత్ర అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది లాంటి విషయాలను ప్రారంభంలోనే జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా కథలోకి వెళ్లగా నాగేశ్వరరావు పాత్ర పరిచయం అతని కొడుకు, కూతురుల జీవితాల పరిస్థితులు వివరిస్తూనే వారందరూ కలిసి గోవా ఎందుకు పయనం అయ్యారు? అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. గోవా బయలుదేరిన క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రాసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అలా ఒక ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను సినిమాలో లేనమయ్యేలా చేసి సెకండ్ హాఫ్ కి లీడ్ ఇస్తారు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కూడా ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యే విధంగా కామెడీతో పాటు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు డైరెక్టర్. సినిమాలో ఏదో ఒక సీన్ కి కనెక్ట్ కాని ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు గొడవపడే సీన్ కానీ ఫ్యామిలీ మొత్తం గొడవపడే సీన్స్ కానీ మనం నిత్యజీవితంలో ఎదుర్కొన్నవో లేక దగ్గర నుంచి చూసినవో అనిపిస్తూ ఉంటాయి. అయితే ఊహించిన విధంగా కాకుండా క్లైమాక్స్ ని కాస్త ఎమోషనల్ గా ఆలోచింపచేసే విధంగా రాసుకోవడంలో కూడా డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. చాలా చోట్ల సినిమాటోగ్రాఫర్ పనితీరు సినిమాకి అదనకు హంగులు తీసుకొచ్చింది. కొన్ని ఫ్రేమ్స్ అయితే అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యింది. సినిమా నిడివిని కంట్రోల్ చేయడంలో కూడా ఎడిటర్ సక్సెస్ అయినట్లు అనిపించింది. అయితే కేవలం కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం నిరాశ పడక తప్పదు.

రేటింగ్: 3/5

చివరగా: వీరాంజనేయులు విహారయాత్ర ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here