సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే నిర్మాత రాచాల యుగంధర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
*మీ నేపథ్యం ఏంటి? సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చారు?*
నాకు సినిమాలంటే ముందు నుంచీ ప్యాషన్. కళా రంగం మీదున్న ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చాను. ముందుంగా ఊరికి ఉత్తరాన సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పని చేశాను. చివరకు కొన్ని పరిస్థితుల వల్ల ఆ చిత్రాన్ని నేనే రిలీజ్ చేశాను. అక్కడే ఈ మూవీ దర్శకుడు సతీష్ పరిచయం అయ్యారు.
*‘సీతా కళ్యాణ వైభోగమే’ ఎలా మొదలైంది?*
ఊరికి ఉత్తరాన సినిమా మేకింగ్ నాకు చాలా నచ్చింది. సతీష్ గారు తీసిన విధానం నచ్చి ఆయనతోనే మరో సినిమా చేయాలని అనుకున్నాను. అప్పుడు సతీష్ గారు ఈ సీతా కళ్యాణ వైభోగమే కథను చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.
*సీతా కళ్యాణ వైభోగమే చిత్రంలోని ఆర్టిస్టుల గురించి చెప్పండి?*
సుమన్ తేజ్, గరీమ చౌహన్ తెరకు కొత్త వాళ్లు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించాను. అందుకే కొత్త వాళ్లతోనే సినిమా తీయాలని అనుకున్నాను. కొత్త వాళ్లైనా కూడా సుమన్ తేజ్, గరీమ చౌహాన్‌లు అద్భుతంగా నటించారు. ఇక ఈ మూవీలో విలన్‌గా కనిపించిన గగన్ విహారి నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. రీసెంట్‌గానే గగన్ విహారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్‌గా నటించి మెప్పించారు.
*ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది? ఈ తరం మెచ్చేలానే ఉంటుందా?*
రాముడ్ని ఏ తరంలో అయినా కొలుస్తాం. అలానే ఈ సినిమాని ఏ తరం ఆడియెన్స్ అయినా మెచ్చుకుంటారు. అయినా ఇప్పుడు కథలు బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమా కథ మీద మాకు నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.
*ఈ సినిమాకు పని చేసిన టెక్నికల్ టీం గురించి చెప్పండి?*
చరణ్ అర్జున్ గారు ఇచ్చిన పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. పరుశురామ్ గారి కెమెరా వర్క్ అద్భుతంగా వచ్చింది. ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా గోవాలో భారీ స్థాయిలో సాంగ్‌ను షూట్ చేశాం. పుష్ప 2, దేవర వంటి సినిమాలతో బిజీగా ఉన్న డ్రాగన్ ప్రకాష్ గారు మా సినిమాకు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా నిలుస్తాయి.
*ట్రైలర్‌లో లొకేషన్స్ ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి. సినిమాను ఎక్కడ షూట్ చేశారు?*
మాది పాలమూరి జిల్లా. మా చుట్టూ పక్కల అద్భుతమైన లొకేషన్లున్నాయి. సోమశిలలో చక్కటి విజువల్స్ ఉన్నాయి. చుట్టు పక్కల ఊర్లలో ఎన్నో అందమైన లొకేషన్లున్నాయి. అక్కడి పురాతనమైన గుడిలో మంచి ఎపిసోడ్స్ షూట్ చేశాం.
*చివరగా సీతా కళ్యాణ వైభోగమే సినిమా గురించి ఏం చెబుతారు?*
ప్రస్తుతం మనకు ఓ ఫ్యామిలీ మొత్తం థియేటర్‌కు వచ్చి కూర్చుని సినిమాలు చూసే పరిస్థితి లేదు. అన్నీ కమర్షియల్, యాక్షన్ మూవీస్ వస్తున్నాయి. మా సినిమా మాత్రం కుటుంబ సమేతంగా థియేటర్‌కు వచ్చి హాయిగా చూసుకునేలా ఉంటుంది. ఎక్కడా కూడా అసభ్యకరంగా అనిపించదు. అన్ని రకాల ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
*మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి చెప్పండి?*
ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా జూన్ 21న రాబోతోన్న సీతా కళ్యాణ వైభోగమే మీద ఉంది. ఆ తరువాత భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతం మూడు కథలు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను. ఇకపై కంటిన్యూగా మా ప్రొడక్షన్ కంపెనీలో కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సినిమాలను తీస్తుంటాను.