పవన్ కళ్యాణ్-సుజీత్ ల యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ నుండి ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా విడుదల

0
187

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ కోసం దర్శకుడు సుజీత్ తో చేతులు కలిపారు. ఆస్కార్ గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్‌ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రం నుండి ఈ రోజు అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేశారు. దర్శకుడు సుజీత్, స్వరకర్త ఎస్ థమన్, నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి అభిమానులతో కలిసి గ్లింప్స్ ని వీక్షించారు. పెద్ద తెరపై తమ అభిమాన హీరోని చూడటం కోసం అభిమానులు తరలిరావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరిచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హంగ్రీ చీతా నటుడు అర్జున్ దాస్ వాయిస్‌ఓవర్‌తో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది. “పదేళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాను గుర్తుందా?. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అదొక భయంకరమైన రక్తపు స్నానం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే.. అతను సైతాను అవుతాడు” అంటూ ఒక్క డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో
చూపిస్తూ, ఓజీ చిత్రం యాక్షన్ ప్రియులను కనువిందు చేయనుంది. స్లో-మోషన్ షాట్‌లు, స్టైలిష్ సినిమాటోగ్రఫీ, బలమైన కథా నేపథ్యం, ఎస్ థమన్ అద్భుతమైన సంగీతంతో పవన్ కళ్యాణ్‌కి అభిమానిగా దర్శకుడు సుజీత్ అందించే సంపూర్ణ నివాళిగా ఈ సినిమా నిలవనుంది. ఈ 99 సెకన్ల గ్లింప్స్ ఇంకాసేపు ఉంటే బాగుండు అనే భావనను మనకు కలిగిస్తుంది.

ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. పాన్-ఇండియన్ స్థాయి గల భారీ తారాగణం యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ, క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తూ ఓజీ ని గొప్ప చిత్రంగా తీర్చిదిద్దుతున్న దర్శకుడు సుజీత్ ప్రతిభ పట్ల నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్‌ జోడిని తెరపై చూడటానికి ప్రేక్షకులు కూడా అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here