బలగం సినిమా చరిత్ర సృష్టించింది: ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం

0
150

తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం అన్నారు. హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం చిత్రంలోని నటీనటులు, యూనిట్‌ సభ్యులను, దర్శక నిర్మాతలను శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని, తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ను ప్రారంభించిన నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డిలను అభినందించారు.

బలగం సినిమాను చూసిన ప్రతిఒక్కరు తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా దర్శకుడు వేణు ఎల్దండి చూపించారని అన్నాడు. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రజలు ఆదరిస్తారని దానికి బలగం సినిమా ఒక ఉదాహరణని అన్నారు.

తెలంగాణ సినిమా ఎంతో ముందుకు వెళ్లాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతో సినీరంగానికి తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బాలల సినిమాలకు మంచి ఆదరణ ఉందని, కానీ తెలుగులో బాలల సినిమాలు రావడం తగ్గిందని, మంచి కథలలో సరికొత్త బాలల సినిమాలను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మించాలని విజ్ఞప్తి చేసారు.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో బలగం సినిమాకు సత్కారం జరగడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

దర్శకుడు వేణు మాట్లాడుతూ… తొలి సినిమా ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని, చిన్న సినిమాగా మొదలై, పెద్ద విజయం సాధించడంలో ప్రతిఒక్కరి పాత్ర ఉందని, వారందరి సహకారంతోనే ఇది సాధ్యమయిందని అన్నారు. తెలంగాణ ఎఫ్‌డీసీ నుండి తొలిసారిగా బలగం సినిమా సత్కరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్‌ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్‌ రెడ్డి, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ కావ్య, పాటల రచయిత శ్యామ్ కాసర్ల, గాయకురాలు మంగ్లీ, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు, ఎడిటర్‌ మధు, నటులు రచ్చ రవి, రూప లక్ష్మీ, మైమ్ మధు, సుధాకర్ రెడ్డి, ఎఫ్‌డీసీ సిబ్బంది ఎం.డి.విజయ్, సంజీవ్ కుమార్, దేవ్ సింగ్, బత్తిని వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here