సింగిల్ కారెక్టర్‌తో సినిమా అనగానే హలో మీరా గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఒక్క పాత్రతో సినిమాను ఎలా ఆసక్తికరంగా తీస్తారు.. కథ ఎలా ఉంటుంది.. కథనం ఎలా సాగుతుంది? అనే ఉత్సుకత ఏర్పడింది. ఈ రోజు హలో మీరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
మీరా (గార్గేయి) ఇంకో రెండ్రోజుల్లో కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోందనగా.. ఆమె జీవితంలో అనుకోని ఘటన జరుగుతుంది. తన పెళ్లి పనుల్లో భాగంగా విజయవాడలో బిజీగా ఉన్న మీరా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుధీర్ హాస్పిటల్‌లో చేరాడనే విషయం తో పాటు ప్రేమించి మోసం చేసిందనే ఆరోపణలను మీరా ఎదుర్కొంటుంది. విజయవాడ నుంచి హైద్రాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వస్తుంది మీరా. ఈ క్రమంలో మీరాకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు సుధీర్ ఎందుకు హాస్పిటల్లో చేరాడు? కళ్యాణ్ చివరకు ఏం చేశాడు? మీరా ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలు ఏంటన్నది కథ.
నటీనటుల పనితీరు :
హలో మీరా సినిమాలో నటీనటుల గురించి చెప్పడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు ఎందుకంటే ఉండేది ఒక్క పాత్రే. కారులో మీరా ప్రయాణం చేస్తుంటుంది. స్క్రీన్ మీద మీరా తప్పా మరో కారెక్టర్ కనిపించదు. నవ్వించినా, ఏడిపించినా, మనలో ఆందోళనను కల్గించినా, భయానికి గురి చేసినా కూడా మీరా పాత్రతోనే అవుతుంది. అన్ని ఎమోషన్స్‌ను మీరా పాత్రలో గార్గేయి చక్కగా పలికించింది. ఏకపాత్రాభినయం తో అన్ని హావభావాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా గార్గేయి అభినయించిన తీరు అభినందనీయం.
విశ్లేషణ
ఒకే పాత్రతో సినిమా ఆద్యంతం నడిపించడం కత్తి మీద సాము లాంటిది. అలాంటి ప్రయోగాన్ని తలకెత్తుకున్న దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే ఇలాంటి ఎక్స్పరిమెంటల్ ఫిలిం ను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలు డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఉన్నత అభిరుచికి అద్దం పడుతుంది. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించాలనుకోవడమే డైరెక్టర్ సాహసం అయితే ఇందులో ఓ అమ్మాయికి సమాజంలో ఎదురయ్యే పరిస్థితులు, అనుమానంతో అమ్మాయిలను ఎలా దూషిస్తారు.. అసలు అమ్మాయిలను ఇంట్లో తల్లి కూడా అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే పరిస్థితులు, తండ్రి అండగా ఉంటే అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉంటారు అనే విషయాలెన్నో ఇందులో హృద్యంగా చూపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిల పట్ల ప్రేమ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.. అనేది ఇంపాక్ట్ ఫుల్ గా చెబుతూనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతో ధృడంగా ఉండాలని సందేశాన్ని ఇస్తూ హలో మీరా సినిమాను మలిచాడు దర్శకుడు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. తెరపై ఒకే పాత్ర ఉన్నప్పుడు సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి. ఆ బాధ్యత ను మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చక్కగా నిర్వర్తించడం తో హలో మీరా ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగిపోతుంది. మాటలు, పాటలు ఆలోచింపజేస్తాయి.
చివరగా : ఆద్యంతం ఆకట్టుకునే ప్రయోగం
రేటింగ్ : 3/5



