అసిఫ్ ఖాన్ ను హీరోగా పరిచయం చేస్తూ మౌర్యాని హీరోయిన్ గా “ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై రూపొందిన చిత్రం “నేడే విడుదల”. రామ్ రెడ్డి పన్నాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. వినోదానికి పెద్ద పీట వేస్తూనే సందేశాత్మకంగా గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 10 న విడుదలయింది. నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం అలరించిందో చూద్దాం!!
కథ:
కొన్నాళ్ళు ఉద్యోగం చేయమని చెప్పిన తండ్రి మాట కాదనలేక ఓ టివి ఛానల్ సినిమా సెక్షన్ లో చేరతాడు సిద్దు. అతను స్వతంత్ర భావాలున్న వ్యక్తి. సొంతంగా ఏదైనా చేయాలని అతనికోరిక. అయితే తండ్రి మాట మేరకు ఛానల్ లో చేరింట సిద్దు… అక్కడ పనిచేసే హారిక (మౌర్యాని) లవ్ లో పడతాడు. ప్రముఖ నిర్మాత సత్యానంద్ (కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీ నిర్మించి… దానిని ప్రచారం చేసే బాధ్యత సిద్ధూకి అప్పజెపుతాడు. బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా… పైరసీ బారిన పడి డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ ఆత్మహత్యకు పాల్పడతాడు. తను ప్రమోట్ చేసిన సినిమా నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు సిద్దు. సినిమారంగం ఎదుర్కొంటున్న సమస్యను సిద్దు ఏలా సాల్వ్ చేశాడన్నదే క్లుప్తంగా కథ.
నటీనటుల పనితీరు :
హీరో ఆసిఫ్ ఖాన్ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించాడు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్ లో సైతం మెప్పించాడు. అతనికి జంటగా నటించిన మౌర్యాని అటు అందం ఇటు అభినయంతో ఆకట్టుకుంటుంది. నిర్మాత పాత్రలో కాశీవిశ్వనాథ్ (నటుడిగా మారిన దర్శకుడు) కాసేపు కనిపించినా మెప్పించారు. హీరో స్నేహితులగా నటించిన వారిద్దరూ అక్కడక్కడా బాగానే నవ్వించారు. ముఖ్యంగా సినిమా తారలను అనుకరించే పాత్రలో నటించిన నటుడు బాగా గుర్తుంటాడు. హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా దర్భా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మిర్చి మాధవి, టి.ఎన్.ఆర్, డి.ఎమ్.కె, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇకపోతే ఈ చిత్రంతో హీరోగా పరిచయమయిన అసిఫ్ ఖాన్ కి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చు. అతని నటన చాలా నేచురల్ గా ఉంది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడు కొత్తవాడయినా ఎక్కడా తడబాటు లేకుండా కథ కథనాలను నడిపించాడు. చిత్ర పరిశ్రమ ఎలాంటి సమస్యతో నష్టపోతోందో… ఆ అంశాన్ని చక్కగా చూపించాడు.. ఈ సినిమాకి అజయ్ అరసాడ సంగీతం హై లైట్ అని చెప్పాలి. పాటలు, ఆర్.ఆర్ రెండూ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే మరింత బాగుండేది. మోహన్ చారి సినిమాటోగ్రఫీ బాగుంది. హీరోహీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
విశ్లేషణ:
ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న బర్నింగ్ ప్రాబ్లెమ్ తీసుకుని ‘నేడే విడుదల’ తెరకెక్కింది. ఈ టైటిల్ పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది అని చెప్పాలి. చక్కని కథ… కథనంతోపాటు… ఆలోచింపచేసే ఓ మెసేజ్ ఇందులో ఇచ్చాడు దర్శకుడు. ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోయిన ఈ చిత్రం సెకండాఫ్ లో ఓవైపు వినోదంతో పాటు కోర్ పాయింట్ కి కావాల్సిన మూలాలను వెతికే సన్నివేశాలను చూపించారు. ద్వితీయార్ధంలో మంగళూరుకి స్టోరీ షిఫ్ట్ అయిన తర్వాత వచ్చే ‘శాకాహారం’ కామెడీ సరదాగా నవ్విస్తుంది. డైలాగ్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. జంక్ ఫుడ్ కి అలవాటు పడిన వారు శాకాహారం వల్ల ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు అన్నది చూపించారు. అలాగే… ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… రిలీజైన వెంటనే పైరసీ బారిన పడడం వల్ల నిర్మాతలు ఎలా నష్టపోతారనేది ఇందులో ఎంతో బాగా చూపించారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ లపై కొన్ని సినిమాలు వచ్చినా… ఈ చిత్రంలో దానికి పరిష్కారం చూపించడం కొత్తగా ఉంది.అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు, ల్యాగ్ ఉన్నా… ఓవరాల్ గా బాగానే అలరిస్తుంది!!
రేటింగ్: 3.25 / 5
చివరగా: వినోదానికి సందేశం జత చేసి
ఆకట్టుకునే “నేడే విడుదల”