విక్రమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. కమల్ హాసన్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటర్వ్యూ

0
218

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్  లో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విక్రమ్ విజయంతో పాటు తమ నిర్మాణంలో కొత్త సినిమాల సంగతులు ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివి.

విక్రమ్ తెలుగు విడుదలకు తీసుకున్నపుడు.. ఇప్పుడు ఫలితం చూశాక ఎలా అనిపించింది?

కమల్ హాసన్ గారు గ్రేట్ స్టార్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు రెండు వరుసవిజయాల తర్వాత చేస్తున్న సినిమా. అందులోనూ కమల్ హసన్ గారికి ఆయన పెద్ద అభిమాని. ఇలాంటి సినిమా తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని అనుకున్నా. కమల్ హాసన్ గారిని కలిశాను. ఆయన మాపై ఎంతో నమ్మకంతో సినిమా ఇచ్చారు. విక్రమ్ గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది.

అనుభవం గల డిస్ట్రిబ్యూటర్ వుండాలని భావించి కమల్ హాసన్ గారు కూడా మీ పేరే సూచించారట కదా ?

అవునండీ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. మా అనుభవాన్ని ఉపయోగించి భారీగా ప్రమోషన్స్, నెంబర్ ఆఫ్  స్క్రీన్స్ ఉండేలా చేశాం. దాదాపు నాలుగు వందల స్క్రీన్స్ లో విడుదల చేశాం. మొదటి ఆట నుండే అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. మొదటి రోజు వున్న కలెక్షన్స్ ఈ రోజుకీ వున్నాయి.

విక్రమ్ సినిమా తీసుకోవడానికి ప్రధాన కారణం ? సినిమా ముందు చూశారా ?

ముందు సినిమా చూడలేదు. ట్రైలర్ చూడగానే ఇది వందశాతం డైరెక్టర్ సినిమా అని అర్ధమైయింది. కమల్ హాసన్ గారు ఈ చిత్రాన్ని తన హోమ్ ప్రొడక్షన్  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా చేశారు. అలాగే విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య లాంటి గొప్ప స్టార్ కాస్ట్ వుంది. మా నమ్మకం నిజమైయింది. సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. నిన్నటికి 18కోట్లు వసూలు చేసింది. నేటితో 20 కోట్లు క్రాస్ చేస్తుంది. మేము, కమల్ గారు, ఎక్సహిబిటర్స్.. అంతా హ్యాపీగా వున్నాం.

నితిన్ గారు ఏమైనా సజస్ట్ చేశారా ?

ట్రైలర్ చూడగానే” విక్రమ్ తీసుకోండి డాడీ. సినిమా బావుంటుంది’ అని చెప్పారు.

కరోనా తర్వాత ఇండస్ట్రీ సమస్యలు చూస్తుంటే ఒక సినీయర్ డిస్టిబ్యూటర్, నిర్మాతగా మీకు ఏమనిపిస్తుంది ?

సమస్యలు ఎప్పుడూ వస్తుపోతుంటాయి. మనం కూడా పని చేసుకుంటూ వెళ్తుంటాం. మంచి సినిమా అయితే ఖచ్చితంగా ఆడుతుంది. విక్రమ్, మేజర్ ఒకే రోజు విడుదలై రెండూ అద్భుతంగా ఆడుతున్నాయి కదా.

మీ సినిమా ఒకటి డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చారు కదా.. ఓటీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది ?

సినిమాని థియేటర్ లోనే ఎక్సపిరియన్స్ చేయాలి. ప్రేక్షకుడికి థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. ఓటీటీ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి.

సినిమా విడుదల తర్వాత కమల్ హాసన్ గారిని కలిశారా ? మీకు ఏదైనా బహుమతి ఇచ్చారా?

గత రెండు నెలలుగా విక్రమ్ ప్రమోషన్స్ కోసం దేశం వ్యాప్తంగా తిరుగుతున్నారాయన. విక్రమ్ విడుదల తర్వాత ఆయన్ని కలిశాను. నేనే ఆయనకి బహుమతి ఇవ్వాలి(నవ్వుతూ). సినిమాని ఎవరికి ఇవ్వాలో కమల్ గారికి తెలుసు. సరైన వ్యక్తికి ఇస్తే ఓవర్ ఫ్లో వస్తుంది, డబ్బు వస్తుంది న్యాయం జరుగుతుంది. ఆయన మమ్మల్ని నమ్మారు. ఆయన నమ్మకానికి మేము న్యాయం చేశాం.

ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా చాలా చురుగ్గా వుండే మీరు ఈ మధ్య బాగా సెలక్టివ్ అయిపోవడానికి కారణం ?

నైజాంలో వున్నదే ఇద్దరు. ఆంధ్రలా పెద్ద టెరిటరీ కాదిది. రాయలసీమలో ఒకొక్క ఏరియాల్లో ఒకొక్కరు కొంటారు. నైజాం అలా కాదు. ఇక్కడ ఎవరో ఒక్కరే దిగాలి. బడ్జెట్, మేకింగ్ పెరిగిపోతుంది. 40, 50 కోట్లకు సినిమా కొంటున్న పరిస్థితిలో తేడా వస్తే సగం పోతుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. అందుకే సెలక్టివ్ గా చేయాల్సివస్తుంది.

ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ గా చేయడనికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ? మీ బ్యానర్ లో చేసే సినిమాల కథల ఎవరు ఫైనల్ చేస్తారు ?

హీరో గ్రాఫ్, దర్శకుడు ట్రాక్ రికార్డ్, స్టొరీ లైన్ తెలిస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మా బ్యానర్ లో కథలు నేను, నితిన్, మా అమ్మాయి ఫైనల్ చేస్తాం.

నితిన్ గారు కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసి మళ్ళీ ఇప్పుడు స్టడీ అయ్యారు కదా ? దిన్ని ఎలా చూస్తారు ?

అందుకే ఇప్పుడు సొంత సినిమాలు చేస్తున్నాం. సొంత బ్యానరే కాబట్టి రేమ్యునిరేషన్ తగ్గించినా సినిమాకి బడ్జెట్ పెట్టొచ్చు. రెండు కోట్లు పెట్టి యాక్షన్ ఎపిసోడ్ తీయాలనుకుంటే నేను తీస్తా. కానీ ఇదే నేను వేరే నిర్మాతకు చెబితే.. హీరో ఫాదర్ పట్టుబడుతున్నారని అనుకుంటారు కదా(నవ్వుతూ). అందుకే రెండు మూడు సినిమాలు నేనే ప్లాన్ చేశా.

విక్రమ్ సినిమా విజయానికి కారణాలు అడిగితే ఏం చెప్తారు ?

హీరో దర్శకుడు నటులు టెక్నిషియన్లు అందరూ కష్టపడ్డారు. కమల్ హాసన్ గారు ఫస్ట్ హాఫ్ దాదాపు కనిపించరు. డ్యుయట్, కామెడీ , ఐటెం సాంగ్స్ లేవు. కానీ ప్రేక్షకులని ఎంతో ఎంగేజింగ్ గా ఉంచారు. విక్రమ్ లో గొప్ప స్క్రీన్ ప్లే వుంది.

విక్రమ్ సీక్వెల్ గురించి చెప్పారా ?

ఇంకా స్టార్ట్ కాలేదు. దర్శకుడు ఫ్రీ కావాలి కదా. సీక్వెల్ చేసినప్పుడు మనకే ఇస్తారు. మనమే చేస్తాం.

లోకేష్ కనగరాజ్ -నితిన్ కాంబినేష్ లో సినిమా వుంటుందా ?

ఇంకా అలాంటింది ఏమీ అనుకోలేడండీ. లోకేష్ కనగరాజ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ వున్నాయి. భవిష్యత్ లో ఎలా వుంటుందో చెప్పలేను.

ఓటీటీకి  సినిమా చేసే ఆలోచన ఉందా ?

లేదండీ. థియేటర్ సినిమాకే సమయం సరిపోవడం లేదు.

విక్రమ్ కి ఇండస్ట్రీ నుండి అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?

అందరూ ఫోన్ చేస్తున్నారు. సినిమా అడుగుతున్నారు, స్పెషల్ షోలని ఎంజాయ్ చేస్తున్నారు.

రేట్లు పెంచడం వలన థియేటర్ కి ప్రేక్షకులు రావడం తగ్గించారని వినిపించింది. విక్రమ్ తో మళ్ళీ థియేటర్ కి పూర్వ వైభవం వచ్చిందని భావిస్తున్నారా ?

థియేటర్ కి ఎప్పుడూ వైభవం వుంటుంది. రేట్లు మాత్రం ఎక్కువగా పెంచకూడదు. దీనికి నేను మొదటి నుండి వ్యతిరేకం. బడ్జెట్ పెరిగిందని టికెట్ రేటు పంచడం తప్పు కదా. ఎంత పెంచాలో అంతే పెంచాలి. సినిమా మూడు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఇంట్లోనే చూసుకునే అవకాశం వున్నప్పుడు అంత డబ్బు ఎందుకు పెట్టాలి?

‘విక్రమ్’ కి చాలా తక్కువ రేటు పెట్టారు కదా ..ఆ నంబర్ కి ఎలా ఫిక్స్ అయ్యారు ?

ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. 200 నుండి 350 పెట్టుకోమన్నారు. అలగాని 350పెట్టకూడదు కదా. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము మల్టీ ఫ్లెక్స్ లో 200 మాత్రమే పెట్టాం. డబ్బు వచ్చింది కదా. బాహుబలి 2 నైజాంలో సాధారణ ధరలకే 55కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు ? టికెట్ అందరికీ అందుబాటులో వుంటే రిపీట్ చూస్తారు, ఫ్యామిలీతో వస్తారు. ఇద్దరు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయిలైతే ఎలా ?

ముంబై బెంగళూర్ లాంటి సిటీలో టికెట్ రేట్లు ఎక్కువున్నాయి కదా ?

మెట్రోపాలిటన్ సిటీలలో వీకెండ్స్ లో 500, 1000 ఇలా పెట్టుకుంటారు. దానికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. మిగతా రోజులన్నీ మళ్ళీ తక్కువే కదా.

సినిమా విడుదలైన 50 రోజుల వరకూ ఒటీటీలోకి రాకూడదనే నిబంధన పెడితే ?

చిన్న, పెద్ద సినిమా ఏదైనా.. విడుదలైన 5వారల వరకూ ఓటీటీలోకి రాకూడదనే విధానం వుంది. సినిమా సరిగ్గా ఆడకపోతే ఓటీటీ వాళ్ళు మరో కోటి ఎక్కువ ఆఫర్ చేస్తే విడుదలకు ఇచ్చేస్తున్నారు. అడిగితె కోటి ఎక్కువ వస్తుంది కదా అంటున్నారు. ఈ విషయంలో ఐక్యత లేదు. దీని ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది.

పవర్ పేట టైటిల్ తో ఎనౌన్స్ చేసిన సినిమా ?

పవర్ పేట అనౌన్స్ చేశాం. కానీ ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ రాకపోవడంతో ఆపేశాం. ఇక ఆ సినిమాని పక్కన పెట్టేసినట్లే.

నితిన్ తో పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచన ఉందా ?

ఇప్పటికి ఆ ఆలోచన లేదండీ. సరైన ప్రాజెక్ట్, ప్లాన్ కుదరాలి.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా ?

ప్రస్తుతానికి ఏం లేదండీ. ఇప్పుడు మీ అందరితో హ్యాపీగా వున్నాను కదా (నవ్వుతూ).

మీ బ్యానర్లో వస్తున్న సినిమాల గురించి ?

మాచర్ల నియోజికవర్గం 80శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్ 11న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. అలాగే వక్కంత వంశీ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుండి వుంటుంది. ఇప్పటికే ఒక పాట షూట్ చేశాం. ఇది కిక్, రేసు గుర్రం తరహలో వుంటుంది. సురేందర్ రెడ్డి సినిమా కూడా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here