భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడం నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నైజం. అందుకు ఉదాహరణ… రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌తో తీసిన ‘2.0’. తమిళంలో ‘నవాబ్’ రజినీకాంత్ ‘దర్బార్’, ‘కత్తి’ (తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు) వంటి మంచి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు మణిరత్నం. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా సుభాస్కరన్ సమర్పణలో నిర్మిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. అదే పేరుతో సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని 2022లో విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. అయితే, సినిమాలో నటీనటుల వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రతారలు ఇందులో నటిస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది.
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథనం: జైమోహన్, ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్, కళా దర్శకత్వం: తోట తరణి, కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్, నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్, సమర్పణ: సుభాస్కరన్.