ఇక‌పై అన్ని భాషల్లో సినిమాలు చేస్తా – మాధ‌వ‌న్‌

0
66

వయసు పెరుగుతున్నకొద్దీ క్రమంగా అందుకు తగ్గ కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టుడు మాధ‌వ‌న్‌. తాజాగా అనుష్క, మాధ‌వ‌న్‌,అంజ‌లి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం నిశ్శ‌బ్ధం. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్‌ నిర్మించారు. అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మాధవన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మీ కెరీర్‌లో నేరుగా ఓటీటీలో విడుద‌లైన సినిమా ఇదే కదా ఎలా అనిపించింది?
ఇదివరకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ‘బ్రీత్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశా. అయితే ఓటీటీలో నేరుగా విడుద‌లైన సినిమా మాత్రం ఇదే. మంచి సినిమా థియేటర్‌లో కాకుండా, ఓటీటీలో విడుదలవుతుంది అని మొదట్లో కొంచెం బాధపడ్డాను. కాని ఇప్పుడు
ఓటీటీ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువైనందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను.

‘నిశ్శబ్దం’ క‌థ విన‌గానే మీ రియాక్ష‌న్ ఏంటి?
రచయిత కోన వెంకట్, దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ వచ్చి ఈ కథ చెప్పారు. మాట్లాడలేని, వినలేని ఓ అమ్మాయి ఓ హత్య కేసుని ఎలా పరిష్కరించిందనే అంశం న‌న్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొదట దీన్ని మాటల్లేకుండా సాగే సినిమాగా చేయాలనుకున్నాం. ఆ విషయం నాలో మరింత క్యూరియాసిటీని పెంచింది. అయితే సినిమా చేస్తున్నప్పుడు మాటల్లేకుండా ఈ కథని నడిపించలేం అనిపించి కొన్ని సంభాషణల్ని జోడించ‌డం జ‌రిగింది.

చాలా కాలం త‌ర్వాత అనుష్కతో క‌లిసి న‌టించ‌డం..?
అనుష్క, నేను హీరోహీరోయిన్లుగా ‘రెండు’ అనే సినిమాలో నటించా. 14 యేళ్ల తర్వాత మేం మళ్లీ ‘నిశ్శబ్దం’ కోసం కలిసి పనిచేయ‌డం హ్యాపీగా అనిపించింది. నటిగా ఆమె పరిణతి చెందిన విధానం, ఆమె సినిమాని అర్థం చేసుకునే విధానం నాకు చాలా ముచ్చటగా అనిపించాయి. అలాగే సినిమా, సన్నివేశాల విషయంలోనూ త‌ను ఎంతో బాధ్యతగా వ్యవరిస్తుంటుంది. అదే సమయంలో చుట్టూ ఉన్నవాళ్ల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అనుష్కలో ఆ గుణం నాకు బాగా నచ్చింది.

ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ గురించి?
హేమంత్ చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు. త‌ను మొద‌టినుండి ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మేకింగ్ ప‌రంగా మంచి విజ‌న్, టెక్నిక‌ల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది అందుకే ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీయ‌గ‌లిగాడు.

మీరు ఇప్ప‌టివ‌ర‌కు థ్రిల్లర్‌ సినిమాల్లోనే ఎక్కువగా క‌నిపించారు. మీకు ఎలాంటి కథలంటే ఇష్టం?
రొమాన్స్, కామెడీతో కూడిన కథలంటేనే ఇష్టం. ఆ తర్వాత యాక్షన్ సినిమాల‌ని కూడా ఇష్టపడతా. థ్రిల్లర్‌ చిత్రాలు బాగా చూస్తాను కానీ, హారర్‌ కథలకి మాత్రం కొంచెం దూరంగా ఉంటాను.

‘సవ్యసాచి’ తర్వాత తెలుగులోమరిన్ని కథలు మీ దగ్గరికొస్తున్నట్టున్నాయి కదా?
ఆ సినిమా తర్వాత తెలుగు నుంచి చాలా కథలొచ్చాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి . కానీ నేను స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ‘రాకెట్రీ’ వల్ల ఏదీ ఒప్పుకోలేకపోయా. ‘సవ్యసాచి’కి నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలనుకున్నా. కానీ చెప్పలేకపోయా. అయితే నా తదుపరి తెలుగు సినిమాకి మాత్రం తప్పకుండా నేనే డబ్బింగ్‌ చెప్పుకొంటా. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. ఇకపై ఎన్ని భాషల్లో చేయగలిగితే అన్ని భాషల్లో సినిమాలు చేస్తా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here