బాలీవుడ్ ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కాసేపటి క్రితం ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటన రావడం జరిగింది. కొన్నాళ్లుగా పెద్ద ప్రేగుకు సంబందించిన క్యాన్సర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్, కొన్నాళ్లపాటు లండన్ లో ఆ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కోకిలబెన్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు నిన్నటి నుండి ఐసియులో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కాసేపటి క్రితం పరిస్థితి మరింత విషమించిందని, తాము ఎంత ప్రయత్నించినా ఆయనను దక్కించుకోలేకపోయామని డాక్టర్లు ఆయన మరణాన్ని ధృవీకరించారు.
కాగా ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకుని రీసెంట్‌గా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించారు విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఇర్ఫాన్, ‘పాన్ సింగ్ తోమర్’ అనే సినిమాలో గొప్ప నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్న ఇర్ఫాన్, అటు హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో ఇర్ఫాన్ నటించారు. కాగా ఆయన హఠాన్మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు