సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా 2015లో రిలీజ్ అయి అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. తనకున్న వేల కోట్ల ఆస్తిని కాదని, మంచి మనసుతో ఒక గ్రామాన్ని దత్తతు తీసుకుని అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆపై ప్రజల హృదయాలు గెలుచుకున్న నిజమైన మనసున్న ‘శ్రీమంతుడు’ గా హర్ష అనే క్యారెక్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తొలిసారిగా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక కొన్నాళ్ల నుండి యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా, నేటితో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుని టాలీవుడ్ లో తొలిసారిగా 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న తెలుగు సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. దీనితో కాసేపటి క్రితం నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సినిమా యూనిట్ కి, అలానే తమ హీరో సూపర్ స్టార్ మహేష్ కు ప్రత్యేకంగా అభినందనలు తెల్పుతూ కామెంట్స్ చేస్తున్నారు…..!!