బ్లాక్ అండ్ సినిమాల నుంచి సహాయనటిగా, నటిగా, అమ్మగా ఐదు దశాబ్దాలుగా 900లకు పైగా సినిమాల్లో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి అన్నపూర్ణమ్మ. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న చిత్రం `అన్నపూర్ణమ్మ గారి మనవడు` మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలలో నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎంయన్ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్బంగా నటిఅన్నపూర్ణమ్మ పాత్రికేయులతో ముచ్చటించారు.
ఇండస్టీలో అడుగుపెట్టి చాలా ఏళ్లయినా ఇప్పటికీ భయభక్తులతోనే ఉంటాను. ఎదుటి వారిని గౌరవిస్తాను. వారు చెప్పింది వింటాను. పాత్రను ఎంచుకునే ముందు చాలా పాత్రలు చేశాను అందులో ఇదొకటి అనే భావనతో ఎప్పుడూ ఆలోచించను అందువల్లే ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉండగలిగాను. ఆ తపన లేకపోతే కనుమరుగవుతాం’
నా పేరుతోనే తెరకెక్కిన చిత్రం, బాధ్యతతో కూడిన పాత్ర కావడంతో కొంచెం భయంగానే నటించాను. నానమ్మ, మనవడి అనుబంధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నానమ్మను వెతుక్కుంటూ ఓ పల్లెటూరికి మనవడు ఎందుకొస్తాడు. బయటి వ్యక్తిలా ఆ కుటుంబంలోకి ప్రవేశించిన ఆ మనవడు నాన్నమ్మ ఎలా దగ్గరయ్యాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
మాస్టర్ రవితేజ చిన్నవాడు అయినా చక్కగా నటించాడు. అలాగే దర్శకుడు శివనాగు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు. నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరు వారి వారి సామర్థ్యం మేర నటించారు. కుటుంభం, బంధాలు విలువలతో సాగే చిత్రమిది. జమున గారు ఒక కీలక పాత్రలో నటించారు. అలాగే చాలా మంది మనకు బాగా తెలిసిన ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు.
1974లో నీడలేని ఆడది చిత్రంతో నా సినీ ప్రయాణం ఆరంభమైంది. ఇప్పటివరకు ఎనిమిది నుండి తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో, నాలుగు భాషల్లో నటించాను. హీరోయిన్ గా `స్వర్గం నరకం`, `అమ్మాయిలు జాగ్రత్త` సినిమాలు చేశాను.
కథానాయికగా రాణించడం కష్టమనే ఆలోచనలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాను. ఇతరులతో నన్ను ఎప్పుడూ పోల్చుకోను. మరొకరి పాత్రలు నేను చేస్తే బాగుండునని ఎప్పుడూ అనుకోను. సెట్స్ లో దర్శకుడు చెప్పినట్లుగానే నటిస్తాను. నా సొంత పైత్యాన్ని ఉపయోగించను. డబ్బుల విషయంలో ఎప్పుడూ నాకు ఇంత కావాలని డిమాండ్ చేసింది లేదు. నిర్మాతల క్షేమాన్ని ఆలోచించి పారితోషికం తీసుకుంటాను.
సినిమా ఎప్పుడూ ఒక పాత్ర ప్రధానంగా ఉండకూడదు. నేను ఒక్కడినే అనుకోవడం వల్లే సినీ పరిశ్రమ యాభై శాతం పతనమైంది. అన్ని పాత్రలకు సమాన ప్రాముఖ్యత ఉన్నప్పుడే సినిమాలు ఆడతాయి, ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబు చేసిన సినిమాల్లో మిగతా పాత్రల్లో ఒకటి హీరో క్యారెక్టర్ గా ఉండేది. ఇప్పటి సినిమాల్లో హీరోలు తప్ప మిగతా పాత్రలు కనిపించడం లేదు..