విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
నటీనటులు : విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు
దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాతలు : ప్రశాంతి తిపిర్నేని,
సమర్పణ: నాని
సంగీతం : వివేక్ సాగర్,
సినిమాటోగ్రఫర్ : ఎస్. మణికండన్,
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
ఓ వైపు నటుడిగా బిజీగా ఉంటూనే..మరోవైపు నిర్మాణంలో అడుగు పెట్టి అ!’ సినిమాతో నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్‌తో పాటు జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు నాని. ఈ సినిమా తర్వాత నాని ఎలాంటి చిత్రాన్ని నిర్మిస్తాడో అని సినీ వర్గాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తొలి సినిమాకు పూర్తి భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. శైలేష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రానికి ‘హిట్’ అనే టైటిల్ పెట్టడం ఆసక్తిని కలిగించింది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమాదాస్’ చిత్రాలతో యువతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విష్వక్‌సేన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ‘హిట్’ టైటిల్‌తో పాటు టీజర్ & ట్రైలర్ తో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందా? లేదా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథ:
హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (HIT)లో చీఫ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్). ఫోరెన్సిక్ ఆఫిసర్‌గా పనిచేస్తున్న నేహా (రుహానీ శర్మ) ని ప్రేమిస్తాడు. అయితే అతని గతంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ కు లోనవుతుంటాడు. అందువల్ల ఆ ఘటనకు సంభందించిన ఆనవాళ్ళను చూసినప్పుడు ప్యానిక్ ఎటాక్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి మెంటల్ స్ట్రెస్ తో పోలీస్ ఉద్యోగం చేయడం మంచిది కాదని తన స్నేహితులు సూచించినా వినిపించుకోకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాడు. ఒకరోజు అనుకోకుండా నేహా మిస్ అయిందని తన స్నేహితుడి ద్వారా తెలుసుకుని అనదికారికంగా ఆ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. కాని ఎలాంటి క్లూస్ దొరకకపోవడంతో అదే తరహాలో రెండు నెలల క్రితం హైవేలో మిస్ అయిన ప్రీతి అనేది అమ్మాయి కేస్ విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేసినప్పటికీ.. ఉపయోగం లేకపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎలాంటి క్లూస్ దొరకవు. ఒక పక్క తన గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యిందనే బాధ, ఇంకోపక్క తన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ను అధిగమించి విక్రమ్ దుండగులను ఎలా పట్టుకోగలిగాడు అనేది తెలుసుకోవాలంటే `హిట్` సినిమా చూడాల్సిందే…
క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గా విక్రమ్ పనితనాన్ని చూపెట్టే సీన్లతో ప్రథమార్థం మొదలవుతుంది. మధ్య మధ్యలో అతను గతాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, మానసినకంగా బాధపడటం వంటి సీన్లతో కథనం ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే ప్రీతి అనే అమ్మాయి మిస్ అవుతుందో అప్పటినుండి కథనం వేగం పుంజుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఆ పని ఎవరు చేశారో తెలీకుండా నడిపే కథనంతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చునేలా చేస్తుంది. తర్వాత నేహా కూడా మిస్ అవ్వడం, ఈ రెండు మిస్సింగ్ కేసులకు లింక్ ఉందని పసిగట్టిన విక్రమ్ కేసును చేధించడంతో కథనం చకచకా కదులుతుంది. షీలా (హరితేజ) ఇంటి ముందు దొరికిన ఓ క్లూతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఇక సెకండాఫ్ కథలో అనుకోని మలుపులు తిరుగుతుండటంతో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రీతి అమ్మానాన్నలు, ప్రీతి పెరిగిన అనాథాశ్రమం ఆయా సరస్వతి, ఆమె స్నేహితుుడు అజయ్ ఇలా ప్రతీ ఒక్కరిపై అనుమానం మరింత బలపడేలా చేయడంతో అసలేం జరుగుతుందా? అనే అనుమానం ప్రేక్షకుల మదిలో కలిగేలా చేయడంలో సక్సెస్ అయింది. చివరకు అసలు నేరస్తుడిని విక్రమ్ పట్టుకోవడం, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ఊహకందదు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా క్లైమాక్స్ రాసుకోవడంతో దర్శకుడు తనదైన మార్క్ చూపించారు.
HIT చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రమ్ పాత్రలో నటించిన విశ్వక్‌సేన్ గురించే. పోలీస్ పాత్రకు ఉండే యాటిట్యూడ్ మెయింటెన్ చేస్తూ.. తనదైన శైలిలో నటించాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రంలోని విశ్వక్‌సేన్‌కు ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌కు నటనలో ఎంతో తేడా కనిపించింది. చిలసౌ సినిమాలో నటనతో ఆకట్టుకున్న రుహానీ శర్మ.. ఈ చిత్రంతో మరో సారి మెప్పించింది. వీరిద్దరి తరువాత పోలీస్ ఆఫిసర్స్ పాత్రలలో భాను చందర్, మురళీ శర్మ, అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం:
సినిమాలను తెరకెక్కించే శైలీ మారింది. ఒకే ధోరణిలో పోకుండా కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు నేటి తరం యువ దర్శకులు. ఆ కోవలోకి చెందినదే శైలేష్ కొలను తెరకెక్కించిన HIT చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనంలో అందర్నీ కట్టిపడేశాడు. ఎక్కడా కూడా అనుమానం రాకుండా.. చక్కటి స్క్రీన్‌ప్లే తో సినిమాని మలిచి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. HIT చిత్రానికి సంబంధించి సాంకేతిక బృందంలో వివేక సాగర్ ముందుంటాడు. ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ముఖ్యం. ప్రతీ సీన్‌ను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. కెమెరామెన్ మణికంధన్.. ప్రతీ సీన్ అందంగా తెరకెక్కించాడు. ప్రతీ నటుడి చిన్న హావభావాన్ని కూడా మిస్ కానివ్వలేదు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఎంతో చాకచక్యంగా కట్ చేశాడు. ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. నాని నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
రెగ్యులర్ థ్రిల్లర్స్ కు భిన్నంగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “హిట్”. విశ్వక్ సేన్ నటన, శైలేష్ కొలను స్క్రీన్ ప్లే & ఇన్వెస్టివేషన్ ప్రొసీజర్స్ ను అర్ధవంతమైన రీతిలో వివరించిన విధానం, వివేక్ సాగర్ నేపధ్య సంగీతం కోసం థియేటర్లో తప్పకుండా చూడాల్సిన చిత్రం. థ్రిల్లర్ సినిమాల అభిమానులనే కాక రెగ్యులర్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి.
బాటమ్ లైన్: ఆకట్టుకునే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
రేటింగ్: 3/5