‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నేటి యువతకు కావాల్సిన అందం, అభినయం రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకుంది నభా నటేష్.. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిస్కోరాజా’ సినిమాలో నభా నటిస్తోంది. రామ్‌తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ చెప్పిన విశేషాలు….
*ఈ చిత్రంలో నేను నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపిస్తాను. ఇంతకుముందు నేను చేసిన పాత్ర లతో పోలిస్తే ఈ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎమోషన్స్‌కు విలువ ఇచ్చే అమ్మాయి పాత్ర. నా నిజ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది.
* రవితేజగారి ‘విక్రమార్కుడు’ నా ఫెవరెట్ మూవీ. `కిక్` సినిమా కూడా ఇష్టమే. ఆయనకు నేను బిగ్ ఫ్యాన్‌ని. రవితేజగారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటాయి. రవితేజగారితో వర్క్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. సెట్స్‌లో కేవలం సినిమాల గురించే కాదు..జీవనశైలి, ఆహారపు అలవాట్లు..ఇలా చాలా విషయాల గురించి ఆయన మాట్లాడుతుంటారు. షూటింగ్ చాలా ఫన్నీగా
గడిచిపోయింది. ఈ సినిమాలో రవితేజగారి రోల్ గురించి నేను ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు.
థియేటర్స్‌లో ఆడియన్స్ ఈ థ్రిల్‌ను ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాస్ స్కైఫై థ్రిల్లర్‌కు
రవితేజగారి ఎనర్జీ, వీఐ ఆనంద్‌గారి స్టైల్ తోడైతే ఎలా ఉంటుందో డిస్కోరాజా అలా ఉంటుంది.
ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుంది.
*ఈ సినిమా కథ విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆనంద్‌గారి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి
ఉంటుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. మేజర్‌గా అన్నీ రవితేజ, ‘సత్యం’ రాజేష్, నరేష్‌గారితోనే ఉన్నాయి.
* కెరీర్ మొదట్లోనే నటనకు ఆస్కారం ఉండి, ఢిపరెంట్ పాత్రలు చేసే అవకాశాలు నాకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నేను థియేటర్స్ ఆర్టిస్టును కాబట్టి నాకు అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది.
*కెరీర్ పరంగా 2019 నా బెస్ట్ ఇయర్. `ఇస్మార్ట్‌శంకర్` కిక్ ఇంకా ఉంది. ఎక్కడికి వెళ్లిన ఆ పాటలు, డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రేక్షకులు ఆదరణ కూడా ముఖ్యమే. యంగ్ హీరోయిన్స్ మధ్య పోటీ ఉండొచ్చు. అందరు బాగా నటిస్తున్నారు. నేనూ ఇంకా కష్టపడాలనుకుంటున్నాను.
* ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నాను. అలాగే కన్నడ, తమిళ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నాను.