కంటెంట్ ఈజ్ కింగ్ అని మత్తువదలరా విజయం మరోసారి నిరూపించింది – నిర్మాత చెర్రి

0
518

దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అద్వితీయ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో మత్తు వదలరా బృందం కంటెంట్ ఈజ్ కింగ్ సమావేశాన్ని నిర్వహించింది.  ఈ వేడుకకు మత్తు వదలరా బృందం హీరో అడివిశేష్‌ తో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఆర్.ఎస్.జే స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

అడివిశేష్ మాట్లాడుతూ మత్తు వదలరా నా దృష్టిలో పెద్ద సినిమా. రెండు రోజుల క్రితం సినిమా చూశాను. సగటు ప్రేక్షకుడిలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రబృందం నాలో స్ఫూర్తిని నింపింది. ఇలాంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, నటీనటులతో పనిచేయాలనే తపన నాలో కలిగించింది. పరిపూర్ణమైన చిత్రమిది. నటుడిగా శ్రీసింహా చక్కటి వేరియేషన్స్‌ను కనబరిచారు. కేవలం రెండు కంప్యూటర్స్‌తోనే అత్యున్నతమైన క్వాలిటీలో ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అని అన్నారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్.ఎస్.జె.స్వరూప్ మాట్లాడుతూ ఈ చిత్రబృందాన్ని చూస్తుంటే నా ఆత్రేయ టీమ్ గుర్తొస్తుంది. చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ఇది. నవ్విస్తూనే చప్పట్లు కొట్టిస్తున్నది. వైవిధ్యమైన కథాగమనంలో సరికొత్తగా సినిమాను తెరకెక్కించారు. గత ఏడాది వచ్చిన ఏడు థ్రిల్లర్ సినిమాలు అద్భుతమైన విజయాల్ని సాధించాయి. అందులో మత్తు వదలరా ఒకటిగా నిలవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ నన్ను నేను పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్..ఇలా ఏదో ఒక విభాగం పనితీరుతో సినిమాలు ఆడుతుంటాయి. కానీ ఈ సినిమా అన్ని విభాగాల సమిష్టి కృషి వల్ల విజయవంతమైంది. ఇలాంటి కథను రాయడం చాలా కష్టం. కొత్తవాళ్లను నమ్మి ఇలాంటి కథతో నిర్మాతలు సినిమా తీయడం ఇంకా కష్టం. రితేష్‌రానా బృందం ఆలోచనల్ని నమ్మి చెర్రి, మైత్రీ మూవీస్ వారు సినిమాను చేయడం అభినందనీయం అని చెప్పారు.

మైత్రీ మూవీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ ఓ సినిమా వందకు 125 వసూలు చేస్తే హిట్. వందకు 150 వసూలు చేస్తూ సూపర్ హిట్. అదే వంద పెట్టుబడికి రెండు వందలు కలెక్షన్స్ రాబడితే బ్లాక్‌బస్టర్. మత్తు వదలరా మూడో కేటగిరికి చెందిన సినిమా. అనుకున్న బడ్జెట్‌లోనే చిత్రబృందం ఈసినిమాను పూర్తిచేశారు. చేశారు. చిన్న సినిమా అయినా కథను నమ్మి ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్ ప్రకాష్ పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేశారు. డిసెంబర్‌లో పోటీగా చాలా సినిమాలు విడుదలైనా కథపై నమ్మకంతో తక్కువ థియేటర్లు దొరికినా విడుదలచేశాం. మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతమవ్వడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా, ప్రభాస్ ఇండస్ట్రీలోని చాలా మంచి సినిమాకు తోడ్పాటును అందించారు అని తెలిపారు.

నిర్మాత చెర్రి మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సినిమా తీసి విజయాన్ని అందుకోవడం గర్వాన్ని కలిగిస్తున్నది. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా రుజువుచేసింది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది అని అన్నారు.

దర్శకుడు రితేష్‌రానా మాట్లాడుతూ మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మాను. అదే నిజమైంది. ప్రతి ఒక్కరూ కథ, పాత్రల్ని ఓన్ చేసుకుంటున్నారు. కాలభైరవ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈసినిమాతో టీమ్ అందరికి పేరురావడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

హీరో శ్రీసింహా మాట్లాడుతూ కొత్త ఏడాది చక్కటి విజయంతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కథాబలమున్న సినిమాలతోనే నటుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని చెప్పారు.
కాలభైరవ మాట్లాడుతూ ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను. సినిమా రూపకల్పనతో పాటు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి ఉండే శ్రమ ఏమిటో తెలిసింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ వందశాతం కష్టపడి ఈసినిమా చేశారు. అందువల్లే నేను మంచి నేపథ్య సంగీతాన్ని ఇవ్వగలిగాను అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సురేష్ సారాంగం, థామస్, తేజ, రోహిణి, అతుల్యచంద్ర, నరేష్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here