బాలకృష్ణగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చేసిన ‘రూలర్’ అభిమానులకి పండుగలాంటి సినిమా – ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేఎస్‌ రవికుమార్‌

0
1140

‘‘చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే మనకు క్రమ శిక్షణ, అంకితభావం, నిజాయితీలను అలవరుస్తుంది’’ అని అన్నారు ప్రముఖ దర్శకులు కేఏస్‌ రవికుమార్‌. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న105వ చిత్రం `రూల‌ర్` కి దర్శకత్వం వహించారు. వేదిక, సోనాలీ చౌహాన్‌ కథానాయికలు.భూమిక కీలక పాత్రధారి. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ఇంటర్వ్యూ

మొదటగా ఈ సినిమాకి వేరే కథ అనుకున్నారంట?
–‘రూలర్‌’ సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళీ చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్నచిన్నమార్పుల‌తో ఈ సినిమా చేశాం. ముందు అనుకున్న క‌థ కూడా బాగుంది కాని ఈ క‌థ అయితే బాల‌కృష్ణ గారి ఇమేజ్‌కి క‌రెక్ట్‌గా సెట్ అవుతుంది అని దాన్ని ప‌క్క‌న పెట్టాం.

రూలర్ సినిమా ఎలా ఉండబోతుంది?
– ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది. బాలయ్య అభిమానులకు, సినీ ప్రేమికులకు ఒక పెద్ద పండుగ. ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన సెటిలర్స్‌ సమస్యల్ని నేపథ్యంగా తీసుకుని అల్లుకున్న కథ ఇది. అద్భుతమైన కథాంశం ఉన్న సినిమా రేపు థియేటర్స్ లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. ప్ర‌తి పాత్ర బాగుంటుంది.

బాలకృష్ణ గారి గెటప్స్ కి మంచి అప్లాజ్ వస్తోంది కదా? ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారా ?
– ఇప్ప‌టికే విడుదల చేసిన ‘రూలర్‌’ సినిమా ట్రైలర్‌లో బాలకృష్ణగారు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించారు. అన్ని గెటప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐతే
ఆయన క్యారెక్టర్‌లో రెండు షేడ్స్‌ ఉంటాయా? లేక డ్యూయెల్‌ క్యారెక్టర్‌ చేశారా? అన్న విషయాలను మాత్రం వెండితెర పై చూసి తెలుసుకోవాలి. ప్ర‌స్తుతానికైతే స‌స్పెన్స్‌.

బాలకృష్ణ గారితో వెంట వెంటనే సినిమాలు చేస్తున్నారు ఆయనలో మీకు నచ్చిన అంశం?
– ‘జైసింహా’ తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో ‘రూలర్‌’ సినిమా చేశాను. అందుకు ఆయన సిన్సియారిటీ, అంకితభావమే ముఖ్యకారణం. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు వెయిట్ తగ్గారు. రోజు ఉదయాన్నే మూడు గంటలకు నిద్రలేచి వర్కౌట్స్‌ చేసేవారు. అలాగే షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్ళీ వ‌ర్కౌట్స్ చేసేవారు. ఆయన డెడికేష‌న్‌, అంకితభావం నాకు బాగా నచ్చింది.

స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు వారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తారా?
– నా కెరీర్‌లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘రూలర్‌’ సినిమా సమయంలోనూ బాలకృష్ణగారి ఇమేజ్‌ని నేను గుర్తుపెట్టుకున్నాను.

మీరు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశారు కదా! రియలిస్టిక్ సినిమాలు చేసే ఆలోచన ఉందా?
– నా సినిమాల్లో వాణిజ్యపరమైన అంశాలు ఉంటునే నా శైలి విభిన్నతను చూపించాలని నేను అనుకుంటాను. పాటలు, పోరాట సన్నివేశాలు ఉన్నప్పుడు అది కమర్షియల్‌ మూవీయే. ఇటీవల తమిళంలో వచ్చిన ‘అసురన్‌’ చిత్రంలో కూడా పాటలు ఉన్నాయి. అయితే అసురన్‌ చిత్రాన్ని రియలస్టిక్‌గా తీశారు. అలా అని కమర్షియల్‌ సినిమాలే ముఖ్యం అని చెప్పడం లేదు. ఆర్ట్‌ సినిమాలు కూడా ముఖ్యమే.

ఒక సినిమాని తొందరగా పూర్తి చేయడం మీకు మాత్రమే ఎలా సాధ్యం అవుతోంది?
– నా కెరీర్‌ మొదట్లో నేను దాదాపు పదేళ్లు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సమయంలో సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా…ఒక సినిమా ఎందుకు ఫెయిల్‌ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను. ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటే సినిమాను పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసినప్పటికీని వెంటనే షూటింగ్‌ పూర్తి చేయవచ్చు. ‘రూలర్‌’ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి ‘స్నేహాంకోసం’ సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఈ సినిమా తెరకెక్కించేప్పుడే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమా డైలాగ్స్‌ రాసు కున్నాను. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో కాంఫ్లెక్స్‌ ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్‌ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి.

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌గారితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు కదా! ఎలా అనిపిస్తుంది?
– రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారితో నేను చాలా సినిమాలు చేశాను. ఏనాడు నాఅంతట నేను సినిమా చేద్దామని వెళ్లలేదు. నాకు వచ్చిన అవకాశాలను ఎంచుకున్నాను. రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు రాజకీయాల్లోకి వస్తున్నారు. వారే కాదు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.

రజిని గారితో మరో సినిమా ఉంటుందా?
– రజనీగారితో మరో సినిమా అంటే…ఆయన ప్రస్తుతం డైరెక్టర్‌ శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరో సినిమా చేస్తారు. నెక్ట్స్‌రాజకీయాల్లో బిజీ అవుతారట. ఆయన నెక్ట్స్‌ మూవీకి నేను దర్శకుడినా? కాదో ఇప్పుడే నాకు తెలియదు.

విక్రమసింహా ప్రీక్వెల్‌ ఉంటుందా?
– రజనీకాంత్‌గారి ‘కొచ్చాడియన్‌’ (తెలుగులో ‘విక్రమసింహా’) సినిమాకు ప్రీక్వెల్‌కు ఐడియా ఉంది. కానీ దాదాపు200కోట్ల బడ్జెట్‌ అవుతుంది. ‘కొచ్చాడియన్‌’ సినిమాకు నేనే రైటర్‌ని. యానీమేషన్‌ గురించి నాకు అంతగా తెలియదు అందుకే ‘కొచ్చాడియన్‌’ సినిమాకు దర్శకత్వం వహించలేదు. అలాగే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమాను రెండు ఇంట్రవెల్స్‌లో రిలీజ్‌ చేయాలని అప్పట్లో అనుకున్నాం. అంత ఫుటేజ్‌ ఉంది. ఆ తర్వాత కమల్ సర్ సలహా మేరకు మాములుగానే విడుదలచేశాం.

కేవలం దర్శకత్వమే కాకుండా నటనలో కూడా మీకు మంచి పేరుంది కదా! తెలుగులో నటించే అవకాశం ఉందా?
–ౖ డెరెక్టర్స్‌కు యాక్టింగ్‌ ఈజీగా వస్తుంది. ఓ సినిమాను తెరకెక్కించేప్పుడు ఫలానా సన్నివేశం గురించి నటులకు వివరించేప్పుడు ఆ సన్నివేశంలో హీరో బాడీలాంగ్వేజ్‌ని బట్టి యాక్ట్‌ చేసి చూపిస్తారు. అలా వారికి యాక్టింగ్‌ సులభంగానే వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలోఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు. నేను డైరెక్ట్‌ చేయబోయే సినిమాల గురించి త్వరలోనే వెల్లడిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here