‘రూలర్’ బాలయ్య అభిమానులకు,సినీ ప్రేమికులకు పెద్ద పండుగ లాంటి సినిమా – సూపర్ హిట్ చిత్రాల నిర్మాత సి. కల్యాణ్.

0
1202

అతి తక్కువ టైమ్‌లోనే ప్రముఖ హీరోలతో ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నిర్మాతగా వెలగడమే కాకుండా దక్షిణాది చలనచిత్రరంగాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చి వంద సంవత్సరాల సినీ వేడుకను కనుల పండుగా చేసిన ఘనత సి. కళ్యాణ్‌కే దక్కుతుంది. చిత్రప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన పలు కీలక పదవులు నిర్వర్తించి అందరి మన్ననలను పొంది ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న105వ చిత్రం `రూల‌ర్` కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 13న తన 60వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ బర్త్‌డే ప్రత్యేకత ఏమిటి?
– ప్రత్యేకత అంటూ ఏమీలేదు. సాధారణంగా నాకు బర్త్‌డేలు జరుపుకోవడం, హడావిడి చేయడం ఇష్టం వుండదు. నా ఫ్రెండ్స్‌ అందరూ ఈ విషయాన్ని అడిగినా పదిమందికి ఉపయోగపడే పనులు ఆరోజు ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వుంటుంది తప్ప మరొకటి కాదు.  ఇది నా 60 వ పుట్టినరోజు. అందుకనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

మీరు నిర్మాత అవ్వాలనే ఉద్దేశ్యం తోనే ఇండస్ట్రీ కి రావడం జరిగిందా?
– లేదు. నేను దర్శకుడిని కావాలని ఈ రంగానికి రావడం జరిగింది. ఆ  విభాగంలో మెలకువలు నేర్చుకున్నాను కానీ అనుకోకుండా నిర్మాతగా మారాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పరిశ్రమ, నెల్లూరులోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు సి. కల్యాణ్‌ అనే ట్యాగ్‌ సంపాదించి ఇచ్చింది ఇండస్ట్రీయే. దర్శకులకు దాసరి నారాయణరావుగారు ఎలా ఉంటారో నిర్మాతలకు డి. రామానాయుడుగారు స్ఫూర్తి. ఈ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ పలకరించాయి. ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ వెనుకంజ వేయలేదు. సినిమా అనేది తిండి, నిద్రలా అతి ముఖ్యమైన అవసరంలా మారిపోయింది. అందుకే అలా ఉండిపోయాను. నా సామర్థ్యాన్ని చూసి పదవులు ఇచ్చారు. వాటికి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఏ పదవైనా ఒక్కసారి మాత్రమే స్వీకరించాను. అది నాకు నేనుగా పెట్టుకున్న నియమం. అయితే 2020 లో నా దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది.

20 ఏళ్ళ కిందటి ఇండస్ట్రీ పరిస్థితి, ఇప్పటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ?
– ప్రస్తుతం ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకపోవడం బాధాకరం. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలి. దాసరి నారాయణగారి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలనే విషయం పై ఈ మధ్యనే చిరంజీవి గారిని కలిసి మాట్లాడాను. ఆయనే సమర్థుడు. ఎందుకంటే ఆయన కిందనుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఆయన మాటంటే అందరికీ గౌరవం.  ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటి పరిస్థితులు మరోలా ఉన్నాయి. చిన్న సినిమాలే పరిశ్రమకు ఆధారం. కొత్త నిర్మాతలు లేకపోతే… ఈ పరిశ్రమ ఎప్పుడో మూతపడేది. ఏమైనా చిన్న సినిమా థియేటర్స్  సమస్యలను పరిష్కరించలేకపోతున్నాము.

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు అని ఎన్నో సంవత్సరాల నుండి వినిపిస్తోంది. ఆ సమస్య తీరే అవకాశం ఉందా?
– ఈ శుక్రవారం ఆరు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. మరి ఆ చిన్న సినిమాలు కూడా లేకపోతే థియేటర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి ? ఆ థియేటర్స్ ని నమ్ముకున్న ఎంతోమంది కార్మికుల పరిస్థితి ఏమిటి ? అసలు సినిమా ఇండస్ట్రీకి డబ్బు ఎక్కడి నుండి వస్తోంది. పెద్ద సినిమాలు సంవత్సరానికి వచ్చేవి, ఆడేవి చాల తక్కువ. కొత్త నిర్మాతలు, చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీనే లేదు. అలా కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కి రాకూడదు అంటే నేను వచ్చి ఉండేవాడిని కాదు కదా..

 తెలుగు సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ విషయంలో వెనుకబడడానికి కారణం?
– నిజం చెప్పాలంటే మా తరపున వీలైన సాయం చేస్తున్నాం. కానీ కొన్ని సినిమాలు అక్కడ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. మనకు హోలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ లేకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే అంతర్జాతీయ అవార్డ్స్ పొందిన సినిమాలకు ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేసిన సినిమాలే. మనకంటే పెద్ద నేషన్ అయిన చైనా సినిమాలు సైతం అంతర్జాతీయ వేదికలపై కనిపించడం లేదు. కొరియా, అమెరికా చిత్రాలు ముఖ్యంగా అర్హత పొందుతున్నాయి. అక్కడ కొందరు ప్రత్యేకంగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.
 
మనం ఎందుకు ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాం?
– మనలో మనకు ఐక్యత లేకపోవడం, ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకునే తత్త్వం లేకపోవడం కారణం. ఒక హీరోకి నంది అవార్డు వచ్చిందని తెలిసినటప్పుడు ఆ హీరో మినహా మిగతా హీరోలెవరు ఆ కార్యక్రమానికి హాజరుకారు. అలాంటి పరిస్థితులు మారాలి, అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది.

మీ నిర్మాణంలో వస్తోన్న రూలర్ గురించి చెప్పండి ?
– ‘రూలర్’ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవబోతుంది. బాలయ్య అభిమానులకు, సినీ ప్రేమికులకు ఒక పెద్ద పండుగ లాంటి సినిమా ‘రూలర్’. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ ఉండదు. ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన తెలుగువాళ్ల కథ. సెటిలర్స్‌ సమస్యల్ని నేపథ్యంగా తీసుకుని అల్లుకున్న కథ ఇది.  అద్భుతమైన కథాంశం ఉన్న సినిమా రేపు థియేటర్స్ లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది.

బాలకృష్ణ, వివి వినాయక్ గారితో సినిమా ?
–  వినాయక్ గారు చెన్నకేశవ రెడ్డి కంటే పవర్ఫుల్ సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలో కె ఎస్ రవికుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని ముందు తెరకెక్కించాం. మరో మంచి కథతో వి వి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నా నిర్మాణంలో సినిమా తప్పకుండా ఉంటుంది.

ప్రస్తుతం సమాజంలో జరిగే అవాంఛనీయ సంఘటనలకు సినిమా కూడా ఒక కారణం అంటున్నారు?
– దానిని నేను అసలు అంగీకరించను. ఒక చెడ్డ సినిమా చూసి చెడిపోయినోడికి, ఒక మంచి సినిమా చూపించినంత మాత్రాన బుద్ధిమంతుడిలా మారిపోతాడా? సినిమాలో కంటే బయట ఆడపిల్లల వస్త్ర ధారణ దారుణంగా ఉంటుంది. మొబైల్ లో యువత ఏమి చూస్తున్నారో, ఏమి చేస్తున్నారో తెలియదా?. కాకపోతే సినిమా అనేది తొందరగా జనంలోకి వెళ్లే మీడియం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తే మంచిది అని నా అభిప్రాయం. తల్లిదండ్రులు పిల్లల చర్యల పై దృష్టి పెట్టాలి. సంపాదన, ఉద్యోగమే కాకుండా పిల్లలు ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది, వారు ఎటువైపు వెళ్తున్నారు గమనించి అదుపులో పెట్టాలి. అప్పుడు కొంత వరకూ మెరుగైన సమాజం ఏర్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here