`ఆవిరి` హార‌ర్ చిత్రం కాదు.. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ : ర‌విబాబు

0
1362

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం న‌వంబర్ 1న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ఇంట‌ర్వ్యూ విశేషాలు..

– మా కెరీర్ ప్రారంభం నుండి నేను, దిల్‌రాజుగారు మంచి స్నేహితులం. ఇద్ద‌రం రెగ్యుల‌ర్‌గా క‌లుస్తుండేవాళ్లం. ఇద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేయాల‌ని చాలాసార్లు అనుకున్న‌ప్ప‌టికీ నేను నా సినిమాల‌తో బిజీగా ఉండేవాడిని, ఆయ‌నేమో ఆయ‌న క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండేవారు.

– నేను చూసిన తెలుగు సినిమాల్లో నాకు న‌చ్చిన చిత్రం దిల్‌రాజుగారు నిర్మించిన `బొమ్మ‌రిల్లు`. అంద‌రికీ ఆయ‌న దిల్‌రాజుగారు కావొచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం బొమ్మ‌రిల్లు రాజుగారే.

– నేను ఆయ‌న్ని క‌లిసినప్పుడ‌ల్లా మీకు బొమ్మ‌రిల్లు కంటే మంచి సినిమా చేసి పెడ‌తాను అంటుండేవాడిని. `ఆవిరి సినిమా అనుకోకుండా క‌లిశాం. సినిమా ముందు ఆయ‌న క‌థ చెప్పాను. సినిమా పూర్త‌యిన త‌ర్వాతే క‌లుద్దామ‌ని చెప్పాను. అన్న‌ట్లుగానే సినిమా పూర్త‌యిన త‌ర్వాత దిల్‌రాజుగారిని క‌లిశాను. సినిమా చూసి ఆయ‌న బావుంద‌ని అన్నాడు.

– మేకింగ్ విష‌యంలో తొలి కాపీ సిద్ధ‌మ‌య్యే వర‌కు నేను బాధ్య‌త వ‌హిస్తాను. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో నిర్మాత‌లు ఎలా చెబితే అలా ఫాలో అయిపోతుంటాను. ఈ సినిమా విష‌యంలోనూ అంతే.

– `ఆవిరి` సినిమా హార‌ర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌. నేను ఇంత‌కు ముందు తీసిన సినిమాల‌న్నీ కూడా థ్రిల్ల‌ర్ సినిమాలే. క‌థ‌ను చెప్ప‌డంపైనే నేను ఫోక‌స్ పెడ‌తాను. ప్రేక్ష‌కుల‌ను ఏదో భ‌య‌పెట్టాల‌ని ఆలోచించ‌ను. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడితేనే ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతార‌ని ఎప్పుడూ అనుకోలేదు.

– `అదుగో` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి నాకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఆ స‌మ‌యంలో ఎలాంటి సినిమా చేయాల‌ని బాగా ఆలోచించేవాడిని. ఆ స‌మ‌యంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి ఇంట్లో దెయ్యం ఉంద‌నే క‌థ‌నాన్ని పేప‌ర్‌లో చూశాను. ఆస్టోరీ చ‌దివిన త‌ర్వాత నాకొక ఆలోచన వ‌చ్చింది. ఇదొక ఫిక్ష‌న‌ల్ స్టోరీ.

– `అదుగో` చిన్న సినిమానే 80 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో అంత వ‌ర్క్ ఉంటుంద‌ని నేనెప్పుడూ అనుకోలేదు. పందిపిల్ల‌తో యానిమేష‌న్ వ‌ర్క్ సినిమాలో ముప్పావు గంట ఉంటుంది. ఇండియాలో అప్ప‌టి వ‌ర‌కు త్రీడీ యానిమేష‌న్‌ను ఎవ‌రూ చేయ‌లేదు.

– సాధార‌ణంగా ఓ ద‌ర్శ‌క నిర్మాత‌గా నేను తీసిన సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కావాలి. అలాగే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకోవాలి. సాధార‌ణంగా సినిమా బాగోలేనప్పుడు దాని మెయిన్ పాయింట్ బాగోలేద‌నే విష‌యం నాకు తెలుసు. ఏదైనా ఐడియా బావుండాలి. అంతే కానీ ఫార్మేట్‌ను నేను పెద్ద‌గా న‌మ్మ‌ను. సినిమా స‌రిగ్గా ఆద‌ర‌ణ పొంద‌క‌పోతే నేను చాలా బాధ‌ప‌డ‌తాను.

– ఈ సినిమాలో పాప తండ్రి పాత్ర‌ను ఎవ‌రితో చేయించాల‌నే దానిపై నేను, స‌త్యానంద్‌గారు పెద్ద డిస్క‌ష‌న్ చేసుకున్నాం. ఆ క్ర‌మంలో నువ్వే చెయ్యి అని స‌త్యానంద్‌గారు అన్నారు. నేను డైరెక్ష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ చేస్తూ సినిమా చేయ‌డ‌మ‌నేది క‌ష్ట‌మ‌వుతుందేమోనని అనుకున్నాను. అయితే ఇది వ‌ర‌కు నువ్వు డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేశావ్ క‌దా! మీ వెనుక మేమున్నాం అంటూ స‌త్యానంద్‌గారు చెప్ప‌డంతో యాక్ట్ చేయాల‌నుకున్నాను.

– అదుగో సినిమాలో ఫుల్ బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఏ సినిమాలోనూ యాక్ట్ చేయ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ యాక్ట్ చేయాల‌నుకుంటున్నాను.

– ప్ర‌స్తుతం ఐదారు క‌థ‌లు నా మైండ్‌లో ఉన్నాయి. వాటిలో ఓ ముస‌లాయ‌న‌కు సంబంధించిన ఓ క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించాల‌నుకుంటున్నాను. ఈ సినిమాను యు.ఎస్‌లో చిత్రీక‌రించాలి. దాదాపు ఆ సినిమానే చేస్తాను. ఒక‌వేళ నాగేశ్వ‌ర‌రావుగారు బ్ర‌తికి ఉండుంటే ఆయ‌న్ని వెళ్లి న‌టించ‌మ‌ని రిక్వెస్ట్ చేసేవాళ్లం. ఇప్పుడు ఆ ముస‌లాయ‌న క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రితో చేయించాల‌నే దాన్ని ఆలోచిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here