మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రం 150వ జయంతిగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ లెవల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ హిస్టారికల్ హిట్ గా నిలిచి విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ లో…
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలి. నా కెరీర్‌కి అది బెస్ట్ పాత్ర కావాలి. అలాంటి అవకాశం ఎప్పుడొస్తుంది. వస్తే బావుంటుంది కదా! అని అనుకుంటుండే వాడిని. నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? అంటే స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర చేస్తే బావుంటుందని ఇది వరకు ఎన్నోసార్లు చెప్పాను. ఉదాహరణకు భగత్ సింగ్ పాత్ర చేయాలని ఇరవైఏళ్ల క్రితమే చెప్పాను. 12 ఏళ్ల క్రితం అలాంటి అవకాశం ఉన్న కథతో పరుచూరి బ్రదర్స్ నాకు చెప్పారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కానీ ఆ సబ్జెక్ట్ భారీగా తెరకెక్కాలి. కాంప్రమైజ్ అయితే కథకు న్యాయం చేయలేం కాబట్టి ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికి కుదిరింది.. గత రెండున్నరేళ్లుగా మేం అందరం కష్టపడి చేసిన ప్రయత్నం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డిని అనుకున్న తర్వాత ఆయన భూపతిరాజా, కన్నన్ తదితరులను కలిసి కొన్నిరోజుల తర్వాత అద్భుతమైన ట్రీట్‌మెంట్‌తో వచ్చాడు. మా దగ్గర కథ, సీన్స్ ఉన్నాయి. కానీ డ్రెమటిక్ తీసుకు రావడానికి మేం పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. అలాంటి అద్భుతమైన ట్రీట్‌మెంట్ చేసిన రోజున ఇది మన కథేనా? అని ఆశ్చర్యపోయాను. అంతలా కథనాన్ని తీర్చిదిద్దిన సురేందర్‌రెడ్డి టీమ్‌ను అభినందిస్తున్నాను. ఈ అవకాశం మేమిచ్చాం అని అందరూ అనుకుంటారు. కానీ కరెక్ట్ అయిన డైరెక్టర్ చేతిలో సినిమా పెడితే ఆయన దీన్ని ఓ ఎపిక్‌లా తీసినందుకు ఆయనకు థ్యాంక్స్. ప్రతిసీన్‌ను ముందుండి చూసుకుంటూ వస్తున్న సత్యానంద్‌గారు, స్క్రిప్ట్ డాక్టర్‌లా వ్యవహరించారు. ఆయన సలహాలు మాకెంతో ఉపయోగపడ్డాయి. నా ఖైదీ నంబర్ 150లో నన్ను అందంగా చూపించాడు. చిరంజీవి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడనేంత గ్లామర్‌గా నన్ను తెరపై చూపించాడు. అదేవిధంగా ఈసినిమాకు, చిరంజీవి అని కాకుండా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నేను కనపడేలా అప్పటి పరిస్థితులకు తగిన విధంగా సినిమాను ఆవిష్కరించారు రత్నవేలు. రెండున్నరేళ్లు ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజీవన్‌గారు ప్రొడక్షన్ డిజైనర్‌గా మా సినిమాకు తగినట్లు ఎఫెక్ట్ పెట్టారు. సినిమాకు కీలకంగా మారిన వి.ఎఫ్.ఎక్స్ విషయానికి వస్తే 3800 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను చక్కగా ఆవిష్కరించారు కమల్ కణ్ణన్‌గారు. సాయిమాధవ్ బుర్రాగారు అద్భుతమైన డైలాగ్స్ అందించారు. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే.. కీలక పాత్ర కోసం అమితాబ్‌గారు కావాలని నన్ను అడిగినప్పుడు మా మధ్య మంచి అనుబంధం ఉన్నా సరే! ఆయన చేస్తారా? చేయరా అని అనుకున్నాం. నేను ఫోన్ చేయగానే .. నేను ఆ పాత్ర చేస్తే బావుంటుందా? అని అడిగారు. మీరు చేస్తే బావుంటుదని నేను చెప్పగానే సరే చేస్తానన్నారు. నేను నా స్నేహితుడి కోసం చేస్తున్నాను నాకు ఆ తృప్తి నివ్వండి చాలు అన్ని ఆయన చెప్పి..నేను మీకు ఎలాంటి భారం ఇవ్వాలనుకోవడం లేదు. ఆయన తన ప్రైవేట్ జెట్‌లో తన టీమ్‌తో వచ్చేవారు. మీరు మా అతిథి అంటే కూడా ఆయన వినలేదు. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన మహానుభావుడు. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. కన్నడ నుండి సుదీప్‌ను అడిగాం.. అలాగే తమిళం నుండి విజయ్ సేతుపతిని అడిగాం. అలాగే జగపతిబాబుగారు కీలకపాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. తమన్నా, నయనతార, అనుష్క, సాయిచంద్‌గారు ముందుకు వచ్చారు. పాత్ర నిడివి ఎంతని కాకుండా.. ప్రాముఖ్యతను బట్టి నటించారు. గొప్ప డేడికేషన్ ఉన్న నటుడు. గొప్ప నమ్మకంతో, ప్రేమించి సినిమా చేశాడు. జగపతిబాబుగారు ఎప్పుడొస్తారు? ఎప్పుడెలాతారో తెలియదు. చాలా డిసిప్లెయిన్ ఆర్టిస్ట్. ఆయన సినిమాకు ఎంత హెల్ప్ అయ్యారంటే.. సినిమా చూస్తే అర్థమవుతుంది. సుదీప్ తనదైన నటనతో అవుకురాజు క్యారెక్టర్‌ను ఎక్కడితో తీసుకెళ్లాడు. విజయ్‌సేతుపతి ఎంతో బిజీ ఆర్టిస్ట్ అయినా.. ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసి నటించాడు. సిద్ధమ్మగా నయనతార, లక్ష్మి పాత్రలో తమన్నా ఒదిగిపోయారు. నా క్యారెక్టర్‌ను పక్కన పెడితే.. తమన్నా క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి గొప్ప వ్యక్తి, యోధుడు కథ తెరమరగైంది. దీన్ని అందరి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగు సినిమాలాగానే కాకుండా ప్రపంచంలోని భారతీయులు నరసింహారెడ్డి గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది. అలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నాం. ముంబై మీడియాలో సినిమాను చూసి సౌత్‌లో ఇంత గొప్ప యోధుడు ఉన్నాడా? అని అనుకున్నారు. సినిమా అనంతరం స్టాండిగ్ ఓవెషన్ ఇచ్చారు. నేను ఎంతో గర్వంగా ఫీలయ్యాను. ఇది సౌత్, నార్త్ సినిమా అనే బేదాలు పోయి.. ఇండియన్ సినిమా అని ముద్ర వేసుకుంది. చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు అని అంటుంటే .. చాలనిపించింది. నా బిడ్డ ఈ సినిమాను నిర్మించినందుకు ఇంతకంటే ఏం కావాలనిపించింది. సుస్మిత ఒక మామూలు టెక్నిషియన్‌లా పనిచేసింది. తనని చూసి సంతోషపడ్డాను. తనతో పాటు పనిచేసిన అంజి మౌళి పనిచేశారు. ఉత్తరమీనన్‌కి థ్యాంక్స్. సురేందర్ రెడ్డి ఎంత టెన్షన్ పడ్డాడో కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. సురేందర్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి దొరికి మరో అద్భుతం. ఇలాంటి సినిమాను మాకు ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా చూసిన వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, మోహన్‌బాబుగారు, నాని, రాజమౌళి , త్రివిక్రమ్, కొరటాల శివ సహా డైరెక్టర్స్ అందరూ అభినందించారు. అందికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాను ఆదరించి.. అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు“ అన్నారు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ – “ మూడేళ్ల కష్టం. సినిమా అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కలిగింది. పడ్డ కష్టమంతా నాకు కనపడలేదు. నిజంగా గొప్ప స్క్రిప్ట్‌ను నా చేతిలో పెట్టినప్పుడు .. వెర్షన్స్ చేసుకుని చిరంజీవిగారికి చెప్పి ఓకే అనుకున్న తర్వాత స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని నేను నిద్రలేని రాత్రులు ఎన్నింటినో గడిపాను. ఇన్ని వందల కోట్లు పెట్టి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం. ఇలాటి హిస్టారికల్ మూవీస్ ఎన్ని ఆడాయి.. కొన్నే ఉన్నాయనే భయం ఉండేది. మెగాస్టార్‌లాంటి హీరోనిచ్చారు. ఈ స్క్రిప్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. చిరంజీవిగారిని పెట్టుకుని పాట లేదు. చిరంజీవిగారిని కథలో చంపేస్తున్నాం… మరి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది? అని భయపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. అందులో నాకు కనపడింది ఒకటే దేశభక్తి. దాన్నే నమ్మాను. చిరంజీవిగారు కూడా అదే నమ్మి నన్ను భుజం తట్టి ముందుకెళ్లమన్నారు. ఆ బాటలొ వెళ్లిపోయాను. ఎలా తీశానో తెలియదు. తీసేశాను. కొన్ని అంశాలు లేకుండా బ్లాక్ బస్టర్ తీయడమంటే కష్టం. మెగాభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నాను. అయితే వారు చాలా గొప్పగా సినిమాను రిసీవ్ చేసుకున్నారు. వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాతో పాటు మూడేళ్లు చాలా కష్టపడ్డారు. రాజీవన్ నా విజన్‌ను ఆవిష్కరిస్తే, రత్నవేలుగారు నా కలను అలాగే తెరపైకి తీసుకొచ్చారు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ.. ఎంతో కష్టపడ్డారు. అందరూ రక్తం ధారపోసి పనిచేశారు. అందరికీ కృతజ్ఞతలు. తన నాన్నగారి కోసం ఓ గొప్ప సినిమా తీయాలనేది రామ్‌చరణ్‌గారి కల. అలాగే చిరంజీవిగారి డ్రీమ్‌ను కూడా ఆయన తీర్చేశారు. చిరంజీవిగారి డ్రీమ్‌ను తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ డ్రీమ్‌ను నేను పూర్తి చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా గర్వంగా ఉంది. చిరంజీవిగారికి, చరణ్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. 500 కుటుంబాలు ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాయి. కాబట్టి ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి“ అన్నారు.
నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ – “ సినిమా గురించి చెప్పాలంటే ఎప్పుడు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. పరుచూరి బ్రదర్స్ గారు కథను తీసుకొచ్చిన పదేళ్ల క్రితం మొదలు పెట్టలా? లేక మూడేళ్ల ముందు నుండి మొదలు పెట్టాలా? అని అర్థం కావడం లేదు. పరుచూరి బ్రదర్స్‌గారి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. సాయిమాధవ్ బుర్రాగారికి థ్యాంక్స్. కమల్ కణ్ణన్‌గారితో మగధీర సమయంలో పనిచేశాను. ఇప్పుడు మళ్లీ పనిచేశాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన వి.ఎఫ్.ఎక్స్ చేశారు. రత్నవేలుగారితో ఖైదీ నంబర్ 150, రంగస్థలం సినిమా నుండి ట్రావెల్ ఉంది. ప్రతి సీన్‌ను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. అలాగే రాజీవన్‌గారితో ధృవ సినిమాకు పనిచేశాను. ఈ సినిమా కోసం 40 సెట్స్ వేశారు. ఆయన కష్టానికి థ్యాంక్స్. జగపతిబాబుగారి లాంటి మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ ఈసినిమాలో భాగమైనందుకు ఆయనకు థ్యాంక్స్. నయనతారగారికి, తమన్నాకి థ్యాంక్స్. ఇంత మంచి రిలీజ్ ఇచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్. డైరెక్టర్ సురేందర్‌గారితో పనిచేయడం హ్యాపీ. ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ సక్సెస్‌ను మేం ఊహించలేదు. కలలో కూడా ఊహించలేదు. ఓ నెలన్నర సమయంగా నేను రాత్రి మూడున్నర గంటల సమయంలో ఉలిక్కిపడి నిద్రలేచేవాడిని. రాజమౌళిగారు కానీ, తారక్ కానీ ఏంటబ్బాయి స్ట్రెస్‌లో ఉన్నావని అంటే.. ఉన్నానో, ఉండి ఉండొచ్చో ఏమో నాకు తెలియలేదు.ఓ టెన్షన్ ఉండేది. అయితే ఉయ్యాలవాడగారి ఆత్మ మమ్మల్ని అందరినీ కలిపింది. నాన్నగారితో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం కలిగించింది. చాలా క్రమశిక్షణతో చేశాం. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాన్నగారికి థ్యాంక్స్. కమర్షియల్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డిగారు పక్కన పెట్టి ఈ సినిమా చేస్తే.. నాన్నగారు తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ సినిమా చేశారు. భారతీయ సినిమాల్లో గర్వపడే చిత్రమిది. సపోర్ట్ అందించిన అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ” 15 సంవత్సరాల పరుచూరి బ్రదర్స్ కల. 12 సంవత్సరాల చిరంజీవి గారి కల. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి గారి 3 సంవత్సరాల కల. అలాగే రెండు సంవత్సరాలుగా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజై తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సైరా నరసింహా రెడ్డి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 85 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది ఒక అమేజింగ్ ఫిగర్. చిరంజీవి గారి 151 వ చిత్రం. వన్ ఆఫ్ బెస్ట్ మూవీ. ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పుడే చెప్పలేము. సురేందర్ నాకు చాలా క్లోజ్. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని ఎలా హేండిల్ చేస్తారు అనిపించేది. ఒక ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి గారి చూడని సక్సెస్ లేదు ఆయన చూడని డబ్బు కాదు. కానీ చిరంజీవి గారి డ్రీమ్ ని బడ్జెట్ ఆలోచించకుండా అచీవ్ చేయడానికి, ప్యాన్ ఇండియా మూవీగా చేయాలనీ చేసిన ప్రయత్నం. ఏది అడిగినా నో అనే పదం లేకుండా ఇచ్చారు. ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చినందుకు టీం అందరికీ థాంక్స్ “అన్నారు.
సత్యానంద్ మాట్లాడుతూ – “వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అప్పియర్స్’ అని ఒక జెన్ సామెత ఉంది. అలాగే ఒక పాత్రకు అన్ని సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పాత్ర వస్తుంది, ఆ సినిమా వస్తుంది. అలా అన్ని కరెక్ట్ గా కలిస్తే తప్ప అద్భుతం అవదు. ఇప్పుడు అన్ని కరెక్ట్ గా కలిసే టైం వచ్చి ఆ అద్భుతం కూడా వచ్చింది. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. కానీ ఎప్పుడు ఒక లోటు ఉండేది. కృష్ణ గారికి సీతారామరాజు, శివాజీ గణేషన్ కి వీర పాండ్య కట్ట బ్రాహ్మణ లాగ ఒక దేశ భక్తికి సంభందించి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనుకునే వారు. ఇంత కాలానికి ఆయన కల నిజమైనందుకు హ్యాపీ గా ఉంది” అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ” మాకు చిరంజీవి గారికి కిందటి జన్మలో ఎదో ఒక అనుభందం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక రోజులో కథ రాయక పొతే డేట్స్ వెళ్లిపోతాయి అని ఒక ప్రొడ్యూసర్ అంటే మూడు గంటల్లో కథ రాశాం. ఒక కథకుడు మూడు గంటల్లో కథ రాశాడు అంటే ఆ హీరో అదృష్టం. అలా ఖైదీ కథ రాశా. ఆ తరువాత చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాం. ఘరాన మొగుడు, గ్యాంగ్ లీడర్, దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, అన్ని దొంగ పేరుతో వస్తున్నాయి అంటే ఇంద్ర లాంటి పవర్ఫుల్ కథ, బావగారు బాగున్నారా లాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేశాం. ఇన్ని సినిమాల తర్వాత నాకు ఒకే ఒక్క కోరిక ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలి అని. అలా రామ్ చరణ్ ని ఒప్ప్పించి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ చెప్పాము. చిరంజీవి గారు కూడా ఓకే అనడం తో ఆయనతోనే ఈ సినిమా చేశాం. ఒక చారిత్రాత్మక సినిమా అనగానే ఒక ప్రాంతానికి సంభందించిన కథ అనుకుంటారు కానీ ఒక భారతీయుడు దేశ భక్తితో ఫస్ట్ టైం బ్రిటిష్ వారిని ఎదిరించాడు అని అందరికీ తెలియాలంటే ఈ సినిమా తీయాలి. అలా ఈ సినిమా తీశాం కనుకనే 1847 లో చిరంజీవి గారే నరసింహా రెడ్డిగా మొదటి స్వాతంత్ర్య సమరం చేశారేమో అన్నట్లుగా ఈ సినిమాలో నటించారు. అందుకనే అమెరికాలో కూడా ఈ సినిమాకు నీరాజనం పడుతున్నారు. చరిత్ర నిలిచి పోయే వరకూ ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా తీసినందుకు చిరంజీవి గారు చరితార్థులు. అలాగే సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టారు. ఇంతమంది గొప్ప వారు కలిసి ఈ సినిమా తీశారు కనుకనే సైరా ఇంత గొప్ప సినిమా అయింది” అన్నారు.
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ – “నన్నయ్య గారు అంటారు ఆ అనే అక్షరం కనిపెట్టక పొతే అమ్మ అన్న పదం మనకు ఉండేది కాదు అని. ఆలా పరుచూరి వెంకటేశ్వరరావు గారు 2004 లో శ్రీ అని ఈ కథకు శ్రీకారం చుట్టకపోతే ఇవ్వాళ మనందరికీ ఈ ఆనందం ఉండేది కాదు. ఈ కథ ను 2006 చిరంజీవి గారికి చెప్పారు. ఆయన వెంట దుబాయ్ వెళ్ళాడు, బ్యాంకాక్ వెళ్లి అక్కడ కొన్ని సీన్లు మార్చుకొచ్చాడు. ఆయనతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసినప్పటికీ చిరంజీవి గారికి కలకాలం చరిత్రలో నిలిచి పోయే పాత్రని మనం సృష్టించలేమా అని అనేవాడు. అదే ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డి పాత్ర. కానీ చాలా బడ్జెట్ తో కూడుకున్న సినిమా అందుకే రూపాయిని పైసాలా ఖర్చుపెట్టారు రామ్ చరణ్. అందుకే మనందరం ఇంత గర్వంగా ఇక్కడ కూర్చోగలిగాము. మాకు స్వాతంత్య్రం కావాలి మీరు నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోండి అని మొదట పలికిన గొంతు తెలుగు వాడిది అని ప్రపంచానికి చెప్పాలనే ఆయన తపన. చిరంజీవి గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. సైరా మీ బిడ్డ. దాన్ని నా బిడ్డ చేతులో పెట్టావ్.. ఆ బిడ్డ తీసిన ఈ సైరా ని ఇవ్వాళ ప్రపంచం అంత చిరంజీవ అని ఆశీర్వదిస్తుంది ధన్యవాదాలు సోదర అని’ అన్నారు.
నటుడు జగపతి బాబు మాట్లాడుతూ – ” నాన్నకు ప్రేమతో అంటే మా చరణ్. ఖర్చుకు వెనకాడకుండా మా నాన్న కి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని తీసిన సినిమా ‘సైరా’. దానికి రిటర్న్ గిఫ్ట్ గా అన్ని భాషలలో ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం. చిరంజీవి గారు చాలా కష్టపడి గొప్పగా చేశారు. అందుకే ఫ్యాన్ ఇండియా వైడ్ గా ఆయనకు అంత అద్భుతమైన పేరు వచ్చింది. సురేందర్ రెడ్డి గారు ప్రతి క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా వాడారు. నా క్యారెక్టర్ ఇంత పండుతుంది అని నేను అనుకోలేదు ‘అన్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ – “లక్ష్మి నా కెరీర్ బెస్ట్ రోల్. ఈ సినిమాకు ఇప్పటివరకూ నా కొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ లక్ష్మీ నరసింహారెడ్డి అని పిలవడం. ఒక యాక్టర్ కి ఇది బిగ్గెస్ట్ అచీవ్ మెంట్. మీ డ్రీం ప్రాజెక్ట్ లో నన్ను భాగం చేసినందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆయనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాను. నా లుక్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. దానికి కారణమైన సుస్మిత గారికి థాంక్స్. అలాగే నన్ను ఇంత బ్యూటిఫుల్ గాచూపించిన రత్నవేలు గారికి స్పెషల్ థాంక్స్. చరణ్ అమేజింగ్ ప్రొడ్యూసర్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ సాయిమాధవ్ బుర్రా, డి.ఓ.పి రత్నవేలు, కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, యూ వి క్రియేషన్స్ విక్కీ, కొణిదెల ప్రొడక్షన్స్ సిఇఓ విజయ, వి ఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాకాడ అప్పారావు, ప్రవీణ్, భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు.