గద్దలకొండ గణేష్ రివ్యూ

0
13227
Gaddalakonda Ganesh

ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’ లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకొని ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌ 2′ లాంటి సక్సెస్‌ ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా, షాక్‌’, ‘మిరపకాయ్‌’ ,’గబ్బర్‌సింగ్‌’, ‘డీజే’ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఈ చిత్రం వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్‌కు ఎలాంటి ఫలితం అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

క‌థ‌:

అభి(అథర్వ మురళి), సినిమా ప్రపంచంలో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలగాలని అవకాశాల కోసం తిరిగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్. తాను పనిచేస్తున్న డైరెక్టర్ తనని అవమానించడంతో ఒక్క ఏడాదిలో సినిమా తీస్తానని ఛాలెంజ్ చేసాడు. అప్పుడే  షూటింగ్  గ్యాప్ లో తాను తీసిన  షార్ట్ ఫిల్మ్ చూసి నిర్మాత రఘుబాబు సినిమా ఆఫర్ ఇస్తాడు. కానీ అభి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో సినిమా చేస్తానని చెప్పి ఓ రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్ జీవితాన్ని సినిమాగా తీయాలని  డిసైడ్ అయ్యి అలాంటి గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుతున్న టైములో  గద్దల కొండ గణేష్(వరుణ్ తేజ్) అనే భయంకరమైన గ్యాంగ్ స్టర్ గురించి తెలుసుకుంటాడు. కొన్ని విషయాలు బాగా నచ్చి తన కథే పూర్తిగా తీసుకొని తన మీదే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్ (సత్య)తో కలిసి గణేష్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఈ విషయం గద్దల కొండ గణేష్ కి తెలియడంతో మొదట చంపేయాలనుకున్నా, ఆ తర్వాత కన్విన్స్ అయ్యి తననే పెట్టి తన సినిమా తీయమంటాడు. ఇక అక్కడి నుంచి గద్దల కొండా గణేష్ తో అభి సినిమా తీయడానికి పడ్డ కష్టాలేంటి? అసలు అభికి గణేష్ లైఫ్ లో అంతగా ఆకట్టుకున్న అంశాలేంటి? అసలు గణేష్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు గ్యాంగ్ స్టర్ అయినా గణేష్ ని అభి ఎలా నటుడిగా మార్చాడు? మార్చిసినిమా తీసి సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే ‘గద్దల కొండ గణేష్’ కథ.

నటీనటుల పెర్ఫార్మన్స్

వాల్మీకి గా మొదలై గద్దల కొండ గణేష్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి వరుణ్ తేజ్ నటన బిగ్గెస్ట్ హైలైట్. సినిమా భాషలో చెప్పాలంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి  మంచి కథ కచ్చితంగా ఉండాలంటారు. అలాంటి ఒక మంచి కథే గద్దలకొండ గణేష్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన   కెరీర్లోనే మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు  అని చెప్పాలి. గ్యాంగ్ స్టర్ గా తన నటన, స్టైలిష్ మాస్ లుక్, డైలాగ్  డెలివరీ, మ్యానరిజమ్స్ అన్నీ కలిపి సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకూ ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని తుడిచేసి, 100% మాస్ హీరో ఇమేజ్ వరుణ్ తేజ్ కి ఈ సినిమాతో వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వరుణ్ తేజ్ కాకుండా  గద్దల కొండ గణేష్ పాత్ర ఇంకెవరూ చేయలేరు అనే రేంజ్ లో పాత్రలో జీవించాడు వరుణ్ తేజ్. ఇక ఫ్లాష్ బాక్ లో కనిపించే పూజ హెగ్డే 80-90ల లుక్ లో క్యూట్ గా, లవ్లీగా కనిపించి ఆకట్టుకుంది.  వరుణ్ తేజ్ – పూజ హెగ్డే  కెమిస్ట్రీ కూడా అదిరింది.  ముఖ్యంగా ఎల్లువొచ్చి గోదారమ్మా పాట‌లో పూజా శ్రీ‌దేవిని గుర్తు చేసింది. ఈ సినిమాకి సెకండ్ హీరో – హీరోయిన్ అయినా అథర్వ మురళి – మృణాలిని రవిల నటన మరియు ఫస్ట్ హాఫ్ లో వచ్చే వాళ్ళ లవ్ ట్రాక్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. యాక్టింగ్ టీచర్ గా బ్రహ్మాజీ రోల్ సెకండాఫ్ లో హైలైట్ అవుతుంది. తాను ఉన్నంత సేపు బాగా నవ్విస్తాడు. అలాగే కమెడియన్ సత్య కామెడీ కూడా ఫస్ట్ హాల్ఫ్ లో బాగా వర్కౌట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, రఘు బాబు, సుప్రియ పథక్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

హరీష్ శంకర్ అనుకున్న కథకి వరుణ్ తేజ్ ఎలా అయితే 200% న్యాయం చేసాడో అలానే  సినిమాటోగ్రాఫర్ అయనాంక బోస్ బ్యూటిఫుల్ విజువల్స్,  మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్  స్కోర్ పర్ఫెక్ట్ గా కుదిరింది. హరీష్ శంకర్ విజువల్ గా ఊహించన దానికంటే రెండు మూడు రెట్లు బెటర్ విజువల్స్ ఇచ్చాడు. ఏ ఫ్రేమ్ లో కూడా మనం కథ నుంచి పక్కకెళ్ళకుండా ఉండేలా విజువల్స్ చేసాడు. దీనికి మించి మిక్కీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. ఈ సినిమాలో కథా పరంగా ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. ప్రతి సీన్ లో ప్రతి షాట్ కి తగ్గట్టు మ్యూజిక్ చేయడం చాలా కష్టతరం. కానీ మనసు పెడితే సాధ్యమే అని మిక్కీ ప్రూవ్ చేసాడు. వరుణ్ లానే ఛాన్స్ ఇస్తే మాస్ మాసాలా సినిమాలకి అదిరిపోయేలా మ్యూజిక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. తన సెట్స్ ఆ విలేజ్ రౌడీయిజంని పర్ఫెక్ట్ గా చూపడానికి హెల్ప్ అయ్యింది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్  బాగుంది. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్, గౌరి నాయుడు కాస్ట్యూమ్ కథకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

ఇక సినిమాకి కెప్టెన్ అయినా హరీష్ శంకర్ విషయానికి వస్తే, రీమేక్ కథని అద్భుతంగా తీస్తాడని ఆల్రెడీ ‘గబ్బర్ సింగ్’ తో ప్రూవ్ చేసుకున్నాడు.  కథ పరంగా సింపుల్ కంటెంట్ కానీ స్క్రీన్ ప్లే పరంగా నడిచే సినిమా ఇది. ముఖ్యంగా కథకి కీలకమైన ఎమోషనల్ కంటెంట్ అనుకున్న స్థాయిలో వర్కౌట్  అయ్యింది. ముఖ్యంగా ఒరిజినల్ కథలో లేకుండా ఇక్కడ యాడ్ చేసిన వరుణ్ – పూజ ప్రేమ కథలో ఎమోషనల్ కంటెంట్ కి మంచి అప్లాజ్  వస్తోంది.  హరీష్ ఎప్పటిలానే తన హీరోయిజం ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ విషయంలో సూపర్బ్ అనిపించుకొని మరోసారి పవర్ ఫుల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. 14రీల్స్ ప్లస్ బేనర్ కి ఇది మొదటి సినిమా అయినా ప్రొడక్షన్ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా తీశారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట. వారు ఖర్చు  పెట్టిన ప్రతి రూపాయి తెరపై చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.

వరుణ్ తేజ్ పూర్తిగా మాస్ పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా మాస్ తో పాటు అన్ని వర్గాల  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.వరుణ్ తేజ్ క్యారెక్టర్ సినిమాలో మరో లెవెల్ కి చేరుకుంది. రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ ఎట్రాక్ట్ చేశాడు. వరుణ్ లోని మాస్ ఎలిమెంట్స్ ను తెరపై చూపించడంలో దర్శకుడు హరీశ్ శంకర్  100 %  సక్సెస్ అయ్యారు  ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపిస్తూనే  డైలాగ్స్ అలాగే పంచ్ లతో సినిమాకు  మంచి ఎనర్జీని తెప్పించాడు.

రేటింగ్ : 3.5/5
బాటమ్ లైన్:  ‘గద్దలకొండ గణేష్’ వరుణ్ తేజ్ నట విజృంభణను చూపించే హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here