ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్లు గా వెలుగొందుతున్న ఎందరో నటీనటులకు తన శిక్షణాలయం ద్వారా నటనలో ఓనమాలు నేర్పి, తగురీతిన వారిని అద్భుత నటులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి శ్రీ దేవదాస్ కనకాల గారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నేటి సాయంత్రం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల 1945 జూలై 30న యానాం శివారులోని కనకాలపేటలో జన్మించారు. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందిన అనంతరం, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన, పలు సినిమాలు మరియు టీవీ సీరియళ్లలో నటించి, కొన్నిటికి దర్శకత్వం కూడా వహించారు. వారి భార్య లక్ష్మి కనకాల గారు కూడా మంచి నటులుగా మన తెలుగువారికి సుపరిచితమే.
ఇక తమ శిక్షణాలయం ద్వారా భార్య లక్ష్మి గారితో కలిసి దేవదాస్ కనకాల గారి పర్యవేక్షణలో శిక్షణ పొందిన టాలీవుడ్ నటులు చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్, శుభలేఖ సుధాకర్ అలానే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, అరుణ్ పాండ్యన్ వంటి వారు వారి శిష్యులే. ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, సిరిసిరి మువ్వ, మంచుపల్లకి, గోరింటాకు, గ్యాంగ్ లీడర్, చెట్టుకింద ప్లీడర్, అమ్మో ఒకటో తారీఖు, మనసంతా నువ్వే, మళ్లీశ్వరి, కింగ్, ఒక్క మగాడు తదితర సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల గారు, కెరీర్లో చివరిగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన హిట్ చిత్రం భరత్ అనే నేనులో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఇక ఆయన చలిచీమలు, నాగమల్లి అనే చిత్రాలకు దర్శకత్వం కూడా వహించడం జరిగింది. నేడు ఆయన అకాల మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినిమా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు….!!


