టాలీవుడ్ లో శత చిత్ర దర్శకులుగా పేరుగాంచిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు గారు ఇటీవల విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మల్లేశం’ చిత్రాలను అభినందిస్తూ ప్రశంశలు కురిపించారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రేక్షకాధరణతో ముందుకు సాగుతున్నాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా స్వరూప్ దర్శకత్వంలో ఇటీవల డిటెక్టీవ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాన్ని మెచ్చిన రాఘవేంద్ర రావు గారు ఆ చిత్ర బృందం ని కలిసి అభినందనలు తెలుపుతూ ఈ చిత్రంలో తొలిసారి హీరోగా పరిచయం అయిన హీరో నవీన్, మంచి అనుభవం ఉన్న హీరోలా బాగా నటించారని, ఇక సినిమలో హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా ఒక్క డ్యూయెట్ కూడా లేకుండా కేవలం ఆకట్టుకునే కథ, కథనాలతో సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం తనకు బాగా నచ్చిందని, దర్శక నిర్మాతలు సినిమా అద్భుతంగా రావడంలో పడ్డ శ్రమ, చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అర్ధం అవుతుందని, ఇక తన ప్రియా శిష్యులు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని తాను కోరుకుంటున్నట్లు అయన చెప్పారు.
రాఘవేంద్ర రావు గారు మెచ్చిన మరొక చిత్రం, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతక్రింది మల్లేశం గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మల్లేశం. ఈ చిత్రాన్ని అయన ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. చేనేత కార్మికురాలిగా తల్లిపడుతున్న కష్టాన్ని గమనించి, పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, తన అద్భుత ప్రతిభతో ఆసు యంత్రాన్ని కనిపెట్టి ఎందరో చేనేత కార్మికులకు కొత్త జీవితాన్నిచ్చిన మల్లేశం గారి కథ తెరపై ఎంతో అద్భుతంగా ఉందని, నటుడు ప్రియదర్శి, నటీమణులు ఝాన్సీ, అనన్య సహా మిగతావారందరూ తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని అన్నారు. దర్శకుడు రాజ్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు చాలా బాగుందని మెచ్చుకున్నారు. చేనేత కార్మికులకు తనవంతుగా నాలుగు ఆసు యంత్రాల కొనుగోలు నిమిత్తం ఒక లక్ష రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు….!!


