రివ్యూ: ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు

0
540

ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు

బ్యానర్:  డాల్ఫిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

తారాగణం:  చేతన్‌ మద్దినేని, కశిష్‌ ఓరా, నరేష్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, అమిత్‌, నవీన్‌, భద్రం, గుండు సుదర్శన్‌, నాగినీడు, రాజేశ్వరి నాయర్‌ తదితరులు

సంగీతం: కిరణ్‌ రవీంద్రనాథ్‌

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి.

సినిమాటోగ్రఫీ: శేఖర్‌ చంద్ర

ఎడిటింగ్‌: గిరి మహేష్‌

మాటలు: అయ్యర్‌ శ్రవణ్‌

నిర్మాత: మంజునాథ్‌ వి.కందుకూర్‌

రచన, దర్శకత్వం: నరేష్‌కుమార్‌ హెచ్‌.ఎన్‌

విడుదల తేదీ:  21.06.2019

ఏ తండ్రికైనా తన కొడుకు బాగా చదువుకోవాలని, అందరి కంటే ముందుండాలని, క్లాస్‌ ఫస్ట్‌ రావాలని, కాలేజ్‌ ఫస్ట్‌ రావాలని ఉంటుంది. తన కొడుకు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో సెటిల్‌ అవ్వాలని ప్రతి తండ్రీ కలలు కంటాడు. అది సహజం. అయితే తన కొడుకు కూడా అదే ఆలోచిస్తున్నాడా? అతని ఆలోచనలు ఏమిటి? జీవితంలో అతను ఏం సాధించాలనుకుంటున్నాడు? ఏ రంగంలో రాణించాలనుకుంటున్నాడు? అతని ఇంట్రెస్ట్‌ దేని మీద ఉంది? ఇలా ఆలోచించే తల్లిదండ్రులు చాలా తక్కువ. అలాంటి తల్లిదండ్రుల కోసమే రూపొందిన సినిమా ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’.

కన్నడలో ఇదే పేరుతో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. నరేష్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మంజునాథ్‌ వి.కందుకూర్‌ కన్నడలో నిర్మించారు. తెలుగులో కూడా అదే పేరుతో రూపొందిన ఈ సినిమాకు కూడా వీరే దర్శకనిర్మాతలు. కన్నడలో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఫలితం దక్కింది? తెలుగులోనూ ఈ సినిమా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిందా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

అతని పేరు శోభన్‌బాబు(నరేష్‌). తన కొడుకు చదువులో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాలని కోరుకునే తండ్రి. సిలబస్‌లో ఉన్న విషయాలు తప్ప బయటి విషయాల గురించి ఆలోచించవద్దని, అసలు వాటి గురించి పట్టించుకోవద్దని చిన్నతనం నుంచి నూరి పోస్తాడు. దానికి తగ్గట్టుగానే రాజు(చేతన్‌ మద్దినేని) స్కూల్‌లో, కాలేజ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంటాడు. చదువులో ఫస్ట్‌ అని పేరు తెచ్చుకున్న రాజు జనరల్‌ నాలెడ్జ్‌లో మాత్రం సున్నా. సినిమాలు చూడడు, ఫ్రెండ్స్‌ లేరు, మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చేంత నాలెడ్జ్‌ కూడా అతనికి లేదు. అంతేకాదు లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ వంటి ఫీలింగ్స్‌ అతని దరిదాపుల్లో ఉండవు. అలాంటి రాజు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఓ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళతాడు. తన కొడుకు ఫస్ట్‌ ర్యాంక్‌ స్టూడెంట్‌ కాబట్టి డెఫినెట్‌గా ఉద్యోగం వచ్చేస్తుందని ఇంటి దగ్గర అందరికీ స్వీట్స్‌ పంచిపెడుతూ హడావిడి చేస్తాడు శోభన్‌బాబు. కానీ, రాజులోని మైనస్‌లు గుర్తించిన ఆ కంపెనీ ఎం.డి. అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. దీంతో మనస్తాపం చెందిన రాజు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. వెంటనే కొడుకుని తీసుకొని ఆ కంపెనీ ఎం.డి. దగ్గరకు వెళ్లి తన కొడుకుని చదువులోనే కాదు, మిగతా విషయాల్లోనూ నెంబర్‌ వన్‌గా చేసి తీసుకొస్తానని ఛాలెంజ్‌ చేస్తాడు. చదువు తప్ప మరో లోకం తెలియని రాజుని సొసైటీలో అందరిలాంటి కుర్రాడి తయారు చెయ్యడానికి శోభన్‌బాబు ఏం చేశాడు? తండ్రి చెప్పిన దారిలోనే మరోసారి నడిచిన రాజు సొసైటీ గురించి ఏం తెలుసుకున్నాడు? నిజమైన జీవితంలోని అనుభూతులు, స్నేహం, ప్రేమలోని మాధుర్యాన్ని రాజు చవి చూడగలిగాడా? ఈ జర్నీలో రాజుకు ఎదురైన అవాంతరాలు ఏమిటి? వాటిని ఎదుర్కొని తనని తాను ప్రూవ్‌ చేసుకోగలిగాడా? అనేది మిగతా కథ.

చదువు తప్ప వేరే ధ్యాసలేని రాజు పాత్రకు చేతన్‌ మద్దినేని నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. ప్రతి విషయం గురించి అమాయకంగా ప్రశ్నించడం, ఇన్నోసెంట్‌గా కనిపించడం, దానికి తగ్గట్టుగానే అతని బాడీ లాంగ్వేజ్‌ని కూడా మౌల్డ్‌ చేసుకోవడం వంటి విషయాల్లో చేతన్‌ నూటికి నూరు మార్కులు సాధించాడు. కొడుకు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడమే జీవిత ధ్యేయంగా కనిపించే శోభన్‌బాబు పాత్రలో నరేష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కాలేజ్‌ స్టూడెంట్స్‌గా ప్రియదర్శి, అమిత్‌, నవీన్‌ తదితరులు తమ తమ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. రాజు ప్రవర్తనకు ఎప్పుడూ షాక్‌ అయ్యే ప్రిన్సిపాల్‌ పాత్రలో పోసాని మంచి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. రాజుకు జీవితం పట్ల అవగాహన కల్పించే పాత్రలో ప్రకాష్‌రాజ్‌ ఎప్పటిలాగే తన నటనతో ఇన్‌స్పైర్‌ చేశారు. రాజుకు ప్రేమను పరిచయం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసే హీరోయిన్‌ శృతి పాత్రలో కశిష్‌వోరా తనవంతు కృషి చేసింది. అతిథి పాత్రల్లో బ్రహ్మానందం, రావు రమేష్‌ ఆకట్టుకున్నారు. రాజును ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మౌల్డ్‌ చేసే బాలీవుడ్‌ బాబి పాత్రలో వెన్నెల కిశోర్‌ తన మార్క్‌ కామెడీతో నవ్వించాడు. అతనికి అసిస్టెంట్‌గా భద్రం కూడా నవ్వించేందుకు ట్రై చేశాడు.

సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే అన్ని శాఖలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయని చెప్పొచ్చు. శేఖర్‌ చంద్ర ఫోటోగ్రఫీ చాలా నీట్‌గా ఉంది. సన్నివేశానికి తగ్గట్టుగా ప్లెజెంట్‌ ఫోటోగ్రఫీ అందించడంలో శేఖర్‌ కృషి కనిపిస్తుంది. కిరణ్‌ రవీంద్రనాథ్‌ చేసిన పాటల్లో రెండు పాటలు ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. జె.బి. అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. గిరి మహేష్‌ ఎడిటింగ్‌ ఫస్ట్‌హాఫ్‌ చాలా షార్ప్‌ అనిపించింది. సెకండాఫ్‌లో హీరోను మౌల్డ్‌ చేసే సన్నివేశాలు రిపీట్‌ అవుతున్న ఫీలింగ్‌ కనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. అయ్యర్‌ శ్రవణ్‌ రాసిన మాటలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఆలోచింపజేస్తాయి. కన్నడ సినిమాకి వర్క్‌ చేసిన టెక్నీషియన్సే ఈ సినిమాకీ వర్క్‌ చేయడం వల్ల సినిమాలో పర్‌ఫెక్ట్‌నెస్‌ కనిపిస్తుంది.

నిర్మాత మంజునాథ్‌ వి.కందుకూర్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. కథకు అవసరమైన మేర లొకేషన్స్‌, గ్రాఫిక్స్‌ వంటి విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఇక డైరెక్టర్‌ నరేష్‌కుమార్‌ గురించి చెప్పాలంటే… ప్రజెంట్‌ యూత్‌కి, పేరెంట్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో చక్కని మెసేజ్‌ అందించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ర్యాంకుల కోసం పాకులాడే విద్యాసంస్థలను వేలెత్తి చూపడంలో, పిల్లల అభీష్టానికి వ్యతిరేకంగా చదువును రుద్దే తల్లిదండ్రులను ఎడ్యుకేట్‌ చెయ్యడంలో నరేష్‌ అనుసరించిన పంథా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇది యూత్‌ సినిమానే అయినప్పటికీ సాధారణంగా యూత్‌ సినిమాల్లో ఉండే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌గానీ, వల్గర్‌ సీన్స్‌గానీ ఎక్కడా కనిపించవు. చదువు కంటే జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని ఇప్పటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిన నరేష్‌కుమార్‌ని అభినందించి తీరాల్సిందే. స్కూల్‌ పిల్లల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్‌ వరకు ప్రతి ఒక్కర్నీ ఈ సినిమా ఇన్‌స్పైర్‌ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి స్టూడెంట్‌, పేరెంట్స్‌ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’

బాటమ్‌ లైన్‌: ఇన్‌స్పైరింగ్‌ రాజు

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here