రివ్యూ: ఎన్‌జికె (నంద గోపాలకృష్ణ)

0
102

రివ్యూ: ఎన్‌జికె (నంద గోపాలకృష్ణ)

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ సత్యసాయి ఆర్ట్స్

తారాగణం: సూర్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయిపల్లవి, నిళల్‌గల్‌ రవి, తలైవాసల్‌ విజయ్‌, దేవరాజ్‌, ఉమా పద్మనాభన్‌, ఇళవరసు తదితరులు

సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.

సంగీతం: యువన్‌ శంకర్‌రాజా

నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు

రచన, దర్శకత్వం: శ్రీరాఘవ

విడుదల తేదీ: 31.05.2019

గజిని, సింగం సిరీస్‌ వంటి మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో సూర్య తాజాగా నటించిన సినిమా ఎన్‌జికె(నంద గోపాలకృష్ణ). శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. తెలుగులో 7జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరాఘవ చేసిన ఓ వినూత్న ప్రయత్నం ‘ఎన్‌జికె’. హీరో సూర్య కూడా ఇప్పటివరకు చేయని డిఫరెంట్‌ జోనర్‌ ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ తెలుగులో విడుదల చేశారు. సూర్య, శ్రీరాఘవ తొలి కలయికలో కొత్త జోనర్‌ అయిన పొలిటికల్‌ డ్రామాతో రూపొందిన ‘ఎన్‌జికె’తో ప్రేక్షకుల్ని మెప్పించగలిగారా? ఏ క్యారెక్టర్‌లోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్‌ చేత శభాష్‌ అనిపించుకునే సూర్య ఎన్‌జికె క్యారెక్టర్‌కి ఎంతవరకు న్యాయం చెయ్యగలిగాడు? తెలుగులో రెండు సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన శ్రీరాఘవ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోగలిగాడా? అసలు ఎన్‌జికె సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

అతని పేరు నంద గోపాలకృష్ణ. అందరూ అతన్ని ఎన్‌జికె అనీ, గోపాలం అనీ పిలుస్తారు. ఎంటెక్‌ చేసిన గోపాలం ఓ పెద్ద కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. ఆర్గానిక్‌ వ్యవసాయం మీద మక్కువతో ఆ జాబ్‌కి రిజైన్‌ ఊరికి వచ్చేస్తాడు. అక్కడి యువకులతో కలిసి వ్యవసాయం చేస్తూ రైతులు అనవసరంగా మోసపోకుండా వారిని ఎడ్యుకేట్‌ చేస్తుంటాడు. రైతుల జీవితాలతో వ్యాపారం చేసే కొంతమందికి అది నచ్చదు. ఆ ఏరియా ఎమ్మెల్యే అండదండలతో ఆ ఊళ్ళో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. వారి నుంచి జనాన్ని కాపాడటం కోసం ఎమ్మెల్యేని కలిసి అతను ఏది చెబితే అది చేస్తానంటాడు గోపాలం. ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌తో ఆ ఏరియాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దానికి ప్రతిఫలంగా గోపాలంతో కలిసి 500 మంది తమ పార్టీలో చేరాలని కండీషన్‌ పెడతాడు ఎమ్మెల్యే. అతను చెప్పినట్టుగానే అందరూ పార్టీలో చేరతారు. గోపాలం చలాకీతనం, కష్టపడే తత్వం వల్ల ఎమ్మెల్యే దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు కెఎంకె పార్టీకి పి.ఆర్‌. పనులు చూసే వనిత(రకుల్‌ ప్రీత్‌సింగ్‌)ను కలుస్తాడు గోపాలం. మెల్లగా ప్రజల్లో అతని పాపులారిటీ పెరిగిపోతుంది. అతని వల్ల తమకు చాలా నష్టం ఉందని అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ భావిస్తాయి. గోపాలాన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు ప్రతిపక్ష నాయకుడు. ఆ సమయంలో గోపాలం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? రాజకీయాల వల్ల అతను ఏం నష్టపోయాడు? రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగాడు? అనేది మిగతా కథ.

నందగోపాలకృష్ణగా సూర్య పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. అతని క్యారెక్టర్‌లో ఉన్న డిఫరెంట్‌ వేరియేషన్స్‌ని అత్యద్భుతంగా పలికించాడు. దేశానికి మంచి చేయాలనుకునే వ్యక్తిగా. ప్రజల కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడని త్యాగశీలిగా, రాజకీయంగా ఎత్తుకు పైఎత్తు వేసే లీడర్‌గా.. ఇలా వివిధ దశల్లో సూర్య నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఎన్‌జికె భార్య గీతగా తన నటనతో అలరించింది సాయిపల్లవి. ఓ పార్టీ పిఆర్‌ ఇన్‌ఛార్జిగా రకుల్‌ ప్రీత్‌ నటన చాలా డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. సూర్యతో చేసిన కొన్ని సీన్స్‌లో ఆమె నటన చాలా నేచురల్‌గా కనిపిస్తుంది. సూర్యతో కలిసి చేసిన పాటలో కూడా తన గ్లామర్‌తో, సింపుల్‌ స్టెప్స్‌తో యూత్‌ని మెప్పిస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో ఎమ్మెల్యేగా నటించిన ఇళవరసు తన క్యారెక్టర్‌ పరిధి మేరకు అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. చీఫ్‌ మినిస్టర్‌గా దేవరాజ్‌, హీరో తండ్రిగా నిళల్‌గళ్‌ రవి, తల్లిగా ఉమా పద్మనాభన్‌ తమ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు.

టెక్నికల్‌ అంశాల గురించి చెప్పాల్సి వస్తే శివకుమార్‌ విజయన్‌ ఫోటోగ్రఫీ బాగుంది. నేచురల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేసిన చాలా సీన్స్‌ నేచురల్‌గా అనిపిస్తాయి. యువన్‌శంకర్‌రాజా చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ స్కోప్‌ ఉన్న ఈ సినిమాలో దానికి తగ్గట్టుగానే తన పనితనం చూపించాడు యువన్‌. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చాలా సీన్స్‌లో క్రౌడ్‌ ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని బాగా మేనేజ్‌ చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా రిచ్‌గా కనిపించేలా చూశారు నిర్మాతలు. మేకింగ్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే యూత్‌కి మంచి సందేశాన్ని అందించేందుకు శ్రీరాఘవ చేసిన ప్రయత్నం సక్సెస్‌ అయిందని చెప్పాలి. ఆర్గానిక్‌ వ్యవసాయం చెయ్యాలంటూ యూత్‌కి మంచి మెసేజ్‌ ఇచ్చారు. అలాగే ప్రజలకు సేవ చేయడానికి యువతకు రాజకీయాలు ఎంత అవసరం అవుతాయో చెప్పారు. వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ అయిన సూర్య నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో శ్రీరాఘవ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఒక టిపికల్‌ సబ్జెక్ట్‌తో రూపొందించిన ఎన్‌జికెలో కామన్‌ ఆడియన్స్‌ కోరుకునే ట్విస్టులు, మంచి డైలాగ్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌, ఫైట్స్‌.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇది తప్పకుండా సూర్య, శ్రీరాఘవ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సమ్మర్‌కి హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు అందించిన మరో సూపర్‌హిట్‌ మూవీ ‘ఎన్‌జికె’

బాటమ్‌ లైన్‌: డిఫరెంట్‌ పొలిటికల్‌ డ్రామా

రేటింగ్: 3 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here