రివ్యూ : మహర్షి

0
1907

సినిమా : మహర్షి

బ్యానర్ : వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా

తారాగణం: మహేష్‌బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతిబాబు, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, కమల్‌ కామరాజు, ముఖేష్‌ రుషి, సాయికుమార్‌, రాజీవ్‌ కనకాల తదితరులు

సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

కథ-మాటలు: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌

నిర్మాతలు: సి.అశ్వినీదత్‌, దిల్‌రాజు, పరమ్‌ వి.పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వంశీ పైడిపల్లి

విడుదల తేదీ: 09.05.2019

‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీలో హీరోగా నటించిన 25వ సినిమా కావడం విశేషం. ‘మహర్షి’ మహేష్‌ 25వ సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 9 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. దానికి తగ్గట్టుగానే ‘మహర్షి’ ఎంతో గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. అభిమానుల అంచనాలను రీచ్‌ అయింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? సూపర్‌స్టార్‌ మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఏ రేంజ్‌లో ఉంది? వంశీ పైడిపల్లి.. మహేష్‌ని ఎలా ప్రొజెక్ట్‌ చేశారు? ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి మెసేజ్‌ను అందించారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

‘గెలుపును కోరుకునేవాడు మనిషి.. గెలుపును పంచేవాడు మహర్షి’ అనేది ఈ సినిమా కాన్సెప్ట్‌. దానికి తగ్గట్టుగానే అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. కథ విషయానికి వస్తే.. అమెరికాలోని ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఒరిజిన్‌’కి రిషి కుమార్‌(మహేష్‌) సి.ఇ.ఓ. సంవత్సరానికి అతని వేతనం వందల కోట్లలో ఉంటుంది. ఒక సాధారణ క్లర్క్‌(ప్రకాష్‌రాజ్‌) కొడుకైన రిషికి గెలుపు అంటే ఇష్టం. తన తండ్రి జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ ఉంటాయి. తను కూడా అలా కాకూడదని నిర్ణయించుకున్న రిషి గెలుపే ధ్యేయంగా కష్టపడతాడు. ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఆ ప్రయాణం ఎలా సాగింది? కాలేజీ డేస్‌లో అతని ఫ్రెండ్‌ రవి(అల్లరి నరేష్‌), ప్రియురాలు పూజ(పూజా హెగ్డే)లతో రిషి జీవితం ఎలా నడిచింది? ఆ తర్వాత ఆ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి? ఎలాంటి అవమానాలను భరించాడు? అనేది రిషి జర్నీలో చూపించారు. కోట్లకు అధిపతి అయిన రిషి కలుసుకునేందుకు అతని కాలేజ్‌ మేట్స్‌, ప్రొఫెసర్‌ యు.ఎస్‌.కి వెళతారు. అయితే అక్కడికి రిషి ఫ్రెండ్‌ రవి మాత్రం వెళ్ళడు. రవి వల్లే తను ఆ స్థాయికి వెళ్ళగలిగానని తెలుసుకున్న రిషి వెంటనే ఇండియా బయల్దేరతాడు? రవి ఉండే ఊరు రామవరంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలపై బిజినెస్‌మేన్‌ వివేక్‌ మిట్టల్‌(జగపతిబాబు) కన్నుపడుతుంది. ఒక ప్రాజెక్ట్‌ కోసం ఆ గ్రామాలన్నింటినీ కొనెయ్యాలనుకుంటాడు వివేక్‌. అయితే రామవరం గ్రామాన్ని మాత్రం ఇవ్వడానికి రవి ఒప్పుకోడు. ఆ సమయంలో తన ఫ్రెండ్‌ ఆశయాన్ని నెరవేర్చేందుకు రిషి ఏం చేశాడు? రిషి గెలుపు కోసం రవి చేసిన త్యాగం ఏమిటి? జీవితంలో గెలిచిన రిషి ఆ గెలుపుని అందరికీ పంచి మహర్షి ఎలా అయ్యాడు? అనేది మిగతా కథ.

రిషిగా సూపర్‌స్టార్‌ మహేష్‌ నటన అద్భుతమనే చెప్పాలి. రిషి జర్నీలో ఎన్నో ఫేజ్‌లను చూపించారు. కాలేజ్‌ స్టూడెంట్‌గా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా, ఒరిజిన్‌ కంపెనీ సీఈవోగా రకరకాల వేరియేషన్స్‌ ఉన్న రిషి క్యారెక్టర్‌లో మహేష్‌ జీవించారు. సీఈవో లుక్‌లో ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించిన మహేష్‌ ఫ్లాష్‌బ్యాక్‌లోని కాలేజీ ఎపిసోడ్‌లో చిలిపితనంతో కూడిన అల్లరి చేస్తూ అంతే అలరించారు. తండ్రి ఫెయిల్యూర్స్‌ని గెలుపుకి నిచ్చెనగా వేసుకొని అంచెలంచెలుగా ఎదిగి గెలుపుని అందుకున్న యువకుడిగా అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. తన ఎదుగుదలకు కారణమైన స్నేహితుడి ఆశయం కోసం ఎంత రిస్క్‌ చేయడానికైనా వెనుకాడని మిత్రుడిగా ఆకట్టుకున్నారు. ఇన్‌స్పైర్‌ చేసే డైలాగ్స్‌ చెప్పడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు మహేష్‌. అలాగే డాన్సుల్లో తన మార్క్‌ని చూపించారు. ఫైట్స్‌లోనూ తన పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం అనిపించేలా చేశారు. తల్లితో, తండ్రితో చేసిన కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించారు. ఒకవిధంగా చెప్పాలంటే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ‘మహర్షి’ సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లో ఒక ల్యాండ్‌ మార్క్‌ సినిమా అని చెప్పొచ్చు.

ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. తన గ్లామర్‌తో పాటల్లోనూ ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్‌గా ఒక కీలకమైన పాత్రలో నటించిన అల్లరి నరేష్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో అందరి మనసుల్ని దోచుకున్నాడు. డిగ్నిఫైడ్‌ విలన్‌గా జగపతిబాబు నటన కూడా డిగ్నిఫైడ్‌గానే ఉంది. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయికుమార్‌, ముఖేష్‌రుషి, కమల్‌ కామరాజు తదితరులు తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే టెక్నికల్‌గా ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు టెక్నీషియన్స్‌ కృషి ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా కె.యు. మోహనన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవాలి. ఆద్యంతం సినిమాను రిచ్‌గా చూపించడంలో ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ సినిమాను ముందుకు నడిపించడంలో తోడ్పడింది. సిట్యుయేషన్‌ పరంగా వచ్చే పాటలు వీనుల విందుగా ఉండడమే కాకుండా విజువల్‌గా కూడా బాగా ఆకట్టుకుంటాయి. కథలో, కథనంలో ఉన్న ఎన్నో వేరియేషన్స్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అద్భుతంగా చెయ్యడంలో దేవి సక్సెస్‌ అయ్యారు. ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ కూడా ఎంతో షార్ప్‌గా ఉంది. డైరెక్టర్‌ థాట్స్‌కి తగ్గట్టుగా సినిమాను నడిపించడంలో వంశీకి ప్రవీణ్‌ అందించిన సహకారం స్క్రీన్‌పై తెలుస్తుంది. నిర్మాతల గురించి చెప్పాలంటే ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ని అందించిన మూడు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీతనం ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా సినిమాని ఎంతో రిచ్‌గా నిర్మించారు.

ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం యూత్‌కి అవసరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. జీవితంలో గెలవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అనేది ప్రధా కథాంశంగా తీసుకొని ఆ తర్వాత దేశానికి వ్యవసాయం ఎంత ముఖ్యం అనేది కథానుసారం వచ్చే సీన్లలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. రిషి క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసిన విధానం చాలా బాగుంది. అతని జర్నీని రకరకాల ఫేజ్‌లలో అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసేలా చూపించడంలో వంశీ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా హరి, సాల్మన్‌తో కలిసి వంశీ రాసిన డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి అప్లాజ్‌ వస్తోంది. “గెలుపుని కోరుకునేవాడు మనిషి, గెలుపుని పంచేవాడు ‘మహర్షి'” అనే పాయింట్‌ చుట్టూ వంశీ అల్లిన కథ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ‘మహర్షి’ ఈ సమ్మర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌కి మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బాటమ్‌లైన్‌: సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌ ‘మహర్షి’

 రేటింగ్ : 3.75 / 5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here