ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘అవేంజర్స్ ఎండ్ గేమ్’. ఈ చిత్రంలో హాలీవుడ్ లో వచ్చిన అందరూ సూపర్ స్టార్లు నటిస్తున్నారు. అందరూ కలిసి నటిస్తుండడం.. మిలియన్ డాలర్లతో సినిమా తీయడం.. హేమాహేమీలు నటిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అవేంజర్స్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలా అందరూ అద్భుత శక్తులున్న వ్యక్తులు ఒకే సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాలపై కనకవర్షం కురుస్తోంది. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు.
కాగా దేశంలో తెలుగు, తమిళం, హిందీ, మళయాల భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు మరింత క్రేజ్ ను తెచ్చేందుకు తాజాగా అవేంజర్స్ దర్శకులు వివిధ భాషల్లోని ప్రముఖ నటులను సంప్రదిస్తున్నారు. వారి గొంతులను హీరో, విలన్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇలా సినిమాకు హైప్ తీసుకురావడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే ప్రముఖ నటుడు రానాను అవేంజర్స్ యూనిట్ సంప్రదించింది. బాహుబలి సినిమాలో విలన్ గా వీరలెవల్లో నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా పోయిన ఏడాది వచ్చిన ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ లో విలన్ థానోస్ కి చెప్పిన డబ్బింగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ లో రానా తన డబ్బింగ్ తో అలరించనున్నారు.


