‘మజిలీ’ రివ్యూ

0
268

మజిలీ

బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌

తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, పోసాని క ష్ణమురళి తదితరులు

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

ఆర్ట్‌: సాహి సురేష్‌

కెమెరా: విష్ణు శర్మ

సంగీతం: గోపీసుందర్‌

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది

రచన-దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల తేది: ఏప్రిల్‌ 5 2019

‘ఏమాయ చేసావె’, ‘మనం’, ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత. పెళ్లి తర్వాత కలిసి జంటగా నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. పెళ్లికి ముందు ప్రేమకథలలో నటించి హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న చై, సామ్‌, పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా నటించడంతో ‘మజిలీ’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం..

కథ:

విశాఖపట్నానికి చెందిన పూర్ణ (నాగచైతన్య) రైల్వే జోన్‌లో చోటు సంపాదించి భారత జట్టు తరపున ఆడాలని కలలు కనే క్రికెటర్‌. ఈ క్రమంలోనే విశాఖ నేవి ఆఫీసర్‌ కూతురు అయిన అన్షు (దివ్యాంశ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడుతుంది. భూషణ్‌ (సుబ్బరాజు) కారణంగా వారి ప్రేమ విచ్ఛిన్నం అవుతుంది. ఆ తర్వాత ప్రేమ విఫలమైన పూర్ణ బాధతో మద్యానికి బానిస అవుతాడు. అనుకోని పరిస్థితుల్లో శ్రావణి (సమంత)తో పెళ్లి జరిగినప్పటికీ తన ధ్యాస అంతా అన్షు మీదే ఉంటుంది. ఈ క్రమంలో పూర్ణ, శ్రావణి జీవితంలోకి క్రికెటర్‌గా ఎదగాలనే కోరిక ఉన్న మీరా అనే ఓ బాలిక ప్రవేశిస్తుంది. అసలు ఎవరా మీరా? తన వలన వీరిద్దరి జీవితాలలో ఎలాంటి మార్పు వస్తుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

పెళ్లికి ముందు ప్రేమ.. పెళ్లి తర్వాత ప్రేమ అనే అంశాలను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చినా.. కొన్ని సినిమాలే ఆదరణ పొందాయి. అందుకు కథ, కథనమే కారణం. ఎమోషనల్‌ సీన్స్‌ను ఎలా హ్యాండిల్‌ చేశారనే దాన్ని బట్టి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ చక్కగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి సన్నివేశాలను హృద్యంగా.. చక్కగా మలిచాడు. ప్రేమను, బాధను మిక్స్‌ చేసి వాటికి అనుగుణంగా సన్నివేశాలను చక్కగా రాసుకున్నాడు. సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఓ ప్రేమకథ ఫస్టాఫ్‌లో ఉంటే.. మరో ప్రేమకథ సెకండాఫ్‌లో ఉంటుంది. ఈ రెండు ప్రేమకథలను బ్యాలెన్స్‌ చేస్తూ ఎమోషనల్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌ అంతా యూత్‌ను మెప్పించేలా ఉంటే.. సెకండాఫ్‌ అంతా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. సన్నివేశాలు మన చుట్టూ జరుగుతున్నట్టే అనిపిస్తాయి. భార్యని డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతున్న భర్త ఆంతర్యాన్ని తెలుసుకొని ఆమె అతనికి డబ్బులు ఇచ్చేలాంటి సన్నివేశాల్లో డ్రామా బాగా పండింది. ప్రేయసి కోసం ప్రేమికుడు పడే బాధ ఒకవైపు.. భర్త కోసం తాపత్రయపడే భార్య మరో వైపు.. కొడుకు కోసం బాధపడే తండ్రి .. అలాగే కూతురి కాపురం బావుండాలని ఆరాటపడే తండ్రి .. ఇలా ఓ పూర్తి కుటుంబాన్ని రెఫర్‌ చేసే చిత్రంలో సందర్భానుసారం కామెడీ, బరువైన డైలాగులు మిక్స్‌ చేసి అద్భుతంగా తెెరకెక్కించారు.

నటీనటుల పనితీరు:

‘మజిలీ’ సినిమాలో పూర్ణ క్యారెక్టర్‌దే అగ్రభాగం. కథ సింగిల్‌ త్రెడ్‌ కావడం, కథ మొత్తాన్ని పూర్ణ యాంగిల్‌లో చెప్పాల్సి రావడంతో నాగచైతన్యకి పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని తన నటన ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. నటనలో మరో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్‌ సీన్లను చైతూ బాగా పండించాడు. కెరీర్‌లోనూ, ప్రేమలోనూ పరాజితుడిగా నిలిచిన ఒక యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా తను తీసుకున్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. అలాగే జీవితంలో ఆటుపోట్లకు గురయ్యే భార్య శ్రావణి పాత్రలో సమంత కనిపించింది. రెండో భాగంలో కథాపరంగా శ్రావణి పాత్ర బలంగా మారుతుంది. ఆ క్యారెక్టర్‌లో సమంత పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. అయితే భారమైన పాత్రను చాలా తేలిగ్గానే మోసిందనే చెప్పవచ్చు. తను కనిపించిన ప్రతీ సీన్‌ను ఎలివేట్‌ చేసి సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నాగచైతన్య, సమంత కెరీర్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఎమోషన్స్‌ పలికించడంలో ఒకరికొకరు పోటీ పడి నటించారు. ఇక లవ్లీ గర్ల్‌గా దివ్యాంశ కౌశిక్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో మెరిసింది. గ్లామర్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలో చలాకీగా కనిపించింది. రొమాంటిక్‌ సీన్లలో చైతూతో కెమిస్ట్రీ బాగా పండించేలా నటించింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు కెరీర్‌ గురించి ఆందోళన పడే తండ్రి పాత్రలో రావు రమేష్‌ నటన కి హ్యాట్సాఫ్‌. సమంత తండ్రి పాత్ర పోషించిన పోసాని కృష్ణమురళీ తనదైన మార్క్‌ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేశారు.

టెక్నీషియన్స్‌:

ముఖ్యంగా ఈ సినిమాలో ఛాయాగ్రహకులు విష్ణుశర్మ ప్రతి ఫ్రేమ్‌ చాలా బాగా చూపించారు. సినిమాకి కెమెరా వర్క్‌ ప్లస్‌ పాయింట్‌. గోపీ సుందర్‌ అద్భుతమైన సంగీతంతో అలరించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌, సాహో సురేష్‌ ఆర్ట్‌ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమాకు థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలెట్‌. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. శివ నిర్వాణ డైలాగ్స్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన అప్లాజ్‌ వస్తోంది. ఎమోషనల్‌ సీన్స్‌ని తన మార్క్‌ డైలాగ్స్‌తో మరోసారి మ్యాజిక్‌ చేశారు.

బాటమ్‌ లైన్‌: నాగచైతన్య, సమంతల సక్సెస్ ఫుల్ ఎమోషనల్‌ జర్నీ ఈ మజిలీ

ఇండస్ట్రీహిట్‌.కామ్‌ రేటింగ్‌: 3.25 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here