డెఫినిట్ గా ‘F3’ చేసే ఆలోచన ఉంది – యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

0
119

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ ఇచ్చిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విక్టరి వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్-లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ద్వారా మరో సంచలనమైన హిలేరియస్ హిట్ సాధించిన సందర్భంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ.

ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
– చాలా చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ లో జనాలు అన్ని క్లాస్ ల వారూ పడి పడి నవ్వుతుంటే, వాళ్ళ ఆనందాన్ని చూసి నేనెంతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతక ముందు జంధ్యాల గారు, ఈ వీ వీ గారి సినిమాలకి ఆడియన్స్ ఇలా ఎంజాయ్ చేస్తుండేవారు. అలాంటి రియాక్షన్ మళ్ళీ ‘F2 ‘ థియేటర్స్ లో చూసి దర్శకుడిగా నేను థ్రిల్ ఫీల్ అయ్యాను.

విక్టరీ వెంకటేష్ తో మీ ఎక్స్పీరియన్స్ ?
– వెంకటేష్ గారికి ఫస్ట్ ఈ స్టోరీ ఐడియా చెప్పగానే అదిరిపోయిందన్నారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చేయడానికి ఎంతో సహకారాన్ని అందించారు. మళ్ళీ మళ్ళీ వెంకటేష్ గారితో వర్క్ చేయాలన్నంత ప్లెజెంట్ గా ఈ సినిమా జరిగింది.

ఒక సన్నివేశంలో ‘బెండకాయ ముదిరిపోయింది….’ అని వెంకటేష్ గారితో చెప్పించడం…
– ఈ డైలాగ్ చెప్పిందే వెంకటేష్ గారు. అలాంటి డైలాగ్ స్టార్టింగ్ లోనే పెట్టేస్తే క్యారెక్టర్ కి లిబర్టీ ఉంటుందని వెంకటేష్ గారు కన్విన్స్ చేశారు. ఆయన కారక్టరైజేషన్ గురించి అప్పుడప్పుడు ఇంపుట్స్ ఇస్తుండేవారు. ‘ఇది నా మీద బావుంటుందా’ అని ఆయన ఎప్పుడైనా డౌట్ వెలిబుచ్చినా, ‘మీ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని సర్. మీ నుండి ఆడియన్స్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ పెట్టి చేసిన స్క్రిప్ట్ సర్ ఇది’ అని నేను ఆయనతో చెప్పేవాడిని. దానికి ఆయన ‘ఓకే నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటె చేసేద్దాం’ అని ఎంకరేజ్ చేసేవారు.

డాగ్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పే సన్నివేశం పట్ల వెంకటేష్ ఎలా రియాక్ట్ అయ్యారు ?
– ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు. కుక్కని చుస్తే మనం పారిపోతాం, లేకపోతే గోడ దూకుతాం. దాన్నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తాం. ఆ కుక్క మగకుక్క అయితే ?, ఆ కుక్కతో తన భార్య పెడుతున్న టెన్షన్ గురించి చెప్తే అదెలా రియాక్ట్ అవుతుందనేది కొత్త యాంగిల్. ఆ షాట్ చేస్తున్నప్పుడు ఆ కుక్క కూడా అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో ఆ సీన్ బాగా సెట్ అయింది. ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ బాగా చేయడంలో వెంకటేష్ గారు ఆయనకి ఆయనే సాటి. అందుకే ‘నువ్వు తోపురా, మనుషుల్నే కాదు కుక్కల్ని కూడా ఏడిపించేస్తావ్’ అనే మంచి డైలాగ్ పడింది. దానికి థియేటర్ లో రెస్పాన్స్ అదిరింది.

వెంకీ ఆసనం ఐడియా ఎలా వచ్చింది?
-సాధారణంగా మనం రకరకాల ఆసనాలు వేస్తుంటాం. అలాంటిది మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక ఆసనం ఉంటే ఎలా ఉంటుంది. అనే ఆలోచన నుండి ఈ వెంకీ ఆసనం పుట్టుకొచ్చింది. అలాగే వెంకటేష్‌గారికి ఓ మెనరిజమ్‌ పెట్టి..  దాన్ని కథకు లింక్‌ చేస్తు బావుంటుందనిపించి ఈ వెంకీ ఆసనం కనిపెట్టాను. ఆడియెన్స్‌ దాన్ని బాగా ఓన్‌ చేసుకున్నారు. చాలా మంది థియేటర్‌లో ఆ ఆసనాన్ని వేస్తున్నారు. చాలా పాపులర్‌ అయ్యింది.

సోషల్ మీడియాలో మిమ్మల్ని జంధ్యాల, ఈ వి.వి తో పోల్చడం వైరల్ అయింది దీని పై మీ కామెంట్?

– జంధ్యాల గారి, ఈవీవీ గారి సినిమాలు, కృష్ణారెడ్డి గారి సినిమాలను చూస్తూ పెరిగినవాడిని. వాళ్ళ సినిమాలకి అన్ని వర్గాల ప్రేక్షకులు నవ్వుతూనే ఉండేవారు. నేను డైరెక్టర్ అయ్యాక అలా వాళ్ళ సినిమాల కోవలో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. అయితే వారి స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు. కానీ ఎక్కడో ఒకచోట వాళ్ల ప్రభావం నాపై ఉంటుందనే మాట మాత్రం వాస్తవం.

వరుణ్‌ తేజ్ గురించి?

– వరుణ్‌ కూడా ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో సినిమా చేయలేదు. తను వెంకటేష్‌ గారితో ఎలా కామెడీ టైమింగ్‌లో చేస్తాడోనని కాస్త ఆలోచించాను. తెలంగాణ యాస మాట్లాడుతూ వరుణ్‌ యాదవ్‌ అనే కుర్రాడి పాత్రలో కామెడీ జోనర్‌లో ఫస్ట్ టైం అయినా కూడా వెంకీగారి టైమింగ్ తో మ్యాచ్ చేసి చాలా వండర్ఫుల్ గా చేశాడు.

ఈ కథ ఐడియా ఎలా వచ్చింది ?

– `ప‌టాస్‌` నుండి రాజాది గ్రేట్‌’ వరకు కమర్షియల్‌ సినిమాలు చేశాను. అయితే రాజాది గ్రేట్‌ సినిమా చేసేటప్పుడు అసలు ఫైట్‌ లేకుండా ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనే ఆలోచన వచ్చింది. దానికి ఎలాంటి బేస్‌ తీసుకోవాలి అని థింక్ చేస్తున్నప్పుడు ‘పెళ్ళాం చెబితే వినాలి’, ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ జోనర్‌లో ఈ మధ్య కాలంలో సినిమాలు రాలేదనిపించి ఆ జోనర్ లో ఈ కథను రాసుకున్నాను.

ఈ స్క్రిప్ట్ రాయడానికి ఎంత టైం తీసుకున్నారు ?
– నా టీం సాయి, ప్రవీణ్‌, నారాయణ నాతో బాగా కలిసిపోయి వర్క్ చేస్తుంటారు. ఏ సినిమా అయినా నాలుగైదు నెలల్లో రెడీ చేస్తాం. ఈ సినిమా కూడా అలానే చేశాం.

స్క్రిప్ట్ లేకుండానే ప్రాజెక్ట్ ఓకే అయిందని విన్నాం ?
– అదేం లేదండి. 70 సీన్లు, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడూ నేను షూటింగ్ కి వెళ్ళను. డైలాగుల్లో మార్పు, పాత్రలు అటు ఇటు అవడం జరుగుతుంది తప్ప కథ మాత్రం ముందే ఫిక్స్ అవుతుంది.

‘F2 ‘ సీక్వెల్ చేస్తారా ?
– చేయమని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే ‘F2 ‘ సిరీస్ గా ‘F3 ‘ చేద్దామని వెంకటేష్ గారితో వరుణ్ తేజ్ తో అన్నాను. వాళ్ళు ఎప్పుడైనా రెడీ అని అప్పుడే చెప్పేసారు.

‘F3 ‘ లో వీళ్ళ తో పాటు మరో హీరో కూడా ఉంటారని వినిపిస్తోంది ?
– ‘F3 ‘ గురించి తర్వాత మాట్లాడదాం. అన్ని డీటెయిల్స్ నేనే చెప్తాను.

సినిమా చూశాక వెంకటేష్ గారు ఏమన్నారు ?
– వెంకటేష్‌గారు కథను బాగా నమ్మారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సీన్ బై సీన్ టోటల్ సినిమా చూసి.. బయటకు వచ్చి ‘అదేంటమ్మా అంత ఎనర్జెటిక్ గా చేసేశాను’ అని చాలా ఏక్సయిటింగ్ గా చెప్పారు. దీనికి డబ్బింగ్‌ కూడా అంత ఎనర్జీతో చెప్పాలి అని నెక్స్ట్ డే వచ్చి డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఆయన డబ్బింగ్ విషయంలో కూడా చాలా కేర్‌ తీసుకున్నారు. దాని రిజల్టే ఇవాళ థియేటర్ లో అంత రెస్పాన్స్. సినిమా రిలీజ్ అయ్యాక ఆయన మా టీం అందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పారు. నువ్వు అనుకున్నది పర్ఫెక్ట్ గా జనానికి రీచ్ అయ్యేలా చేశావు అని నన్ను ఎప్రిషియేట్ చేశారు. నిజానికి ఈ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ గారికే దక్కుతుంది.

హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లను స్విమ్ సూట్ లో బాగా గ్లామర్ గా చూపించారు..
– కావాలనే గ్లామరస్ గా ఉండాలనే తీశాను. నా ముందు సినిమాల్లో గ్లామర్ తగ్గిందని చాలా మంది నన్ను అడిగారు. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు గారు పాటలు తీయడంలో కానీ హీరోయిన్లని అందంగా చూపించడంలో కానీ ఎక్స్పర్ట్. సినిమాకి గ్లామర్ కూడా అవసరం. ఆ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాను. గ్లామర్ కోరుకునే వాళ్లందరికీ అవన్నీ నచ్చాయి.

గుండమ్మ కథ రిఫరెన్స్ ఆలోచన ఎలా వచ్చింది ?
– నాకు గుండమ్మ కథ అంటే పిచ్చి. ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచీ ఆ సినిమాని పదే పదే చూస్తుండేవాడిని. ఆ అక్కా చెల్లెళ్ళ కాన్సెప్ట్ నాకు ఇష్టం. అందుకని ఆ సినిమా మీదున్న ప్రేమతో ఈ సినిమాలో అదొక ఎపిసోడ్ లాగా పెట్టాను.

మెహ్రీన్ పాడుతుంటే తమన్నా తబలా వాయిస్తున్నట్టు తీశారు. ఎలా కన్విన్స్ చేశారు ?
– దానికి నేనేమి పెద్ద కష్టపడలేదు. ఎందుకంటే కథని, కారక్టర్లని అందరూ అర్ధం చేసుకుని ఎవరి పాత్రలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఆ విషయంలో హీరోయిన్స్ నుండి ఫుల్ సపోర్ట్ లభించింది.

అన్నపూర్ణ, వై విజయ, ప్రగతి క్యారెక్టర్లకి మంచి రెస్పాన్స్ వస్తోంది ?
– నాకు సూర్యకాంతం గారంటే ఇష్టం. ఆవిడ నటనలో, డైలాగ్‌ చెప్పడంలో ఓ స్టయిల్‌ ఉంటుంది. ఆమె డైలాగ్‌ను చాలా అందంగా విరుస్తారు. అలాంటి సూర్యకాంతం గారి క్యారెక్టర్‌ మోడ్రన్‌గా ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి ప్రగతి క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేశాం. అన్నపూర్ణ గారు, వై విజయ గారి కారక్టర్లకి ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ, నాయనమ్మలు. ఇంట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా వాళ్ళు మంచంపై కూర్చుని అది.. ఇది అంటూ అందరినీ సరదాగా కామెంట్‌ చేస్తుండేవారు. అవి నాకు బాగా రిజిష్టర్‌ అయ్యి కొంచెం అటు ఇటు మార్చి ఈ సినిమాలో పెట్టాను.

క్లైమాక్స్ లో అందరూ నాకు క్లాసులు పీకుతారని ప్రకాష్ రాజ్ తో చెప్పించడం..?
– ఇది ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఎలాగూ అంతా కామెడీ చేస్తున్నావ్ కదా. ఇదీ కామెడీగా బానే ఉంది అని అన్నారు. అలా ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం వల్ల ఆ సీన్ బాగా హైలెట్ అయింది. ప్రకాష్ రాజ్ గారు మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు.

పృథ్వి క్యారెక్టర్ కి రెస్పాన్స్ బావుంది…
– పృథ్వి సినిమా అంతా ప్రతి విషయానికి టెన్షన్ అవుతూ, లాస్ట్ సీన్ లో ప్రకాష్ రాజ్ గారి మీద రివర్స్ అవడం…పృథ్వి చాలా బాగా చేశాడు. అలాగే సినిమాలో ప్రతి క్యారెక్టర్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, గన్ మాన్ క్యారెక్టర్ కూడా థియేటర్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్ని క్యారెక్టర్లు అంత పండడం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది.

వెన్నెల కిషోర్ కి విలన్ బిల్డప్ ఇచ్చారేంటి ?
– ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఇందులో విల్లన్లు, సీరియస్ వాతావరణామే ఉండకూడదని అది కూడా ఫన్నీ గానే ఉండాలని ఆ క్యారక్టర్ ని అలాగ కామెడీ తరహాలోనే డిజైన్ చేశాం. మేము అనుకున్నవన్నీ ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి.

టెక్నిషియన్స్ సపోర్ట్ ఎలా ఉంది ?
– సినిమా చూసిన అందరూ వెంకటేష్ గారు చాలా, చాలా అందంగా ఉన్నారని అంటున్నారు. ఆ క్రెడిట్ అంతా సమీర్ రెడ్డి గారిదే. ఆయన ప్రతి ఫ్రేమ్ ని అందంగా, లావిష్ గా చెక్కారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ గారు సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా మిక్సింగ్ లో ఆయనే స్వయంగా కూర్చుని డైలాగులు స్పష్టంగా వినపడాలని ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో సౌండ్ తగ్గించారు. సినిమాని అంత ప్రేమించారాయన.

‘గున్న గున్న మామిడి’ పాట మళ్ళీ పెట్టారు ?
– క్లైమాక్స్ లో వంతెన మీద జోష్ కోసం డాన్స్ బిట్ అవసరం అనిపించింది. ఆ డాన్స్ షాట్ చేసేప్పుడు సరదాగా ‘గున్న గున్న మామిడి’ పాటని ప్లే చేశాము. అదే ఫిక్స్ అయిపోయింది. నా ప్రీవియస్ సినిమాలో ఎంత ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో దానికి డబుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మేము సరదాకి పెట్టింది ఒక హైలైట్ అయిపోయింది.

ఇది పెళ్ళైన తర్వాత రాసిన కథా ?
– అవును, నా పెళ్ళయాక ఆ అనుభవంతోనే ఈ కథ వచ్చింది.

మరి మీ ఆవిడ చూసి ఏమన్నారు ?
– బాగా నవ్వుకుని చాలా బాగుందని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.

సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి ఆడవారే కరెక్ట్ అని తేల్చారుగా ?
– దేవి శ్రీ ప్రసాద్ ఇదే అడిగారు. ఫస్ట్ హాఫ్ లో ఆడవాళ్లే మగాళ్లని టార్చర్ పెడుతున్నట్టు తీశారు, సెకండ్ హాఫ్ కి వచ్చేప్పటికి ఆడవాళ్ళే కరెక్ట్ అని చెప్పారేంటి అని అన్నారు. మరి అదే కదా కరెక్ట్. రేపు పెళ్ళయ్యాక మీకే తెలుస్తుంది అని జోక్ చేశాను. దానికి దేవి నవ్వేశారు. ప్రతి వాళ్ళు ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి కథలో ఆ బాలన్స్ ఉండడం వల్లనే.

దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ముగ్గురితో మీ అనుబంధం చెప్పండి ?
– దిల్ రాజు గారు ఒక లెక్చరర్ లాగా ఉంటారు. ఆయనేం చెప్పినా అందులో ఒక యూస్ ఫుల్ పాయింట్ ఉంటుంది. సినిమా గురించి చాలా బాగా డిస్కస్ చేస్తారు. ఆయనంటే నాకు ఎంతో రెస్పెక్ట్. సినిమా బాగా రావడం కోసం దేనికి వెనుకాడరు. శిరీష్ గారు నేను బాగా కలిసిపోయాం. మేము చాలా క్లోజ్ గా, ఫ్రెండ్లీ గా ఉంటాం. నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. లక్ష్మణ్ గారితో ఇంతకముందు అంతగా సాన్నిహిత్యం ఉండేది కాదు కానీ ఈ మధ్య రెగ్యులర్ గా కలుస్తున్నాం. ఆయనతో హ్యాపీ. ఈ బ్యానర్ లో వరసగా మూడు సినిమాలు చేయడం, మూడూ హిట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

తదుపరి చిత్రాల గురించి ?
– ఇంకా ఏమీ అనుకోలేదు. థియేటర్ల కి వెళ్ళి ఆడియన్స్ మొహాల్లో ఆనందాన్ని చూడాలి. అదే నాకు ఎంజాయిమెంట్. పండుగకు ఊరెళ్లి ఎంజాయ్‌ చేసి.. రిలాక్స్‌ అవ్వాలి. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ప్లాన్ చేస్తాను.

F3 ఎప్పుడు ఉంటుంది ?
– F3 స్టార్ట్ చేసేలోపు మధ్యలో ఒక సినిమా ఉంటుంది. అదేంటనేది త్వరలోనే చెప్తాను. ఈ లోపు F3 స్క్రిప్ట్ ఫైనల్ చేసుకుంటాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు F2 తో సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలోనే డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాడని ఆశిద్దాం.

                                               —- బి ఏ రాజు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here