శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో అభిషేక్‌ ఫిలిమ్స్‌ అధినేత రమేష్‌ పిళ్లై నిర్మాతగా గోపీ గణేష్‌ పట్టాబి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్లఫ్‌ మాస్టర్‌’. ‘ఘాజి’ ‘అంతరిక్షం’ చిత్రాల ఫేమ్‌ సత్యదేవ్‌ హీరోగా ‘నందితా శ్వేత హీరోయిన్ గా నటించారు. డిసెంబర్‌ 28న సినిమా విడుదలవతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాబి ఇంటర్వ్యూ విశేషాలు…

‘బ్లఫ్‌ మాస్టర్‌’ ఎలా స్టార్ట్‌ అయింది?
– ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ మా గురువు ‘పూరి’గారు తీసిన ‘బిజినెస్‌మేన్‌’ సినిమా. ఆ సినిమాలో హీరో బ్యాంగ్‌ ఓపెన్‌ చేసినప్పుడు హీరోకి, కమీషనర్‌కు మధ్య ఓ చిన్న డిస్కషన్‌ నడుస్తుంది. దాని ఆధారంగానే సోసైటీలోని మరో కోణంలో కథను తయారు చేసుకున్నారు.

ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి చేంజస్‌ చేశారు?
– ఈ సినిమా చేయమని అన్నప్పుడు తమిళంలో చతురంగ వేట్టై సినిమా చూశాను. నిర్మాతగారిని అడిగి, ఓరిజనల్‌ వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన దర్శకుడు హెచ్‌.వినోద్‌గారిని కలిశాను. మాతృకతో కాకుండా చిన్న చిన్న చేంజస్‌ చేద్దామని అనుకున్నాం. ఆయన అప్పుడు ‘ఖాకి’ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఆయన తన కథకు మా గురువు పూరిగారి సినిమానే ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పినప్పుడు నాకు మాత్రమే రీమేక్‌ చేసే అర్హత ఉందని ఫీలయ్యాను.

ఈ సినిమాలో హీరో సత్యదేవ్‌ మీచాయిస్సేనా?
– సత్యదేవ్‌ కంటే ముందు నలుగురైదుగురు హీరోలు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి వెళ్లారు. కథలో మెయిన్‌ హీరో ఓ కామన్‌ మేన్‌గా కనపడతారు. అందుకే ఆ సినిమా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. ‘చతురంగ వేట్టై’ నుండి సోల్‌ను మాత్రమే తీసుకుని కథను తయారు చేసుకున్నాను. హీరో క్యారెక్టరైజేషన్‌ను మార్చుకుని రాసుకున్నాను. డైలాగ్స్‌ నేనే రాసుకున్నాను. అడిషనల్‌ డైలాగ్స్‌ సపోర్టింగ్‌ను కీలక సన్నివేశాలను పులగం చిన్నారాయణగారు అందించారు. అయితే నాతో పాటు ఈ సినిమాకు వర్క్‌ చేసిన టీం సభ్యులు నా డైలాగ్స్‌కు ఫ్యాన్‌ అయ్యారు. పూరిగారు కూడా నా డైలాగ్స్‌ విని కచ్చితంగా విజిల్స్‌ పడతాయని కూడా అన్నారు.

హీరో సత్యదేవ్‌తో మీ అనుబంధం?
– సత్యదేవ్‌తో మంచి అనుబంధం ఉంది. నాలుగైదు సార్లు ఈ ప్రాజెక్ట్‌లోకి తనను తీసుకు రావాలని ప్రయత్నించాను కూడా. కొన్ని డైలాగ్స్‌ రాసి టెస్ట్‌ షూట్‌ చేశాను. దాన్ని శివలెంక కృష్ణప్రసాద్‌గారికి చూపించాను. ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమాకు సత్యదేవ్‌ యాప్ట్‌ అని నేను మొదటి నుండి నమ్మాను. దాన్ని సత్యదేవ్‌ తన నటనతో నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లి తను తప్ప ఎవరూ చేయలేరు అనేంత బాగా నటించారు. థియేటర్‌ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు సత్యదేవ్‌ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సునీల్‌ కశ్యప్‌ గురించి?
– సునీల్‌ కశ్యప్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌గారి దగ్గర పనిచేశారు. సిచ్యువేషన్‌కు తగినట్లు.. ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్లి పోయేలా ఉండాలనుకుంటాను. ఆర్‌.ఆర్‌ చాలా కీ రోల్‌ పోషిస్తుంది. నేను తమ్ముడిగా భావించే సునీల్‌ కశ్యప్‌నే ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాను. సునీల్‌ తన సంగీతంతో సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు సునీల్‌ కశ్యప్‌.

ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫామెన్స్‌?
– ఆదిత్యమీనన్‌, బ్రహ్మాజీ, సిజ్జుమీనన్‌ ఇలా చాలా మంచి పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రలో నటీనటులకంటే.. పాత్రలే కనపడతాయి. ఇందులో హీరో పేరు ఆకాశ్‌ విహారి. అంటే అకాశం అయితే.. అమ్మాయి పేరు అవని. అంటే భూమి. సినిమాలో హీరో చేసే మోసాలతో పాటు సమాంతరంగా వారిద్దరికీ సంబంధించిన కథ రన్‌ అవుతూ ఉంటుంది. డబ్బుంటే భూమి మీదనే స్వర్గం చూడొచ్చు అనుకునే టైప్‌.. అయితే డబ్బుకి, సంతోషానికి సంబంధం లేదు అని నమ్మే పాత్ర హీరోయిన్‌ది. ఇన్‌డైరెక్ట్‌గా, సెటైరికల్‌గా మంచి మెసేజ్‌ను చెప్పేంత స్కోప్‌ ఉన్న సినిమా ఇది. మంచి సినిమా. థియేటర్‌కొచ్చే ప్రేక్షకుడ్ని మా సినిమా బ్లఫ్‌ చేయదు.

మీ నెక్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– కె.ఎస్‌.రామారావుగారితో చేయాల్సిన సినిమా పైప్‌లైన్‌లో ఉంది.