మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రభాకర్‌.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్‌బాబు’. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్‌ శైలేంద్ర సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు…

బ్రాండ్స్‌ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరికీ బ్రాండ్స్‌ వస్తువులు ఉండాలనే పిచ్చి ఉంటుంది. అందుకనే ఓ డెబ్యూ హీరోగా ఇలాంటి కథ నాకు యాప్ట్‌ అయితే బావుంటుందనిపించింది. పక్కా మారుతి బ్రాండ్‌ మూవీ.

2-3 ఏళ్లుగా మారుతిగారిని మంచి సినిమా చేయమని అడుగుతున్నాను. ఓరోజు ఆయన నన్ను పిలిచి 2-3 ఏళ్లంటే ఆలస్యం అవుతుంది కాబట్టి. ప్రభాకర్‌ దర్శకత్వంలో సినిమా చేయమని.. తన రాసుకున్న స్క్రిప్ట్‌ను అందించారు. ప్రతి సీన్‌లో కామెడీ సెన్స్‌ బాగా ఉంటుంది. ఈ సినిమా తెలుగులో మాత్రమే విడుదలవుతుంది.

తెలుగులో సినీ ప్రేక్షకులు సినిమాలను ఫెస్టివల్స్‌లా ఫీలై చూస్తారు. ఇక్కడ మార్కెట్‌ పెద్దది. ఇక్కడున్న ప్రేక్షకులు ఏ ఇండస్ట్రీలోనూ ఉండరు. కొత్త సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తుంటారు.

మా నాన్నగారు 20 ఏళ్లుగా కన్నడంలో సినిమాలు చేస్తున్నారు. అక్కడ స్టార్స్‌తో సినిమాలు చేశారు. తెలుగులో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా కూడా చేశారు. ఇక్కడ మార్కెట్‌, ప్రేక్షకుల ఆదరణ చూసి తెలుగులో నన్ను డెబ్యూ చేయాలని అనుకుని ఈ సినిమా చేశారు.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన ముందు నుండి లేదు. ఒకరోజు నేను మైసూర్‌ వెళ్లినప్పుడు అక్కడ ఉపేంద్రగారి సినిమా షూటింగ్‌ జరుగుతుంది. అక్కడ ఆయనకు దొరికిన ఆదరణ, గౌరవం చూసి నేను సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. ప్రజల్లో ఆదరణ పొందాలంటే రాజకీయాల్లో అయినా ఉండాలి… లేదా సినిమాల్లో అయినా ఉండాలి. రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను.

నటుడి నాకు అల్లు అర్జున్‌ ఇన్‌స్పిరేషన్‌. ఆయన నటించిన ఆర్య సినిమా చూసి నేను ఇన్‌స్పైర్‌ అయ్యాను. హీరో అయిన తర్వాత రెండు సార్లు ఆయన్ను కలిశాను కూడా. ఆయన సోదరుడు అల్లు శిరీష్‌ నాకు చాలా క్లోజ్‌.

ఇక ‘బ్రాండ్‌బాబు’ సినిమా గురించి చెప్పాలంటే బ్రాండ్స్‌ అంటే ఇష్టపడే ఓ రిచ్‌ ఫ్యామిలీ అబ్బాయిగా కనపడతాను. పెక్యులర్‌ పాత్ర నాది. అతను బ్రాండ్స్‌ ధరించే వ్యక్తులతోనే మాట్లాడుతాడు కూడా. అలాంటి యువకుడు ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించించాడనేదే కథ.

నేను డిగ్రీ ఫైనలియర్‌లో యాక్టర్‌ కావాలనుందని నాన్నతో చెప్పాను. ఆయన రెండేళ్లు బాగా కష్టపడాలని చెప్పి నటన, డాన్స్‌, డైలాగ్‌ డెలివరీ ఇలా అన్నింటిలో శిక్షణ ఇప్పించారు. ముంబైలో డాన్స్‌, ఫైట్స్‌, జిమ్నాస్టిక్స్‌ అన్నింటిలో శిక్షణ తీసుకున్న తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చాను. నాన్నగారు సీనియర్‌ నిర్మాత. ఆయనకు చిన్న మచ్చ కూడా లేదు. ఆయన పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది.

డైరెక్టర్‌ ప్రభాకర్‌గారు ఆల్‌రౌండర్‌. ఆయనకు టీవీల్లో మంచి అనుభవం ఉంది. సినిమా కూడా డైరెక్ట్‌ చేశారు. ఆయనతో సినిమా చేసే ముందు కలిసి మాట్లాడాను. సినిమాలో నేను చేసిన పాత్రకు, రియల్‌ లైఫ్‌లో పాత్రకు చాలా తేడా ఉంటుంది. నేను డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడతాను.

బ్రాండ్‌బాబు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌. అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. బెస్ట్‌ స్క్రీన్‌ప్లే మూవీ. ఇప్పటి యూత్‌లో చాలా మందికి రిలేట్‌ అయ్యే చిత్రం.

కన్నడంలో కమర్షియల్‌ సినిమాలు చేశాను. అయితే మారుతిగారు నన్ను కలిసి తెలుగులో కమర్షియల్‌ సినిమాలు చేయాలనే ఆలోచన మానేసెయ్‌. ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు చెయ్‌ అన్నారు. అలాగే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.

ప్రేక్షకులు అభిరుచి మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతుంది. కొన్నిసార్లు కమర్షియల్‌ సినిమాలను చూస్తే.. కొన్నిసార్లు హారర్‌ సినిమాలను చూస్తారు. అలా ట్రెండ్‌ మారుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రాతలను చేయాలనుకుంటున్నాను.

నాకు కన్నడంలో మంచి మార్కెట్‌ ఉంది. అయితే నేను ఈ సినిమాను తెలుగు, కన్నడంలో ఒకేసారి చేయడం కంటే పెద్ద మార్కెట్‌ ఉన్న తెలుగులోనే చేయాలనుకున్నాను. ఎందుకంటే బై లింగ్వువల్‌ సినిమాలేవీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఆ సెంటిమెంట్‌ కూడా ఉంది. కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువగా చూశాను. ఎన్టీఆర్‌, మహేశ్‌, బన్ని సినిమాలను తప్పకుండా చూస్తుంటాను.