నేను చాలా పాజిటివ్ వ్య‌క్తిని – అదితీరావు హైద‌రీ

0
9

అదితీరావు హైద‌రీ తెలుగు మూలాలున్న అమ్మాయి. బాలీవుడ్‌లో ప్రూవ్డ్ ఆర్టిస్ట్. మ‌ణిర‌త్నం చిత్రం `కాట్రు వెలియిడు` చిత్రం ద్వారా ద‌క్షిణాదికి ప‌రిచ‌య‌మైంది. ఆమె న‌టించిన తొలి తెలుగు చిత్రం `స‌మ్మోహ‌నం` ఈ వారం విడుద‌ల కానుంది. మ‌రోవైపు సంక‌ల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉంది అదితీరావు. `స‌మ్మోహ‌నం` విడుద‌ల సంద‌ర్భంగా ఆమె బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

* తెర‌మీద హీరోయిన్‌గా క‌నిపించ‌డం ఎలా ఉంది?
– చాలా బావుంది. నేను చిన్న‌ప్ప‌టి నుంచి హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాల‌ను చూస్తుండేదాన్ని. నిజ జీవితంలో హీరోయిన్‌గా చేస్తున్నాను. కానీ సెట్లో ఎలా ఉండాలి? ఎలా ఉంటాను? వ‌ంటి విష‌యాల‌ను ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. ఈ సినిమా స‌మ‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా వాటి గురించి ప‌ట్టించుకున్నాను.

* ఎలా అనిపించింది.. అప్ర‌మ‌త్తంగా ఉంటుంటే?
– హ్యాపీగా అనిపించింది. హీరోయిన్లు చాలా క‌ష్టం చేస్తారు. వాళ్ల‌వి కాని ఎమోష‌న్స్ ని మ‌న‌సులోకి తెచ్చుకుని ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేయ‌డానికి కృషి చేస్తారు. ఆ కృషిని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవ‌లం ర‌క్తం, మాంసం ముద్ద‌గా చూడ‌కూడ‌దు. దాని వెనుక ఉన్న మ‌న‌సును చూడాలి. మ‌న‌లాంటి అమ్మాయిలే అని అంద‌రూ అనుకోవాలి. నేన‌యితే స్త్రీ, పురుషులంతా స‌మాన‌మే అని అనుకుంటాను. న‌న్ను మా వాళ్లు పెంచిన విధానం అలాంటిది. అలా కాకుండా అమ్మాయి కొంచెం త‌క్కువ అని ఎవ‌రికైనా చిన్న‌ప్ప‌టి నుంచి చెప్పి పెంచితే వారిలో ఎలాంటి మార్పూ రాదు.

* ఓ వైపు హీరోయిన్‌గా న‌టిస్తూ, మ‌రోవైపు కేర‌క్ట‌ర్లు కూడా చేస్తున్న‌ట్టున్నారు?
– అందులో త‌ప్పేం ఉంది? నేను హీరోయిన్‌నే. అయినా ఆర్టిస్టుని. నాకు కొంత‌మందితో ప‌నిచేయాల‌ని ఉంటుంది. అలాంటి ద‌ర్శ‌కులు చెప్పే క‌థ ముందు వింటాను. క‌థ న‌చ్చితే మిగిలిన‌వ‌న్నీ సెకండ‌రీనే. ఆ విష‌యంలో నేను చాలా స్ప‌ష్టంగా ఉంటాను. ద‌క్షిణాది మ‌ణిర‌త్నంగారితో సినిమా చేయాల‌న్న‌ది నా క‌ల‌. చేశాను. ఇప్పుడు ఆయ‌న‌తో రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల‌, త‌మిళంలో మిస్కిన్‌, గౌత‌మ్‌మీన‌న్‌.. ఇలా నేను ప‌నిచేయాల‌నుకుంటున్న ద‌ర్శ‌కుల శాతం చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

*మ‌ణిర‌త్నంగారితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి చెప్పండి?
– ఆయ‌న నాకు మెంట‌ర్‌, టీచ‌ర్‌. ఒక‌టేంటి అన్నీ.. మ‌న‌లోని ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డంలో ఆయ‌న్ని మించిన వారు ఉండ‌రు. అలాగ‌ని మ‌నం ప్ర‌మాదంలో ప‌డిపోతున్నామంటే కాపాడ‌టంలోనూ ఆయ‌నే ముందుంటారు. అందుకే ఆయ‌న‌తో సినిమా అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.

* `స‌మ్మోహ‌నం` ఎలా కుదిరింది?
– ఒక‌రోజు ఇంద్రగంటిగారు ఫోన్ చేసి నాకు ఈ సినిమా గురించి చెప్పారు. ఐదు లైన్ల‌లో క‌థ చెప్పారు. మొత్తం క‌థ విన్నాను. ఎలా విన్నానంటే పెద్ద‌లు క‌థ చెబుతుంటే చిన్న పిల్ల‌లు ఆసక్తిగా వింటారు క‌దా… అంత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విన్నాను. చాలా న‌చ్చింది. కానీ నా ద‌గ్గ‌ర కాల్షీట్లు లేవు. అయినా స‌ర్ది ఈ సినిమా చేశాను. నా కోసం ఈ టీమ్ కొన్నాళ్లు ఆగారు.

* డ‌బ్బింగ్ చెప్పుకున్న‌ట్టున్నారు?
– ఇప్పుడేదో హైద‌రాబాద్‌లో ఉన్నాన‌ని చెప్ప‌డం కాదు కానివ్వండి.. న‌న్ను ఎప్పుడు ఎవ‌రు అడిగినా నేను `హైద‌రాబాదీ`నే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవ‌డానికి నేను గ‌ర్వ‌ప‌డ‌తాను. మా తాత ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమ‌ని చెప్పేవారు. కానీ నేను ఏరోజూ వాళ్ల మాట విన‌లేదు. డ్యాన్సింగ్‌, సింగింగ్‌.. ఇలా చాలా నేర్చుకున్నాను కానీ, నేనెప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. ఈ సినిమా కోసం నేర్చుకుని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.

* ఈ సినిమా కోసం స్ట్రెయిన్ అయ్యారా?
– అలాంటిదేమీ లేదు. అంద‌రూ న‌న్ను చాలా బాగా చూసుకున్నారు. అందువ‌ల్ల ప్ర‌త్యేకంగా స్ట్రయిన్ అయిన‌ట్టు ఏమీ అనిపించ‌లేదు. రోజూ రెగ్యుల‌ర్‌గా సెట్‌కెళ్లి చేసే ప‌నిని ఈసినిమా కోసం స్పెష‌ల్‌గా చేశాను. చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది సినిమా. చూస్తే త‌ప్ప‌కుండా అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి ఒక్క‌రికీ ఒక ల‌వ్ స్టోరీ ఉన్న‌ట్టు, ఈ సినిమాలో ల‌వ్‌స్టోరీ స్పెషాలిటీని తెర‌మీదే చూడాలి.

* చెలియా ఇక్క‌డ స‌రిగా ఆడ‌లేదు క‌దా.. ఏమైనా ఫీల్ అయ్యారా?
– అలాగ‌నేం లేదండీ. నేను క‌ల‌గ‌న్న ద‌ర్శ‌కుడితో ప‌నిచేశాను. అంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది? అయినా తెలుగులో స‌రిగా ఆడ‌లేదేమో కానీ, త‌మిళంలో ఆ సినిమా చాలా బాగా ఆడింది. అయినా నేను అంత త్వ‌ర‌గా నెగ‌టివ్ విష‌యాల గురించి ఆలోచించ‌ను. నా ముందు వంద ర‌కాల నెగ‌టివ్ విష‌యాలున్నా, నేను ఎంపిక చేసుకునే అంశం నాకు సంతోషాన్ని క‌లిగించేదే అయి ఉంటుంద‌నే న‌మ్మ‌కం నాకు చాలానే ఉంటుంది.

* సంక‌ల్ప్ రెడ్డి సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నారు?
– ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉద‌యాన్నే రోప్ వ‌ర్క్స్ నేర్చుకుంటున్నా. ఆ త‌ర్వాత రాత్రి మ‌ణిర‌త్నం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నా.

* బాగా క‌ష్ట‌ప‌డేట‌ట్టున్నారు..?
– మా అమ్మా వాళ్లు నాకు నేర్పింది అదే. వెనుక ఎంతైనా ఉండ‌వ‌చ్చు. కానీ నువ్వేంటనేది నువ్వే నిరూపించుకోవాలి అని చెప్పారు వాళ్లు. అందుకే నేను బాగా క‌ష్ట‌ప‌డ‌తాను. ఎదుటివారిని గౌర‌విస్తాను. న‌న్ను అవ‌త‌లివాళ్లు గౌర‌వించాల‌ని కోరుకుంటాను. మ‌న‌కి ఎవ‌రో వ‌చ్చి గౌర‌వాలు ఇవ్వ‌రు. ముందు మ‌న‌ల్ని మ‌నం గౌర‌వించుకుంటే, ఎదుటివాళ్లు కూడా గౌర‌విస్తార‌నే భావ‌న నాది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here