ప్రభుదేవ మాత్రమే చేయగలిగిన పాత్ర అది – “మెర్క్యూరీ” డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్

0
332

ప్రభుదేవ ప్రధాన పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం మూకీ చిత్రం “మెర్క్యూరీ”. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ని తెలుగు లో కె.ఎఫ్.సి ప్రొడక్షన్ రిలీజ్ చేస్తున్నారు.. సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగు మీడియాతో సినిమా విశేషాలు, తన తదుపరి చిత్ర వివరాలు మరియు ఒక దర్శకుడిగా తన భవిష్యత్ ప్రణాళికలు గురించి మాట్లాడారు.

అది చిన్న కన్ఫ్యూజన్ వల్ల రైజ్ అయిన ఇష్యూ..

“మెర్క్యూరీ” మూకీ సినిమా కావడంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేద్దామనుకొన్నాం. ప్లానింగ్ అంతా పూర్తయ్యాక తమిళనాట థియేటర్ స్ట్రైక్ అయ్యింది. తమిళ ఫిలిమ్ ఛాంబర్ తీసుకొన్న నిర్ణయంపై గౌరవంతో ఒక్క తమిళంలో తప్ప మిగతా భాషల్లో “మెర్క్యూరీ”ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అయితే.. కొందరు దర్శకనిర్మాతలకు మా ఇంటెన్షన్ అర్ధం కాక మొదట్లో అడ్డు చెప్పారు. అయితే.. ఇప్పుడు అంతా క్లియర్.

అదొక్కటే భయం..

తమిళంలో తప్ప “మెర్క్యూరీ” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే చేసేస్తున్నాం కానీ.. తమిళనాట థియేటర్స్ స్ట్రైక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. అలాగే.. మూకీ సినిమా కాబట్టి పైరసీ కారణంగా ఎక్కడ తమిళనాడులో రిలీజ్ అయ్యే టైమ్ కి ప్రేక్షకులు ఆల్రెడీ ఇంటర్నెట్ లో సినిమా చూసేస్తారేమో అనే భయం ఉంది. కానీ.. పైరసీని అరికట్టడానికి ప్రయత్నిస్తాం.

ఆ హాలీవుడ్ సినిమా ఎఫెక్ట్ ఉండదు..

“మెర్క్యూరీ” ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ అందరూ “ఎ క్వైట్ ప్లేస్” అనే హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేశారు. కాన్సెప్ట్ కాస్త కంపేరిటివ్ గా ఉన్నా.. ఆ సినిమాకి, నా సినిమాకి అస్సలు సంబంధం లేదు. “మెర్క్యూరీ”లో మీరెవరూ ఎక్స్ పెక్ట్ చేయని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.

సౌండ్ డిజైన్ సినిమాకి హైలైట్..

మూకీ సినిమా కావడంతో కొంత పార్ట్ షూటింగ్ అయ్యాక మా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారికి చూపించాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొన్నారు. అలాగే సౌండ్ డిజైన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కథ నన్ను ఎగ్జైట్ చేయాలి..

వరుసబెట్టి సినిమాలు చేయడం నాకు నచ్చదు. అలాగే.. రెగ్యులర్ & రొటీన్ సినిమాలు కూడా చేయలేను. ఒక కథ రాసుకొన్నానంటే అది నన్ను ఎగ్జైట్ చేయాలి. అప్పుడే సెట్స్ మీదకు వెళ్లగలను. “ఇరైవి” తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే.. నేను రాసుకున్న “మెర్క్యూరీ” కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ ప్రొజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చాను.

ప్రభుదేవను దృష్టిలో పెట్టుకొని రాసుకోలేదు..

నేను ఈ సినిమా కథ రాసుకొంటున్నప్పుడు ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలి అని మాత్రమే అనుకున్నాను. ఆ తర్వాత ప్రభుదేవ గారైతే ఈ పాత్రకు బాగుంటారనిపించింది. ఆయన్ని కలిస్తే “అసలు మూకీ సినిమా జనాలు చూస్తారంటావా” అని మాత్రమే అడిగారు. అయితే.. క్యారెక్టర్ బాగా నచ్చడంతో పెర్ఫార్మెన్స్ విషయంలో ఆయనే చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. ఆ పాత్ర అంత రియలిస్టిక్ గా రావడానికి ప్రభుదేవగారే కారణం.

చేప్తే చేసేవాడ్నేమో అన్నారు రజనీకాంత్..

“జిగర్తాండ” సినిమా చూసిన రజనీకాంత్ గారు నన్ను ఇంటికిపిలిచి మరీ అభినందించారు. అప్పుడు నేను ఆయనకి “బాబీ సింహా క్యారెక్టర్ నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే రాసుకొన్నాను. అసలు ఆ పాత్ర మీరు చేస్తే ఇంకా బాగుండేది” అన్నాను. అప్పుడాయన “అడగాల్సింది కదా.. చేసేవాడ్నేమో, ఇంకోసారి ఏదైనా స్క్రిప్ట్ రాసుకుంటే నాకు చెప్పు.. తప్పకుండా సినిమా చేద్దాం” అన్నారు. అలా ఇప్పుడు ఆయనతో సినిమా తీసే అవకాశం అందుకొన్నాను.

నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవాలనుకొంటున్నాను..

ప్రయోగాత్మక సినిమాలు మాత్రమే చేయాలని నేనేమీ నిశ్చయించుకొని కూర్చోలేదు. అయితే.. ఒక దర్శకుడిగా నాకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకోవాలని మాత్రం ప్రతిక్షణం పరితపిస్తాను. నన్ను నేను ప్రేక్షకులకు కొత్తగా చూపించుకోవాలి అంటే నా సినిమా వాళ్ళకి ఒక సరికొత్త అనుభూతినివ్వాలి. అందుకే వైవిధ్యమైన కథ-కథనాలకు ఇంపార్టెన్స్ ఇస్తాను.

ఫ్లాపైనా కూడా గర్వకారణం..

నా మునుపటి చిత్రం “ఇరైవి” కమర్షియల్ గా సరిగా ఆడలేదు. అయితే.. నా కెరీర్ బెస్ట్ ఫిలిమ్ మాత్రం అదేనని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే.. నాకు ఒక దర్శకుడిగా పేరుతోపాటు గౌరవం కూడా తీసుకొచ్చిన సినిమా అది. ఆ సినిమా రిలీజయ్యాక వచ్చిన స్పందన, అభినందనలు సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అనే బాధను దూరం చేశాయి. మళ్ళీ తప్పకుండా ఆ తరహా సినిమా ఒకటి తప్పకుండా చేస్తాను.

రజనీకాంత్ సినిమా కథ ఇంకా పూర్తవ్వలేదు..

రజనీకాంత్ గారికి బేసిక్ స్టోరీ లైన్ చెప్పాను. ఆయన నచ్చి ఒకే చేసి, ఎనౌన్స్ మెంట్ కూడా చేయించారు. ఒక మంచి యాక్షన్ డ్రామాగా ఆయన సినిమా ఉంటుంది. అయితే.. కథ ఇంకా పూర్తవ్వలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక ఇంకో రెండు లేదా మూడు నెలల్లో షూటింగ్ మొదలెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను. రజనీకాంత్ గారితో సినిమా అనంతరం ధనుష్ తో సినిమా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here