ప్రభుదేవా గులేబకావళి గీతావిష్కరణ

0
268

ప్రభుదేవా, హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. రేవతి ప్రధాన పాత్రను పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. బిగ్‌సీడీని రాష్ట్ర సాంస్కృతిక శాఖసారథి, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ విడుదలచేశారు. ఆడియో సీడీలను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని శ్రీమతి జీవితా రాజశేఖర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ “హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్ అంశాలు మిళితమైన అందమైన చిత్రమిది. నిధి అన్వేషణ నేపథ్య కథాంశాలతో దక్షిణాదిలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. ఈ సినిమా ఆ జాబితాలో నిలవాలి. చిన్న నిర్మాతల సినిమాల్ని విడుదలచేసి వారికి సహాయపడాలనే తపన మల్కాపురం శివకుమార్‌లో కనిపిస్తుంది. ఆయన చేసే ప్రతి సినిమా సక్సెస్ కావాలి” అని తెలిపారు.

తెలుగు,తమిళ నేటివిటీకి సరిపోయే కథ ఇదని, అందరికి నచ్చే విధంగా ఉంటుందని దర్శకుడు కల్యాణ్ చెప్పారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ “చెన్నైలో ఐదోవారంలో ఈసినిమా చూశాను. తమిళ భాష రాకపోయినా సాధారణ ప్రేక్షకుడిగా సినిమాను చాలా ఎంజాయ్‌చేశాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముంది. ఏప్రిల్ 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు

శాసనసభ్యుడు, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ “అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. పాటలు, ట్రైలర్ బట్టే ఈ సినిమా సక్సెస్ తెలుస్తున్నది. నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖప్రజ్ఞాశాలిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభుదేవా. తన కథతో ప్రభుదేవాను ఒప్పించి తొలి సినిమాతోనే ప్రతిభను చాటారు దర్శకుడు కల్యాణ్. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ధైర్యాన్నిస్తున్నారు మల్కాపురం శివకుమార్. చిన్న సినిమాల్ని ఆదరిస్తున్నా గొప్ప నిర్మాత. నాకు ఏం మిగులుతుందనే ఆలోచనను పక్కనపెట్టి ఎదుటివారిలో ఆనందాన్ని చూసి సంతోషపడే వ్యక్తి ఆయన. నేను ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు శివకుమార్ పంపిణీదారుడిగా వ్యవహరించనున్నారు ప్రయోగాత్మకంగా తెరకెక్కనున్న ఆసినిమాను జూన్-2న విడుదలచేయనున్నాం” అని తెలిపారు.

జీవిత మాట్లాడుతూ “గరుడవేగ సినిమాను ఎలా విడుదలచేయాలి, ఏ విధంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్న సమయంలో శివకుమార్ సహాయం అందించారు. ఆ సినిమా పెద్ద సక్సెస్‌గా నిలవడానికి ఆయనే కారణం. తెలంగాణలో శివకుమార్ పెద్ద నిర్మాతగా పేరుతెచ్చుకోవాలి” అని చెప్పారు.

మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే శివకుమార్ ప్రయత్నం విజయవంతమవ్వాలని శ్రీనివాస్ బొగ్గరం చెప్పారు.

ప్రభుదేవా స్ఫూర్తితోనే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, అలాంటిది ఆయన సినిమాకు కొరియోగ్రఫీ అందించే సమయంలో భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయని జానీమాస్టర్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీరం సుధాకర్‌రెడ్డి, బీరం లోకేష్‌రెడ్డి, రచ్చరవి, జబర్ధస్త్ రాము పాల్గొన్నారు. మధుసూదన్, ఆనంద్‌రాజ్, సత్యన్, మన్సూర్ అలీఖాన్, యోగిబాబు, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం:వివేక్ మెర్విన్, సాహిత్యం: సామ్రాట్, సినిమాటోగ్రఫీ: ఆర్.ఎస్. ఆనంద్‌కుమార్, ఆర్ట్ డైరెక్టర్: కె. కధిర్, విజువల్ ఎఫెక్ట్స్: రాఘురామన్, స్టంట్స్: పీటర్ హెయిన్, రాక్ ప్రభు, నిర్మాత: మల్కాపురం శివకుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here