‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు – నటసింహ బాలకృష్ణ

0
93

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బేనర్‌పై బిబో శ్రీనివాస్‌ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, యలమంచిలి సాయిబాబు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నటసింహ బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో ఈ చిత్రం ప్రారంభం నుండి హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని వున్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అయి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయఢంకా మ్రోగిస్తోంది. బాలయ్య నట విశ్వరూపం, క్రిష్‌ దర్శకత్వ ప్రతిభ, సాయిమాధర్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు, జ్ఞానశేఖర్‌ ఫొటోగ్రఫీ, చిరంతన్‌ భట్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రానికి మెయిన్‌ ఎస్సెట్స్‌గా నిలిచాయి. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో హైయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నటసింహ బాలకృష్ణతో ‘ఇండస్ట్రీహిట్‌’ స్పెషల్‌ ఇంటర్వ్యూ.

థియేటర్లలో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
– చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాల్సిన చిత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఈ చిత్రాన్ని ఆదరించి ఘనవిజయం చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

మీ ఫ్యాన్స్‌ నుండి మీకు ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది?
– నా నుండి అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఎమోషన్‌ సీన్స్‌, హై యాక్షన్‌ ఎపిసోడ్స్‌, భారీ డైలాగులు అన్నింటినీ ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ యుద్ధానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా నా వందో చిత్రం కావడం, ఎక్స్‌పెక్టేషన్స్‌ విపరీతంగా పెరిగాయి. ఆ అంచనాలకు మించి సినిమా వుండటంతో ఫ్యాన్స్‌ అంతా చాలా సంతోషంగా వున్నారు. ముందు నుండే నా అభిమానులు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ అనేక పూజా కార్యక్రమాలు చేశారు. నాన్నగారి ఆశీస్సులు, ఆ భగవంతుడి దీవెనలు ఉండబట్టే ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించింది.

ఈ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
– ఇది మన తెలుగు సినిమా. మన సినిమా అంటూ ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకుంటూ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు ప్రజల విజయంగా చూస్తాను. ఈ విజయంలో మీడియా కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

శాతకర్ణి పాత్రలో మీరు తప్ప ఎవ్వరూ చేయలేరు అన్నప్పుడు మీకెలా అన్పించింది?
– అది ప్రేక్షకులు ఇచ్చే మరపురాని అభినందనగా ఫీలవుతా. నాన్నగారు చెయ్యాలనుకున్న పాత్ర నేను చేశాను. ఇలాంటి పాత్రలు చేయడం మేము అదృష్టంగా భావిస్తుంటాం. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులూ ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్‌ హ్యాపీగా జరిగింది. నాన్నగారు నా వెన్నంటే వుండి జరిపించినట్టుగా వుండేది. ఒక దైవ శక్తి మమ్మల్ని అందర్నీ నడిపించింది.

ఈ కథ విన్నప్పుడు మీకు బాగా నచ్చిన అంశం ఏంటి?
– ఫస్ట్‌ లైన్‌ చెప్పాడు క్రిష్‌. ఆ తర్వాత వచ్చి డీటైల్డ్‌గా కథ చెప్పాడు. ఫస్ట్‌ టైమ్‌ లైన్‌ విన్నప్పుడే ఓకే. మనం కలిసి పని చేద్దాం అన్నాను. పక్కా క్లారిటీతో అన్నీ పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశాడు క్రిష్‌. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లాంటి ఒక తెలుగువాడి చరిత్ర భారతదేశ నలుమూలలా తెలియాలి. అది మన బాధ్యత. శాతకర్ణి లాంటి ఒక వీరుడు దేశానికి ఎంత మేలు చేశాడు అనే పాయింట్‌ నాకు బాగా నచ్చింది. స్టోరీ నేరేట్‌ చేసేటప్పుడే సినిమా చూపించాడు క్రిష్‌. హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నా వందో సినిమా చేస్తే బాగుంటుంది. కొత్తగా వుంటుందని ఈ సినిమా చేయడం జరిగింది. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. ఇంత మంచి అవకాశం నన్ను వెతుక్కుంటూ రావడం నా అదృష్టం.

రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఉంది? రిస్క్‌ అనిపించలేదా?
– ఈ సినిమా కథ విన్నప్పుడే ఈ చిత్రం విజయం సాధిస్తుందని బలమైన నమ్మకం ఏర్పడింది. క్రిష్‌ స్క్రీన్‌ పై ప్రజెంట్‌ చేసిన తీరు చూశాక నా నమ్మకం నిజమైంది. కమర్షియల్‌ సినిమాలు ఎప్పుడూ చూస్తాం. కానీ చారిత్రాత్మక చిత్రాలు ఎప్పుడో కానీ రావు. ఇలాంటి చిత్రాలు బిగ్‌ స్క్రీన్‌ పై చూస్తేనే థ్రిల్లింగ్‌గా వుంటుంది.

సినిమా చూసేటప్పుడు ఎలాంటి హోం వర్క్‌ చేశారు?
– ప్రిపరేషన్‌ హోం వర్క్‌ అంటూ ఏం చెయ్యలేదు. నా క్యారెక్టర్‌ని ఫెంటాస్టిక్‌గా డిజైన్‌ చేశాడు క్రిష్‌. దానికి తగ్గట్టుగానే గెటప్‌, కాస్ట్యూమ్స్‌ అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాయి. సెట్లో డైలాగ్స్‌ చెప్పగానే విపరీతమైన ఉత్సాహం కలిగేది. అదే ఉత్సాహంతో సినిమా చేశాను. ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీగా వుండటంతో నేను, క్రిష్‌, మా టీమ్‌ అంతా కూర్చుని చాలా ఈజీగా సినిమా చేశాం. శాతకర్ణి గురించి చరిత్రలో చాలా తక్కువ విషయాలే వున్నాయి. కొన్ని కల్పిత సంఘటనలతో క్రిష్‌ బ్యూటిఫుల్‌ కథ రెడీ చేశారు.

హార్స్‌ రైడింగ్‌లో ట్రైనింగ్‌ ఏమైనా తీసుకున్నారా?
– ఫిజికల్‌గా నా వరకూ ఫిట్‌నెస్‌ అంటే ఆరోగ్యంగా ఉంటా. ఎక్కువ గంటలు పని చేసే శక్తి కలిగి ఉండటం, సిక్స్‌ప్యాక్‌, బాడీ బిల్డింగ్‌లాంటివి నేను పెద్దగా పట్టించుకోను. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అంటూ నేనేదైనా చేసినా అందరూ నవ్వుతారు. సిక్స్‌ ప్యాక్‌లు అనేవి అసలు మన కల్చర్‌ కాదు. ఎప్పుడూ నేను సహజంగా వుండటానికే ఇష్టపడతాను. ఇక హార్స్‌ రైడింగ్‌ విషయానికొస్తే సెట్లోకి వచ్చాక డైరెక్టర్‌ షాట్‌ ఓకే అనగానే వెళ్ళి హార్స్‌ రైడింగ్‌ చేసేవాడ్ని. అంతే కానీ ప్రత్యేకించి ట్రైనింగ్‌ అంటూ ఏమీ తీసుకోలేదు.

ఈ సినిమాలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు వుంది?
– నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ అనేది కొంతవరకు వుంటుంది. డైరెక్టర్‌ ఏది చెబితే అది చెయ్యడం నా బాధ్యత. కమర్షియల్‌గా సినిమా వర్కవుట్‌ అయ్యేలా చూసుకోమని క్రిష్‌కి సజెషన్‌ ఇచ్చా. అలాగే అనవసరమైన కామెడీ సీన్స్‌ వద్దని చెప్పా. సీన్‌ బాగా రావడం కోసం మేమిద్దరం డిస్కస్‌ చేసుకుని చేసేవాళ్లం. ఫైనల్‌గా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. మేమంతా చాలా హ్యాపీగా వున్నాం.
ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు రిలీజయ్యాయి.

ఈ పోటీని మీరు ఎలా స్వీకరిస్తారు?
– ఆరోగ్యకరమైన పోటీ ఉండటంతో తప్పు లేదు. పోటీ ఉంటేనే మనం ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఈ సంక్రాంతికి చిరంజీవిగారి సినిమా, నా సినిమా ఒకేసారి వచ్చాయి. ఇండస్ట్రీలో నేను ఎవరితోనైనా ఎక్కువగా కలుస్తానంటే అది చిరంజీవిగారితోనే. మా ఇద్దరి సినిమాలు బాగా ఆడటం చాలా సంతోషంగా వుంది.

ఇతర హీరోలతో ఎవరితో క్లోజ్‌గా మూవ్‌ అవుతారు?
– నేను పెద్దగా ఎవ్వరితోనూ కలవను. నా పనుల్లో నేను ఎప్పుడూ బిజీగా వుంటా. ఒక ప్రక్క షూటింగ్‌, మరో ప్రక్క బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ పనులు చూసుకోవాలి. అదీ కాకుండా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ప్రజలందరికీ సేవ చెయ్యాలి. అందువల్ల కాస్త బిజీ అయియా.

‘రైతు’ సినిమా గురించి?
– కృష్ణవంశీ అద్భుతమైన కథ రెడీ చేశాడు. ఒక సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వుంటుంది. అదే ‘రైతు’. స్టోరీ విని చాలా ఎగ్జైట్‌ అయ్యాను. అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అమితాబ్‌గారిని కలిశాం. ఆయన ఒప్పుకుంటేనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తాం.

మీ అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఎప్పుడు?
– ఈ ఇయర్‌ ఎండింగ్‌లో వుంటుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి క్రిష్‌ డైరెక్షన్‌ టీమ్‌లో వర్క్‌ చేశాడు.

మోక్షజ్ఞ ఎలాంటి సినిమా చెయ్యాలనుకుంటున్నారు?
– ప్రస్తుతానికి ఇంకా ఏమీ అనుకోలేదు. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. అన్నీ ఫైనల్‌ అయ్యాక చెబుతాను.

మీరిద్దరూ కలిసి నటించే చిత్రం ఎప్పుడు?
– నేను, మోక్షజ్ఞ కలిసి ‘ఆదిత్య 999’ చిత్రంలో నటిస్తాం. దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది.

మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తారా?
– మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడానికి నేను రెడీ. కాకపోతే నా క్యారెక్టర్‌ ఇంప్రెస్‌ అయి నచ్చితే డెఫినెట్‌గా చేస్తా. త్వరలోనే ఒక హీరోతో మల్టీస్టారర్‌ చెయ్యాలనే ఐడియా వుంది.

హేమమాలిని, శ్రియ పెర్‌ఫార్మెన్స్‌ గురించి?
– మదర్‌ క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుండాలని చాలామందిని అనుకున్నాం. ఫైనల్‌గా హేమమాలినిగారు అయితే బాగుంటుందని సెలెక్ట్‌ చేశాం. తల్లి పాత్రలో హేమమాలినిగారు చాలా అందంగా అద్భుతంగా నటించారు. అలాగే శ్రియ బ్యూటిఫుల్‌గా నటించింది. ఇద్దరూ తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. శ్రియ తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అన్నంతగా పెర్‌ఫామ్‌ చేసింది. మిగతా సహ నటులందరూ ఎంతో హార్డ్‌వర్క్‌ చేశారు.

నిర్మాతలు మేకింగ్‌ గురించి?
– రాజీవ్‌రెడ్డి, సాయిబాబు, బిబో శ్రీనివాస్‌ పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా 79 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు. ఇలాంటి భారీ చిత్రం చెయ్యాలంటే ఎంతో గట్స్‌ వుండాలి. ముగ్గురూ మంచి ప్యాషన్‌ వున్న నిర్మాతలు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బ్రహ్మాండంగా వున్నాయి. సినిమాకి ఏం కావాలో క్షణాల్లో ఎరేంజ్‌ చేసేవారు. ఈ చిత్రాన్ని ఇంత బాగా తీసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here