గత కొద్దిరోజలుగా కరోనా వ్యాధి ప్రభావంతో మిగతా రంగాలతో పాటు సినిమా రంగం కూడా మూతబడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రెండున్నర నెలల అనంతరం నిన్నటి నుండి టివి, సినిమా షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో పాస్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. ఇకపోతే నేడు చిరంజీవి, నాగార్జున, డి సురేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ లో కలిసి షూటింగ్స్ ప్రారంభంతో పాటు థియేటర్స్ రీ ఓపెనింగ్ సహా పలు ఇతర విషయాల గురించి చర్చించడం జరిగింది. అయితే వారందరి విజ్ఞాపనలు విన్న సీ ఎం సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సినిమా పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. కాగా కొద్దిసేపటి క్రితం ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి, తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సి ఎం జగన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సి ఎం శ్రీ వై ఎస్ జగన్ గారికి కృతఙ్ఞతలు.
షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి సి ఎం జగన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల ఇరు ముఖ్యమంత్రులు కూడా సినిమా పరిశ్రమ విషయమై సానుకూలంగా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు సినీ పరిశ్రమ వారు అభిప్రాయపడుతున్నారు……!!



