‘టాక్సీవాలా’ రివ్యూ

0
437

బ్యానెర్లు : జి.ఎ.2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, యమున, ఉత్తేజ్, మధు నందన్, రవివర్మ, రవిప్రకాష్, కళ్యాణి, సిజ్జు మీనన్, చమ్మక్ చంద్ర, పంకజ్ కేసరి తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
మాటలు: సాయికుమార్‌రెడ్డి
నిర్మాత: ఎస్.కె.ఎన్.
రచన, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
విడుదల తేదీ: 17.11.2018

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాల ఘనవిజయాలతో హీరోగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘నోటా’ నిరాశపరచింది. ఈ వారం ‘టాక్సీవాలా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? టాక్సీవాలాగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన శివ(విజయ్ దేవరకొండ) జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్‌లోని తన ఫ్రెండ్(మధునందన్) దగ్గరకి వస్తాడు. అతను చూపించిన రెండు, మూడు జాబ్స్ శివకి శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వవు. ఒక టాక్సీ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్‌గా సెటిల్ అవ్వమని ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఒక పాత కారుని కొని టాక్సీ డ్రైవర్‌గా మారతాడు. ఆ టైమ్‌లోనే అతనికి అను(ప్రియాంక జవాల్కర్) పరిచయమవుతుంది. పరిచయం కాస్తా ప్రేమ వరకు వెళుతుంది. శివ లైఫ్ ఇలా హ్యాపీగా గడిచిపోతున్న సమయంలో అతని కారులో కొన్ని నమ్మశక్యంకానీ ఘటనలు జరుగుతాయి. అతని కారులో ప్రయాణించిన ఒక డాక్టర్ ఊహించని విధంగా యాక్సిడెంట్‌కి గురై చనిపోతాడు. దాంతో షాక్ అయిన శివ ఈ మిస్టరీని తెలుసుకునేందుకు కారు అమ్మిన ఓనర్‌ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, అతను అందుబాటులో ఉండడు. ఫ్రెండ్స్‌తో కలిసి దొంగతనంగా ఆ ఓనర్ ఇంటిలో ప్రవేశిస్తాడు. అక్కడ చనిపోయిన డాక్టర్ ఫోటోని చూస్తాడు. అంతేకాకుండా ఒక ప్రొఫెసర్(రవివర్మ) బంధింపబడి ఉంటాడు. చివరికి ఆ కారులో సిశిర(మాళవిక నాయర్) అనే అమ్మాయి ఆత్మ ఉందని తెలుసుకుంటాడు శివ. ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు హెల్ప్ చెయ్యాలనుకుంటాడు. ఆ అమ్మాయి ఆత్మ కారులోనే ఎందుకు ఉంది? ఆ డాక్టర్‌ని ఎందుకు చంపింది? ప్రొఫెసర్‌ని ఎందుకు బంధించారు? సిశిర ఆత్మ ఏం కోరుకుంటోంది? సిశిర ఆత్మ శాంతించేందుకు శివ ఏం చేశాడు అనేది తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
టాక్సీ డ్రైవర్‌గా విజయ్ దేవరకొండ నటన బాగుంది. కామెడీ సీన్స్‌లో, హారర్ సన్నివేశాల్లో అతని పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ప్రియాంక తన గ్లామర్‌తో అలరించింది. కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో మంచి నటనను ప్రదర్శించింది. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన మధునందన్, వినోద్ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తమ కామెడీతో అందర్నీ నవ్వించారు. సిశిర క్యారెక్టర్‌లో మాళవిక నాయర్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. యమున, కళ్యాణి, రవిప్రకాష్, రవివర్మ, సిజ్జు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను ప్రదర్శించారు.

సాంకేతిక నిపుణులు:
ఈ తరహా హారర్ థ్రిల్లర్స్‌కి సినిమాటోగ్రఫీ, సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సుజిత్ సారంగ్ మంచి ఫోటోగ్రఫీని అందించారు. సిట్యుయేషన్‌కి తగిన లైటింగ్‌తో విజువల్‌గా ఆడియన్స్‌ని మంచి మూడ్‌లోకి తీసుకెళ్ళారు. జేక్స్ బిజోయ్ చేసిన పాటలు బాగున్నాయి. కథతోపాటే వెళ్ళే పాటలు కావడంతో ఆడియన్స్ ఏ దశలోనూ బోర్ ఫీల్ అవ్వరు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని ఒక లెవల్‌కి తీసుకెళ్ళారు జేక్స్. ఈ సినిమాని 2 గంటల 12 నిమిషాలకు ఎడిట్ చేసి సినిమా స్పీడ్‌గా వెళ్లడానికి కారకులయ్యారు ఎడిటర్ శ్రీజిత్ సారంగ్. నిర్మాత ఎస్.కె.ఎన్. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. ఇక డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ ఈ కథను రెడీ చేసుకున్నారు. కథకు తగ్గ సీన్స్ రాసుకొని దానికి కామెడీని కూడా జోడించి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే మర్డర్ సీన్ ఆడియన్స్‌కి ఉత్కంఠ కలిగిస్తుంది. నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనేది ప్రేక్షకులు ఊహించలేని విధంగా పకడ్బందీగా సినిమాని నడిపించారు. ఆడియన్స్‌ని థ్రిల్ చేసే సన్నివేశాలు, నవ్వించే మంచి కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్, విజయ్ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాటమ్ లైన్  : ఈ ‘టాక్సీవాలా’ తో ప్రేక్షకుడికి హ్యాపీ జర్నీ
ఇండస్ట్రీహిట్.కామ్ రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here